జనసేనకు ఓటేయాలి..! గుర్తేమిటో కాస్త చెబుతారా..?

తెలంగాణ జనసమితి పార్టీని కోదండరాం నిన్నామొన్ననే పెట్టారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని.. ఊహించలేదు. అయినా పార్టీ పెట్టినప్పటి నుంచి దానికి ఎన్నికల సంఘం దగ్గర నుంచి గుర్తింపు కోసం… పార్టీకి ఎన్నికల గుర్తు కోసం.. పదే పదే ఢిల్లీ వెళ్లి అనుకున్నది సాధించి. అగ్గిపెట్టె గుర్తు తెచ్చుకున్నారు. ప్రజల్లోకి ఆ గుర్తును తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్ పార్టీ పెట్టి అటూఇటుగా ఆరేళ్లవుతోంది. జనసేన పార్టీ గుర్తేమిటి..?. అసలు అలాంటి ఆలోచన ఏమైనా చేశారా..? . ముందస్తు ఎన్నికలు వస్తాయని చాలా కాలం కిందట ప్రచారం జరిగినప్పుడు.. ఎన్నికలు ఎప్పుడొచ్చినా రెడీనే అనే పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు ముందస్తు వస్తాయని ఊహించలేదని.. అందుకే పోటీ చేయడం లేదన్న కారణం చూపిస్తున్నారు. మరి ఏపీ ఎన్నికల వరకైనా సన్నాహాలు పూర్తవుతాయా..?

ఇప్పుడు కాకపోయినా… ఏపీ ఎన్నికల సమయానికైనా పార్టీ గుర్తు కోసం.. ఈసీ దగ్గరకు పరుగెత్తాల్సిందే కదా. ఇప్పటివరకు కనీసం పార్టీ గుర్తు కోసం పవన్ చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటినుంచి ప్రయత్నిస్తే కానీ, ఎన్నికల నాటికి జనసేన కంటూ ఓ గుర్తు వస్తుంది. ఆ దిశగా అడుగులు వేయకపోతే, పవన్ ఎన్ని స్థానాల్లో పోటీ చేసినా, ఉమ్మడి గుర్తు మాత్రం రాదన్నది సుస్పష్టం. బిగించిన పిడికిలిని తన పార్టీ గుర్తుగా ప్రకటించినా అది.. ఎన్నికల సంఘం వద్ద ఉందో లేదో తెలియదు. ఉంటే.. దాన్ని తన పార్టీ కోసం కేటాయించమని దరఖాస్తు పెట్టుకోవాలి. ఒక వేళ లేకపోతే.. ఈసీ ఇచ్చే చాయిస్‌ నుంచి తీసుకోవాలి. గతంలో ప్రజారాజ్యం పార్టీ గుర్తు విషయంలోనూ ఇదే జరిగింది. ఆఖరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన ఎన్నికల గుర్తు ..సుప్రీంకోర్టుకు వెళ్తే కానీ.. ఫైనల్ కాలేదు. అప్పుడే ఉమ్మడి గుర్తు వచ్చింది. అప్పుడు కూడా.. చివర్లో రైలింజన్ గుర్తును ఎంచుకున్నారు. ఆ గుర్తు దెబ్బకొట్టిందని తర్వాత ఊదయించే సూర్యుడి గుర్తుకు మారారు. ఆ అనుభవాలతోనైనా పవన్.. గుర్తు కోసం.. సీరియస్‌గా ఎందుకు ప్రయత్నించడం లేదో ఫ్యాన్స్‌కు అర్థం కావడం లేదు.

బీజేపీ చేతుల్లోనే ఎన్నికల సంఘం ఉంటుంది కదా.. తాము ఎప్పుడు కోరుకుంటే.. అప్పుడు .. ఏ గుర్తు కోరుకుంటే.. ఆ గుర్తు వస్తుందని.. జనసేన పెద్దలు అనుకోవచ్చు కానీ… దాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు కూడా చాలా సమయం పడుతుంది. ఎంత టెక్నాలజీని వాడుకున్నా, కిందిస్థాయిలోకి పార్టీ గుర్తు తీసుకెళ్లడం అంత సులువు కాదు. గ్రామగ్రామాల క్యాడర్ ఉంటేనే అది సాధ్యమవుతుంది. పార్టీకి కామన్ సింబల్ కోసం పవన్ ఎప్పుడు ప్రయత్నిస్తారో, ఎప్పుడు అధికారికంగా ఫలానా గుర్తే మా జనసేన గుర్తని ఎప్పుడు చెప్తారో అన్న అనుమానం జనసైనికుల్లో ఉంది. కొన్నాళ్ల క్రితం.. బిగించిన పిడికిలిని చూపించిన పవన్.. అదే తమ పార్టీ గుర్తు అన్నారు. అలాంటి గుర్తు ఈసీ జాబితాలో లేదు. ఆ పిడికిలినే ప్రచారం చేస్తే.. ఏ చెయ్యి అయితే ఏమయిందని.. జనసైనికులు కాంగ్రెస్‌కు గుద్దినా ఆశ్చర్యం లేదేమో..? ఎందుకంటే వారు పవర్ స్టార్ ఫ్యాన్స్ మరి..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com