తెలంగాణలో ఏసీబీ దాడులు, అరెస్టులు జరిగినప్పుడు సోషల్ మీడియాలో వచ్చే హడావుడి చూసి వారందరూ రోడ్డునపడిపోయి ఉంటారని అనుకుంటారు. వందల కోట్లు.. పదుల కోట్ల ఆస్తులు. బయటపడ్డాయని వాటన్నింటినీ స్వాధీనం చేసుకుని ఉంటారని అనుకుంటారు. కానీ బయట జరుగుతోంది మాత్రం వేరే. అవినీతి నిరోధక శాఖ వలలో చిక్కిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ వెల్లడించిన విషయాలు సామాన్యులకు షాక్ ఇస్తాయి.
రెడ్ హ్యాండెడ్‌గా దొరికినా విచారణకు అనుమతి ఇవ్వని ప్రభుత్వాలు
ఐదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఈ ఐదేళ్లలో మొత్తం 621 కేసులు నమోదు కాగా, సగటున ఏడాదికి 120 మంది అధికారులు ఏసీబీకి దొరికిపోతున్నారు. అయితే, పట్టుబడిన వారిలో కేవలం 25 శాతం మందిపై మాత్రమే ప్రభుత్వం ప్రాసిక్యూషన్ కు అనుమతినిస్తోంది. మిగిలిన 75 శాతం మందిపై కేవలం శాఖాపరమైన చర్యల పేరుతో లేదా ట్రిబ్యునళ్లకు బదిలీ చేయడం ద్వారా ప్రభుత్వం వారిని పరోక్షంగా కాపాడుతోంది
సాంకేతిక కారణాలతో బయటపడుతున్న అవినీతి పరులు
సగం మందికి పైగా సాంకేతిక కారణాలతో నిర్దోషులుగా బయటపడుతున్నారు. 2023-24లో 19 కేసులు క్లోజ్ అవ్వగా, కేవలం 9 మందికి మాత్రమే శిక్ష పడిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది. 2024-25లో 22 కేసుల్లో 12 మందికి శిక్ష పడగా, మరో 10 మంది విముక్తి పొందారు. శిక్ష పడే రేటు అతి తక్కువగా ఉండటం వల్ల ఏసీబీ భయం అధికారుల్లో తగ్గిపోతోంది. భద్రూ నాయక్ అనే అధికారి 2008లో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దొరికిన ఈయనపై, ప్రాసిక్యూషన్ అనుమతి రావడానికే 16 నెలలు పట్టింది. 2011లో ఛార్జ్ షీట్ దాఖలైనప్పటికీ, 15 ఏళ్లు గడిచినా నేటికీ కోర్టులో తుది తీర్పు రాలేదు. ఈ లోపే సదరు అధికారి తిరిగి విధుల్లో చేరి, పదోన్నతి పొంది, మళ్లీ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు.
ప్రభుత్వం ఎందుకు కాపాడుతోంది ?
ఉద్యోగుల్లో అవినీతి అంటే భయం పుట్టేలా చేయాలంటే ప్రాసిక్యూషన్ అనుమతుల ప్రక్రియలో వేగం పెంచాలి. పట్టుబడిన వెంటనే అనుమతులు మంజూరు చేయడం, కేసుల విచారణ కోసం ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడం ద్వారా మాత్రమే అవినీతి అధికారుల్లో వణుకు పుట్టించగలరు. ప్రాసిక్యూషన్ అనుమతుల నిర్ణయాన్ని రాజకీయ నాయకుల దగ్గర ఉంటే వారు అవినీతిలో వాటా తీసుకుని అనుమతులు రాకుండా చేస్తున్నారు. అలా కాకుండా రిటైర్డ్ జడ్జిలతో కూడిన ఒక స్వతంత్ర ప్యానల్‌కు అప్పగించాలన్న డిమాండ్లు ఉన్నాయి. లేకపోతే ఏసీబీ దాడులతో ప్రయోజనం ఏముంటుంది ?
