ఈసీ ఎవరి కోసం ఇన్ని మాటలు ఎందుకు పడుతోంది..?

ఎన్నికల సంఘం విశ్వసనీయత పూర్తి స్థాయిలో ప్రమాదంలో పడింది. ఫ్రీ అండ్ ఫెయిర్‌గా ఎన్నికలు నిర్వహించడంతో.. ఎన్నికల సంఘం విఫలమై.. బీజేపీకి కొమ్ముకాసే విషయంలో ఏ మాత్రం సిగ్గుపడకపోతూండటంతో.. విపక్ష పార్టలన్నీ చివరి విడతకు ముందు.. ఈసీ బండారాన్ని నిరసనల ద్వారా బట్టబయలు చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో మరింత యాక్టివ్‌గా ఉన్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లి నేరుగా సీఈసీ ముందే నిరసన తెలియచేయబోతున్నారు.

ఈసీ బీజేపీకి అమ్ముడుపోయిందన్న దీదీ..!

తృణమూల్ చీఫ్.. మమతా బెనర్జీ… ఎన్నికల సంఘం బీజేపీకి అమ్ముడుపోయిందని తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ మేరకు.. బహిరంగప్రకటన చేయడమే కాదు.. కావాలంటే.. తాను ఈ ఆరోపణలపై జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నానని.. ఎన్నికల సంఘానికి సవాల్ చేశారు. నిజానికి ఎన్నికల సంఘం.. నీతిగా, నిజాయితీగా ఉంటే.. మమతా బెనర్జీ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎన్నికల సంఘం.. అలా చేస్తే.. మొత్తం గుట్టు బయటపడుతుంది. అందుకే కిక్కురుమనకుండా ఉంది. బెంగాల్‌లో ఘర్షణల పేరుతో ఒక రోజు ప్రచారాన్ని కుదించిన ఈసీ… చివరి రోజు.. రాత్రి పది గంటల వరకు ప్రచార గడువు పెంచింది. అలా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే.. మోడీ ప్రచారసభ ఏర్పాటు చేసుకోవడం కోసం. ఘర్షణల పేరుతో ఒక రోజు ప్రచారాన్ని కుదించి.. అదే మోడీ కోసం… ఐదు గంటల సమయాన్ని పెంచడంతో..మమతా బెనర్జీ రగిలిపోయారు.

చంద్రగిరి రీపోలింగ్ వెనుక ఈసీ గూడుపుఠాణి ఉందంటున్న టీడీపీ..!

ఇక ఆంధ్రప్రదేశ్‌లో… చంద్రగిరిలో.. ఐదు పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్ కు ఆదేశించడానికి.. ఎన్నికల సంఘం.. అన్ని రకాల అతిక్రమలు చేసింది. సాధారణంగా .. అక్రమాలు జరిగాయన్న నివేదికలు.. ప్రిసైడింగ్ అధికారి నుంచి.. రిటర్నింగ్ అధికారి నుంచి లేదా.. కలెక్టర్ నుంచి రావాలి. అది పద్దతి. ఎంత ఎన్నికల కమిషన్‌కు సర్వాధికారాలు ఉన్నా… ఓ పద్దతి ప్రకారం చేయడం.. ఆ సంస్థ విధి. కానీ… ఏదో ఒప్పందం జరిగినట్లుగా… వైసీపీ అభ్యర్థి 22 రోజుల తర్వాత ఫిర్యాదు చేయడం… వెంటనే రీపోలింగ్ కు ఆదేశించడం.. అంతా.. ఓ ప్రసహనంగా సాగుతోంది. ఇది రాజ్యాంగ విరుద్ధమని.. ఈసీ తన నిబంధనలను తానే ఉల్లంఘిస్తోందని చంద్రబాబు నేరుగా ఈసీ ముందే.. నిరసనకు సిద్ధమయ్యారు.

ఏ తప్పూ చేయకపోతే ఈసీ ఎందుకు సైలెంట్‌గా ఉంటోంది..?

ఎన్నికల ప్రారంభం నుంచి బీజేపీ పట్ల చూసీచూడనట్లు పోతున్న ఈసీ … చివరికి వచ్చే సరికి.. బీజేపీని గెలిపించడానికి ఎన్నిరకాల నిర్ణయాలను తీసుకోవాలో.. అన్ని రకాల నిర్ణయాలు ఏ మాత్రం సిగ్గుపడకుండా తీసుకుంటున్నారు. విపక్ష పార్టీలు… అత్యంత దారుణమైన పదాలతో విరుచుకుపడుతున్నా.. ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా… ఎన్ని వివరణలు కోరుతున్నా… తమకు రాజ్యాంగం సర్వాధికారాలు ఇచ్చిందన్న ఉద్దేశంతో.. సైలెంట్ గా ఉండిపోతున్నారు. అదే బీజేపీ ఫిర్యాదు చేస్తే క్షణం కూడా ఆలోచించడం లేదు. ఏ విధంగా చూసినా స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి ఎన్నికలు గతంలో ఎప్పుడూ జరగలేదన్న అభిప్రాయం మాత్రం.. సామాన్యుల్లో సైతం ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com