తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ 75.3 శాతం మేర నమోదయింది. నిన్న రాత్రి పది గంట తర్వాత ఈసీ.. 69 వరకే లెక్క చెప్పింది. కానీ అప్పటికీ.. జిల్లాల నుంచి పూర్తి వివరాలు రాకపోవడంతో.. పెరగొచ్చు.. తగ్గొచ్చని.. ఈసీ వర్గాలు చెప్పాయి. నిజానికి అన్ని పోలింగ్ స్టేషన్ల సమాచారాన్ని క్రోడీకరించిన తర్వాత తెలంగాణ వ్యాప్తంగా 75.3 శాతం పోలింగ్ నమోదయినట్లుగా తేల్చారు. అత్యధికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 86.97 శాతం ఓటింగ్ నమోదైంది. హైదరాబాద్ చిట్ట చివరన ఉంది. ఉమ్మడి జిల్లాల వారీగా పోలింగ్ శాతం.. ఖమ్మం – 84.26, మెదక్ 82.00, ఆదిలాబాద్ 81.00, వరంగల్ 79.11, నిజామాబాద్ 78.51, మహబూబ్ నగర్ 78.36, కరీంనగర్ 77.05, రంగారెడ్డి 54.97, హైదరాబాద్ 50.86 శాతం పోలింగ్ నమోదైనట్లు.. అధికార వర్గాలు చెబుతున్నాయి.
ఇవన్నీ జిల్లాల వారీగా అక్కడి స్థానిక యంత్రాంగాలు వెల్లడించిన సమాచారం. ప్రధాన ఎన్నికల అధికారిక రజత్ కుమార్ సైనీ మాత్రం.. ఈ వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. పోలింగ్ ఎంత మేర జరుగుతోందనే విషయంపై.. ఎన్నికల సంఘానికి ఎప్పటికప్పుడు అప్ డేట్ వస్తుంది. రిటర్నింగ్ అధికారులు.. గంట గంటకు ఈసీకి అప్ డేట్ చేస్తారు. చివరికి వారి లెక్కల్లో ఎంత తేడా వచ్చినా.. నాలుగు, ఐదు శాతం మేర తేడా రావడం కష్టం. కానీ ఎన్నిక సంఘం.. మాత్రం నిన్న పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఎన్నికల శాతం విషయంలో గుంభనంగా వ్యవహరిస్తోంది. రెండు గంటలకో సారి పోలింగ్ పర్సంట్ ప్రకటిస్తామని చెప్పారు. మొదటి నుంచి పరిమితంగానే పోలింగ్ జరుగుతోందన్నారు.
హైదరాబాద్ లో అయితే.. సాయంత్రం నాలుగు గంటల వరకు 38 శాతం మాత్రమే పోలింగ్ జరిగిందన్న సమాచారం ఇచ్చారు. సాయంత్రం అది 68 అన్నట్లుగానే చెప్పుకొచ్చారు. కానీ.. పూర్తి సమాచారం మేరకు.. మీడియా స్థానిక అధికారుల నుంచి ఆరా తీస్తేనే.. 75 శాతం దాటిపోయింది. రేవంత్ రెడ్డి అరెస్ట్ దగ్గర్నుంచి వేల సంఖ్యలో ఓటర్ల పేర్లు జాబితాలో గల్లంతవడం వరకూ నేక విషయాల్లో ఎన్నికల సంఘం విమర్శలు ఎదుర్కొంటోంది. ఇప్పుడు.. కనీసం ఎన్నికల పర్సంటేజీని కూడా.. పూర్తి స్థాయిలో చెప్పలేకపోవడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి.