వ్యాపారం ఏదైనా సరే, అందులో పెట్టుబడి పెట్టిన వ్యక్తికే ఆ వస్తువు లేదా సేవ ధరను నిర్ణయించుకునే హక్కు ఉండటం సహజ సూత్రం. కానీ తెలుగు రాష్ట్రాల్లో సినిమా పరిశ్రమకు మాత్రం ఈ స్వేచ్ఛ కరువైంది. కోట్లాది రూపాయలు వెచ్చించి సినిమా తీసే నిర్మాతకు, తన సినిమా టికెట్ ధరను తాను నిర్ణయించుకునే అధికారం లేకపోవడం సినీ వర్గాలకు పెద్ద సమస్యగా మారింది. వినోదం అనేది అత్యవసర సేవ కాదు, అది ఒక వ్యక్తి ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. అలాంటి వినోద రంగంపై ప్రభుత్వాలు ధరల నియంత్రణ పేరిట పెత్తనం చేయడం నిర్మాతలను ఆర్థికంగా దెబ్బతీయడమే.
ప్రభుత్వాల ద్వంద్వ నీతి
ప్రభుత్వాల ద్వంద్వ నీతిని ఇక్కడ గమనించాలి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కిందకు వచ్చే ఆర్టీసీ బస్సుల్లో పండుగలు, రద్దీ సమయాల్లో డైనమిక్ ప్రైసింగ్ పేరుతో 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తున్నది ప్రభుత్వమే. రవాణా అనేది సామాన్యుడి కనీస అవసరం, అలాంటి రంగంలోనే ధరలు పెంచే ప్రభుత్వం, కేవలం వినోదం కోసం మాత్రమే ఉండే సినిమా టికెట్లపై ఆంక్షలు విధించడం దారుణం. హోటల్స్‌లో భోజనం ధర, వస్త్ర దుకాణాల్లో బట్టల ధరను నిర్ణయించే అధికారం ఆ వ్యాపారస్తులకు ఉన్నప్పుడు, సినిమా నిర్మాతలకు ఆ హక్కు ఎందుకు ఉండకూడదనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
అన్ని సినిమాలకూ ఒకే రేటు ఉండటం అన్యాయమే !
స్టార్ హోటల్లో భోజనం రేటు వెయ్యి ఉంటుంది.. మామూలు హోటల్లో 150కి లభిస్తుంది. ఎందుకంటే స్టార్ హోటల్ బడ్జెట్ వేరు. సినిమాలకీ అదే ఎందుకు వర్తించదు. నిర్మాతలకు తమ బిజినెస్ గురించి పూర్తి అవగాహన ఉంటుంది. టికెట్ రేటు విపరీతంగా పెంచితే ప్రేక్షకులు రారనే భయం వారిలోనూ ఉంటుంది. మార్కెట్ డిమాండ్‌ను బట్టి ధరలు పెంచుకోవడం లేదా తగ్గించుకోవడం అనేది వ్యాపార వ్యూహం. ఇప్పటికే చాలా మంది నిర్మాతలు చిన్న సినిమాలకు తక్కువ ధరలు నిర్ణయించి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే, ప్రేక్షకులకు ఏ ధర అందుబాటులో ఉంటుందో నిర్మాతలకు తెలుసు.
ప్రభుత్వం నిర్మాతలకే స్వేచ్ఛ ఇవ్వాలి!
ప్రభుత్వం కేవలం పన్నులు వసూలు చేయడానికే పరిమితం కాకుండా, సినిమాను ఒక పరిశ్రమగా గుర్తించి నిర్మాతలకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వాలి. ఒక భారీ బడ్జెట్ సినిమా తీసినప్పుడు, మొదటి వారం రోజులు డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో రేట్లు పెంచుకునే వెసులుబాటు ఉంటేనే నిర్మాతలు భారీ నష్టాల నుంచి గట్టెక్కుతారు. థియేటర్ల నిర్వహణ ఖర్చులు, విద్యుత్ చార్జీలు పెరిగిన ప్రస్తుత తరుణంలో, పాత కాలపు టికెట్ ధరలతో థియేటర్లను నడపడం సాధ్యం కాదు. ఇలాంటి ఆంక్షల వల్ల పైరసీ పెరగడమే కాకుండా, థియేటర్ వ్యవస్థే కుప్పకూలే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఓటీటీల పోటీని తట్టుకుంటున్న చిత్ర పరిశ్రమను ప్రభుత్వ ఆంక్షలు మరింత కుంగదీస్తున్నాయి.
సినిమా నిర్మాతల్ని పిండేసుకోవద్దు !
ప్రభుత్వాలు సినిమా రంగంపై కేవలం నియంత్రణ సంస్థలుగా కాకుండా, ఒక మద్దతుదారుగా నిలవాల్సిన అవసరం ఉంది. సినిమా అనేది లక్షలాది మందికి ఉపాధినిచ్చే రంగం. నిర్మాత నష్టపోతే ఆ ప్రభావం మొత్తం పరిశ్రమపై పడుతుంది. కాబట్టి, టికెట్ ధరల నిర్ణయాధికారాన్ని నిర్మాతకే వదిలేయాలి. అప్పుడే ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది, సినిమా రంగం కూడా ఆర్థికంగా నిలదొక్కుకుంటుంది.
