ప్రజాస్వామ్యానికి ఊపిరి చట్టసభలు. వాటిలో చర్చలు జరిగితేనే నిజానిజాలేమిటో ప్రజలకు తెలుస్తాయి. ప్రభుత్వం తీసుకు వస్తున్న చట్టాలపై లోటుపాట్లేమిటో అక్కడ చట్టాలు జరిగితేనే తెలుస్తాయి. కానీ విపక్ష పార్టీలు పూర్తి స్థాయిలో దారి తప్పాయి. పార్లమెంట్ ను జరగనీయకుండా అడ్డం పడుతున్నాయి. ఫలితంగా ప్రజా సమస్యలపై పార్లమెంట్ లో చర్చలు జరగడంలేదు. చట్టాలపై జరగడం లేదు. కానీ వీధి పోరాటాలు మాత్రం జరుగుతున్నాయి. దీని వల్ల ప్రజలకు.. దేశానికి ఎలాంటి మేలు జరుగుతుంది?
పార్లమెంట్లో చర్చలకు ముందుకు రాని ఇండీ కూటమి
పార్లమెంట్లో చర్చల్ని వదిలి పెట్టి ఇండీ కూటమి సభ్యులు ఎన్నికల సంఘం కార్యాలయాన్ని ముట్టడించడానికి వెళ్లారు. పద్దతిగా వెళ్లి తమ అభ్యంతరాలు చెప్పి పరిష్కారాలు కనుగొనవచ్చు. కానీ వారు రాజకీయాలు చేయాలనుకున్నారు. ధర్నాలు చేశారు. డ్రామాలు చేశారు. సాయంత్రం..స్టార్ హోటల్లో విందు చేసుకున్నారు. కానీ పార్లమెంట్ సంగతేమిటి ?. తమ కోసం చర్చలు జరుపుతారని ఆశిస్తున్న ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?. కేంద్రం పార్లమెంట్ సమావేశాలు జరగకపోతూండటంతో బిల్లులను పెట్టేసి.. చర్చ లేకుండా ఆమోదించేసింది. కొత్త ఇన్ కంట్యాక్స్ బిల్లును కూడా ఆమోదించారు. కానీ ఇవేమీ విపక్ష పార్టీలకు పట్టలేదు.
తాము అనుకున్నది చర్చించకపోతే సభలో గందరగోళం
ఆపరేషన్ సిందూర్ పై చర్చించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. దానికి కేంద్రం అంగీకరించింది. చర్చ జరిగింది. తర్వాత బీహార్ లో జరుగుతున్న ఓట్ల సవరణ ప్రక్రియపై చర్చించాలని పట్టుబట్టింది. అంతే కానీ.. ఇతర అంశాలపై తమకేమీ సంబంధం లేదని తాము చర్చించడానికి ప్రతిపాదించినవి మాత్రమే చర్చించాలని లేకపోతే అడ్డుకుంటామన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. ఏ అంశంపైనైనా చర్చించడానికి సిద్ధంగా ఉండాలి. కానీ విపక్షం తాము అనుకున్నది చర్చించకపోతే సభ జరగడనికి వీల్లేదన్నట్లుగా వ్యవహరిస్తూండటంతో చట్టసభలు జరగడం లేదు.
ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఎప్పుడు అర్థం చేసుకుంటారు ?
ప్రజలు వీధి పోరాటాలను రాజకీయంగానే చూస్తారు. పార్లమెంట్ లో జరిగే చట్టాలను మాత్రమే అధికారికంగా భావిస్తారు. అక్కడ బయటకు వచ్చే నిజాలను మాత్రం యాక్సెప్ట్ చేస్తారు. ఎన్నికల సంఘం ఎదుట ఎన్ని వీధిపోరాటాలు చేసినా.. ఉనికి ప్రయత్నమే అనుకుంటారు. ప్రజాస్వామ్య స్ఫూర్తిని రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండీ కూటమి ఎప్పుడు తెలుసుకుంటుదో.. అప్పుడే ఆ కూటమికి మంచి రోజులు వస్తాయి. లేకపోతే ఎప్పటికీ ఎదురు చూపులే మిగులుతాయని చెప్పాల్సిన పని లేదు.