ఇరాన్ క్షిపణులు , డ్రోన్ దాడులు గల్ఫ్ దేశాలలోని పర్యాటక కేంద్రాలు, నివాస ప్రాంతాలపై పడటం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది. దుబాయ్‌లోని పామ్ జుమేరా వంటి విలాసవంతమైన ప్రాంతాలు, బెహ్రెయిన్‌లోని నివాస సముదాయాలు దాడులకు గురైనప్పటికీ, ఈ దేశాలు ఇరాన్‌పై నేరుగా ప్రతిదాడికి దిగలేదు. దీనికి చాలా కారణాలున్నాయి. అందులో మొదటిది… ఆర్థిక నష్టం.
ఆర్థిక విధ్వంసం పట్ల భయం
గల్ఫ్ దేశాలైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ , సౌదీ అరేబియా , ఖతార్‌లు ప్రస్తుతం తమ ఆర్థిక వ్యవస్థను కేవలం చమురుపైనే కాకుండా పర్యాటకం, విదేశీ పెట్టుబడులు , అంతర్జాతీయ వ్యాపార కేంద్రాలుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఇరాన్‌తో నేరుగా యుద్ధానికి దిగితే, ఈ వ్యాపార అనుకూల ఇమేజ్ పూర్తిగా దెబ్బతింటుంది. విదేశీ కంపెనీలు, పెట్టుబడిదారులు ఈ ప్రాంతం నుండి తప్పుకునే ప్రమాదం ఉందని, అందుకే ఆర్థిక స్థిరత్వం కోసం ఈ దేశాలు సంయమనం పాటిస్తున్నాయి.
ఇరాన్లో అస్థిరత మొత్తం గల్ఫ్‌కు సమస్యే
ఇరాన్ ఒక పెద్ద భౌగోళిక శక్తి. ఒకవేళ గల్ఫ్ దేశాలు ప్రతిదాడి చేసి ఇరాన్ పాలన కుప్పకూలితే, ఆ దేశంలో ఏర్పడే అస్థిరత మొత్తం మధ్యప్రాచ్యాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. ఇరాన్ నుండి లక్షలాది మంది శరణార్థులు సముద్ర మార్గం ద్వారా దుబాయ్, ఒమన్ వంటి దేశాలకు వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇరాన్ మద్దతు ఉన్న మిలిటెంట్ గ్రూపులు ఈ దేశాల్లోని చమురు క్షేత్రాలు , మౌలిక సదుపాయాలపై గెరిల్లా దాడులు చేసే ప్రమాదం ఉందని గల్ఫ్ దేశాలు భయపడుతున్నాయి.
ఇజ్రాయెల్-అమెరికా ముద్ర పడకుండా జాగ్రత్త
ముస్లిం ప్రపంచంలో తమ ప్రాబల్యాన్ని కాపాడుకోవాలని సౌదీ అరేబియా వంటి దేశాలు భావిస్తాయి. ఇరాన్‌పై దాడి చేస్తే, తాము అమెరికా లేదా ఇజ్రాయెల్ పక్షాన నిలబడినట్లు ముస్లిం దేశాల్లో సంకేతాలు వెళ్తాయని వారు ఆందోళన చెందుతున్నారు. ఇరాన్ ఇప్పటికే ఈ దాడులను ఆత్మరక్షణ గా చిత్రీకరిస్తోంది. ఈ తరుణంలో ప్రతిదాడి చేస్తే, ఇరాన్ దానిని ఇస్లామిక్ దేశాల మధ్య యుద్ధంగా మార్చి ప్రజల్లో సానుభూతి పొందే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇరాన్ దాడులు జరిపినప్పటికీ, గల్ఫ్ దేశాలు ప్రస్తుతానికి ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ వేదికలపై ఇరాన్ తీరును ఖండిస్తూ, ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అమెరికా తన స్థావరాలను రక్షించుకోవడంలో విఫలమైందని కొన్ని దేశాలు అసంతృప్తిగా ఉన్నప్పటికీ, నేరుగా యుద్ధం కంటే రక్షణ వ్యవస్థలను బలోపేతం చేసుకోవడమే మేలని ఈ దేశాలు భావిస్తున్నాయి.


