ఏపీలో జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా అన్నమయ్య జిల్లా కేంద్రం మార్పు అంశం హాట్ టాపిక్ అయింది. గత ప్రభుత్వ హయాంలో రాయచోటిని జిల్లా కేంద్రంగా చేశారు. కానీ కూటమి ప్రభుత్వం దానిని మదనపల్లెకు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఓ జిల్లాను ఏర్పాటు చేయకపోతే ప్రజలు మర్చిపోతారు. కానీ ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాన్ని మారిస్తే మాత్రం ఆగ్రహిస్తారు. ఆ విషయం తెలియనంత అమాయకంగా రాజకీయ నేతలు ఉండరు. కానీ మార్చారు. రాజకీయ లాభనష్టాలుఅంచనా వేయకుండా మార్చాల్సిన అవసరం ఏర్పడిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
జిల్లా కేంద్రంగా మదనపల్లె అనుకూలం
మదనపల్లె ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండో అతిపెద్ద పట్టణం. జనాభా పరంగా, విస్తీర్ణం పరంగా రాయచోటి కంటే మదనపల్లె పెద్దది. బ్రిటీష్ కాలం నుండే మదనపల్లె విద్యా, వైద్య రంగానికి హబ్‌గా ఉంది. ఇక్కడ మెడికల్ కాలేజీ, సెంట్రల్ యూనివర్సిటీ ప్రతిపాదనలు ఉండటం, ఇప్పటికే ఉన్న ఆసుపత్రులు, విద్యాసంస్థలు జిల్లా కేంద్రానికి అవసరమైన వసతులు ఉన్నాయి. టమోటా మార్కెట్, సిల్క్ పరిశ్రమ వల్ల మదనపల్లె రాష్ట్రంలోనే ఒక ముఖ్యమైన వాణిజ్య కేంద్రంగా ఉంది. దీనిని జిల్లా కేంద్రం చేయడం ద్వారా ఆర్థిక వృద్ధి వేగవంతం అవుతుందని ప్రభుత్వం భావించింది.
రాయచోటిని ఎందుకు మార్చాలనుకున్నారు?
అన్నమయ్య జిల్లాలో ఒకవైపు చివరన ఉండే రైల్వేకోడూరు, రాజంపేట ప్రజలు రాయచోటి కంటే కడప లేదా తిరుపతికి వెళ్లడం సులభమని భావించారు. అభిప్రాయసేకరణలో ్దే చెప్పారు. రాజంపేట ప్రజలు కడపలో, రైల్వేకోడూరు వారు తిరుపతిలో కలవాలని కోరుకోవడంతో, అన్నమయ్య జిల్లా పరిధి తగ్గిపోయింది. మిగిలిన మూడు నియోజకవర్గాల్లో మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు జలకు మదనపల్లె అన్ని విధాలా మధ్యస్థంగా, అందుబాటులో ఉంటుంది. రాజంపేట, కోడూరు నియోజకవర్గాలు పక్క జిల్లాల్లో విలీనం కావడంతో, రాయచోటి భౌగోళికంగా జిల్లాలో ఒక మూలకు పడిపోయింది. అందుకే పరిపాలనా సౌలభ్యం కోసం కేంద్ర స్థానంలో ఉన్న మదనపల్లెను ఎంచుకోవాల్సి వచ్చింది. రాయచోటి జిల్లా కేంద్రానికి రాయచోటి ప్రజలు మాత్రమే సెంటిమెంట్ తో ఉన్నారు. ఇతర నియోజకవర్గాల వాసులు సిద్ధంగా లేరు.
రాయచోటి అభివృధ్ధికి హామీ
రెండేళ్లుగా జిల్లా కేంద్రంగా ఉండటంతో రాయచోటిలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు, మౌలిక సదుపాయాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు హోదా తొలగిస్తే ఆ పనులు ఆగిపోతాయని, భూముల ధరలు పడిపోతాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. * తన సొంత నియోజకవర్గమైన రాయచోటి ప్రజలకు జిల్లా కేంద్రంగా నిలబెడతానని మాట ఇచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి, క్యాబినెట్ నిర్ణయంతో ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ఉద్వేగానికి లోనయ్యారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మదనపల్లె ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారు. కానీ రాయచోటిలో నిరసనలు కొనసాగుతున్నాయి. వారి నిరసనలకూ అర్థం ఉంది. ఇచ్చింది తీసేసుకుంటే ఎవరికైనా ఆగ్రహం వస్తుంది.
