వైసీపీ కోసం రాజకీయ కుట్రలు చేసి జైలుకెళ్లాడు జోగి రమేష్. కానీ జగన్ రెడ్డి ఆయనను పట్టించుకోవడం లేదు. చాలా రోజులుగా జైల్లో మగ్గిపోతున్నా ఆయనను పలకరించేందుకు జగన్ మనసొప్పలేదు. జైల్లో కుమిలిపోతున్న జోగి పుండుమీద కారం చల్లినట్లుగా తాను జైలుకెళ్తే పార్టీలు చేసుకున్నారని ప్రచారం జరుగుతున్న తన సొంత పార్టీకి చెందిన నేతల్ని పరామర్శకు పంపారు. ఒక్క జోగి రమేష్ కాదు.. అరెస్టు అయిన ఎంతో మంది నేతల్ని జగన్ పట్టించుకోవడంలేదు. ఆ జాబితాలో చెవిరెడ్డి కూడా ఉన్నారు.
జైలుకెళ్లి పరామర్శలు ఆపేసిన జగన్
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ వ్యవహారశైలిలో కనిపిస్తున్న మార్పులు ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో, క్షేత్రస్థాయిలో పోరాడుతున్న నేతలకు ఆయన అండగా నిలబడటం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కోసం, జగన్ కోసం ముందుండి పోరాడి కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్లిన నాయకులను ఆయన విస్మరిస్తున్నారనే భావన క్యాడర్లో బలంగా నాటుకుపోతోంది. మొదట్లో ఒకటి, రెండు సార్లు నెల్లూరు, విజయవాడ జైళ్లకు వెళ్లి అరెస్టయినా వైసీపీ నేతల్ని పరామర్శించారు కానీ ఆ తర్వాత మిథున్‌రెడ్డిని కూడా పట్టించుకోలేదు.
నేతల్లో పెరుగుతున్న అసంతృప్తి
జోగి రమేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి వంటి కీలక నేతలు జైలుకు వెళ్లినప్పుడు ఆరంభంలో కొంత హడావిడి కనిపించినా, ఆ తర్వాత జగన్ వారిని పట్టించుకోవడం మానేశారనే వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా అత్యంత సన్నిహితుడిగా పేరున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వంటి వారిని కూడా జగన్ పరామర్శించకపోవడం పార్టీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మేము తప్పులు చేసింది, కేసులు ఎదుర్కొంటోంది ఆయన కోసమే కదా, మరి కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం పలకరించరా అన్న ఆవేదన సదరు నేతల్లోనూ, వారి అనుచరుల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది.
ఒంటరవుతున్న నాయకత్వం
గతంలో జగన్ కోసం జైలుకు వెళ్లడానికైనా సిద్ధపడిన నేతలు, ఇప్పుడు ఆయన చూపిస్తున్న ఉదాసీనతతో మానసికంగా కుంగిపోతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి పనిచేసినా, అధినేత నుంచి కనీస నైతిక మద్దతు లభించకపోవడంతో వారంతా ఒంటరితనానికి లోనవుతున్నారు. ఈ ధోరణి వల్ల ద్వితీయ శ్రేణి నాయకత్వం కూడా రేపు మనకు ఏదైనా జరిగితే పార్టీ అండగా ఉంటుందా అనే సందేహంలో పడిపోయింది. జగన్ వ్యవహారశైలి ఇలాగే కొనసాగితే, పార్టీ కోసం కష్టపడే వారి సంఖ్య తగ్గిపోయే ప్రమాదం ఉంది. నాయకులను కలుపుకుపోవడంలో ఆయన విఫలమవుతున్నారనే సంకేతాలు వెళ్లడం వల్ల, పార్టీలో అంతర్గత విభేదాలు పెరిగి మరికొంతమంది నేతలు ఇతర పార్టీల వైపు చూసే అవకాశం ఉంది. రాజకీయాల్లో అధికారం లేనప్పుడు నేతలకు భరోసా ఇవ్వడమే ప్రధాన బలమని, కానీ జగన్ ఆ విషయంలో వెనకబడ్డారని సొంత పార్టీ నేతలు మథనపడుతున్నారు.
