ప్రొ.నాగేశ్వర్ : ఫెడరల్ ఫ్రంట్ ప్రచారంలో కేసీఆర్ ఎక్కడ..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత… టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు చేశారు. అంతకు ముందు ఓ సారి.. ఎన్నికల తర్వాత మరోసారి పలువురు నేతల్ని వెళ్లి కలసి వచ్చారు. అయితే.. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల సమరం.. కీలక దశకు చేరుకున్న తర్వాత కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడటం లేదు. ఆ పార్టీల కోసం ప్రచారానికి వెళ్లడం లేదు.

“కూడగట్టిన 150 మంది ఎంపీల”కు మద్దతుగా కేసీఆర్ ఎందుకు ప్రచారం చేయడం లేదు..?

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కేసీఆర్.. ప్రధానంగా ఫెడరల్ ఫ్రంట్ గురించే చెప్పారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీలు అధికారంలోకి వస్తాయని… తన నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్ చరిత్ర సృష్టిస్తుందని కేసీఆర్ నేరుగానే ప్రకటించారు. అయితే.. పదహారు సీట్లతో ఏం చేస్తారని… వచ్చిన విమర్శలకు కూడా.. ధీటుగానే కౌంటర్ ఇచ్చారు. తనకు వచ్చేది పదహారు సీట్లే కానీ.. తాను ఇప్పటికే వంద నుంచి నూటయాభై మందికిపైగా.. ఎంపీల్ని పోగేశానని చెప్పుకొచ్చారు. వారంతా అండగా ఉంటారని ప్రకటించారు. దేశంలో గుణాత్మక మార్పు రావాలని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వల్లే… దేశానికి ఈ దుస్థితి అని పదే పదే చెప్పారు. ఇలా మాటలు చెప్పడమే కాదు.. అంతకు ముందు కొన్ని రాష్ట్రాలకు వెళ్లి .. ఫెడరల్ ఫ్రంట్‌పై చర్చలు జరిపారు. స్టాలిన్, దేవేగౌడ, మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ వంటి నేతల్ని కలిశారు. అఖిలేష్ హైదరాబాద్ వచ్చి కలిశారు. అయినప్పటికీ.. ఇప్పుడు కేసీఆర్ సైలెంట్‌గా ఉన్నారు. అంతగా ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నించినప్పుడు.. ఇప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు..? ఆ పార్టీల తరపున ఎందుకు ప్రచారం చేయడం లేదు..?. కామ్‌గా కూర్చుకుంటే.. అన్ని పార్టీలను.. ఒకే తాటిపైకి ఎలా తేగలరు..?

కాంగ్రెస్, బీజేపీలతో పొత్తులు పెట్టుకోని పార్టీలకు ప్రచారం చేయవచ్చు కదా..?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. కాంగ్రెస్ నేతృత్వంలో ఓ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తమిళనాడు వెళ్లి డీఎంకేకు అనుకూలంగా ప్రచారం చేశారు. కర్ణాటక వెళ్లి.. కాంగ్రెస్, జేడీఎస్ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ప్రచారం చేశారు. కానీ కేసీఆర్ వెళ్లలేదు. గతంలో బెంగళూరు వెళ్లి.. జేడీఎస్ నేతలతో కలిశారు. ఇప్పుడు.. ఆ జేడీఎస్ నేతలకు అనుకూలంగా ఎందుకు ప్రచారం చేయడం లేదు. కర్ణాటకలో ఎంతో మంది తెలుగువాళ్లు ఉన్నారు. అయినా కేసీఆర్ ఎందుకు.. మద్దతుగా ప్రచారం చేయడం లేదు. అలాగే.. మమతా బెనర్జీ.. అటు కాంగ్రెస్‌తోనూ.. ఇటు బీజేపీతోనూ… కలవలేదు.. .అలాగే కేజ్రీవాల్ కూడా.. కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకోలేకపోయారు. వీరందరి తరపున కేసీఆర్.. ఎందుకు ప్రచారం చేయడం లేదు. బెంగాల్, ఢిల్లీలో తెలుగువాళ్లు బాగానే ఉన్నారు. నాన్ కాంగ్రెస్ , నాన్ బీజేపీ పార్టీలు ఉన్నప్పటికీ.. కేసీఆర్ వాటికి కూడా అనుకూలంగా ప్రచారం చేయడం లేదు.

కాంగ్రెస్, బీజేపీలను ఓడించాలని తెలంగాణ బయట ఒక్క సారి అయినా పిలుపునిచ్చారా..?

కేసీఆర్ విధానం నాన్ బీజేపీ.. నాన్ కాంగ్రెస్. మరి ఇలాంటి విధానం ఉన్న పార్టీలకు అయినా… కేసీఆర్ మద్దతు ప్రకటించాల్సి ఉంది. అయా రాష్ట్రాల్లో ఆయా పార్టీలకు ఓట్లు వేయాలని ప్రచారం చేయాల్సింది. కాంగ్రెస్, బీజేపీలకు ఎందుకు ఓట్లు వేయకూడదో… ప్రకటించాల్సి ఉంది. కానీ కేసీఆర్ అలాంటి ప్రయత్నం చేయడం లేదు. అక్కడే అందరికీ వస్తున్న అనుమానం ఏమిటంటే… ఎన్నికల తర్వాత… టీఆర్ఎస్ బీజేపీ పంచన చేరుతుందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే… కేసీఆర్.. కాంగ్రెస్ ను ఓడించండి.. బీజేపీని ఓడించండి.. అని తెలంగాణ సరిహద్దు దాటి వెళ్లి చెప్పడం లేదు. అదే తన స్పష్టమైన విధానమైతే దేశం అంతా తిరిగి చెప్పవచ్చు. ఈ రెండు జాతీయ పార్టీలు దేశాన్ని భ్రష్టుపట్టించాయని చెబుతూంటారు. ఢిల్లీకి వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి.. ఆ మాటలు చెప్పవచ్చు కదా. దీన్ని బట్టి చూస్తే.. నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ అనే పరిస్థితి లేదు. కాంగ్రెస్ ను నిలువరించే ప్రయత్నం చేస్తారు.. అనే అనుమానాలు.. కలిగేలా… మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉండటంలో తప్పు లేదు కానీ… జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాననన్నారు కాబట్టే.. కేసీఆర్ మౌనంగా ఉండటం అందరికీ అనుమానాలు కలిగేలా చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com