జనసేన అధినేత పవన్ కల్యాణ్… విభజన హామీల విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఉద్యమాలు, పోరాటల విషయంలో.. బీజేపీకి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం మరోసారి ఉక్కు పరిశ్రమ కోసం జరుగుతున్న ఆందోళనలపై ఆయన స్పందించిన విధానంతో మరోసారి స్పష్టమయిందని విమర్శలు వస్తున్నాయి. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం అసాధ్యమంటూ… కేంద్ర ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించడంతో ఏపీలో రాజకీయ వేడి ప్రారంభమయింది. తెలుగుదేశం పార్టీ దీన్ని అందిపుచ్చుకుంది. సీఎం రమేష్.. ఉక్కుదీక్ష పేరుతో.. ఆమరణ దీక్ష ప్రారంభించారు. ఐదు రోజులు ముగిసిపోయింది. ఇన్ని రోజులు.. కడప ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో స్పందించని పవన్.. ఆదివారం మాత్రం… విభిన్నంగా స్పందించారు. ఉక్కు ఫ్యాక్టరీ కావాలో వద్దో చెప్పకుండా.. తెలుగుదేశం పార్టీనే గతంలో పరిశ్రమను అడ్డుకుందని ఆరోపణలు చేసి సరి పుచ్చారు.
గతంలో టీడీపీ అడ్డుకుంది.. నేతలు కమిషన్లు తీసుకుంటున్నారు.. లాంటి ఆరోపణలు ఏ ప్రభుత్వం ఉన్నా… ప్రతిపక్ష పార్టీల నుంచి వస్తూనే ఉంటాయి. వాటిలో ఎంత నిజం ఉందో.. ఎప్పుడూ బయటకు రాదు. పవన్ కూడా అలాగే ఆరోపణలు చేశారని అనుకుందాం… అది వేరే విషయం. కానీ కడప జిల్లాలో.. విభజన చట్టం ప్రకారం… ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాల్సిన కేంద్రాన్ని పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదనే ప్రశ్న వస్తోంది. విభజన చట్టానికి కేంద్రం..తనకు ఇష్టం వచ్చిన అన్వయం చేసుకుని… తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. పవన్ మాట్లాడితే మేధావులతో సమావేశాలు జరుపుతున్నానంటారు..ఈ విషయం ఆయనకు ఎవరూ చెప్పలేదా..?. స్టీల్ ఫ్యాక్టరీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించాల్సిందేనన్న డిమాండ్ కేంద్రానికి పవన్ కల్యాణ్ ఎందుకు చేయడం లేదు…?
విభజన హామీల విషయంలో పవన్ కల్యాణ్ వ్యవహారశైలి కొంత కాలం నుంచి ఇంతే ఉంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి… మరీ.. తమ హక్కులు తమకు ఇవ్వాల్సిందేనని పోరాటం చేస్తూంటే.. అటు వైసీపీ అధినేత జగన్ కానీ.. ఇటు పవన్ కానీ.. నోరు మెదపడం లేదు. ప్రత్యేకహోదా కోసం.. టీడీపీ ధర్మపోరాట దీక్షలు చేసినప్పడు కానీ..ఇప్పుడు స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఉక్కు దీక్షలు చేస్తున్నప్పుడు కానీ.. ఇద్దరి వ్యవహారశైలి అంతే ఉంది. ఇద్దరూ మద్దతు తెలుపడం లేదు. సరే రాజకీయ పార్టీగా అధికార పార్టీకి మద్దతు తెలుపడం అనేది కరెక్ట్ పాలసీ కాకపోతే.. సొంతంగా అయినా ఉద్యమాలు చేయవచ్చు కదా..? కనీసం ప్రకటనలు అయినా చేయవచ్చు కదా…? కానీ కేంద్రానికి ఏ మాత్రం నొప్పి తెలియకుండా ఎందుకు వ్యవహరిస్తున్నారు..?
వైఎస్ జగన్‌కు అంటే.. చాలా పరిమితులున్నాయి. ఆయనపై ఎన్నో కేసులున్నాయి. ఇప్పటికిప్పుడు కేంద్రానికి అడ్డం తిరిగితే ఏమైనా జరగొచ్చనే భయం ఉంటుంది. కానీ పవన్ కల్యాణ్ ఎందుకు… సైలెంట్‌గా ఉంటున్నారు..?. ప్రతి అంశాన్ని రాజకీయం చేసి… టీడీపీపై ఆరోపణలు చేస్తే.. నడిచిపోతుందని ఎందుకనుకుంటున్నారు..?
—- సుభాష్