కోహ్లీ..!ధోనిపై నీ వైఖరి స‌రైందేనా!!

చిన్న టీమైనా పెద్ద టీమైనా గెలుపు గెలుపే. పాకిస్థాన్ ప్ర‌స్తుత ఐసీసీ చాంపియ‌న్ ట్రోఫీలో బంగ్లాదేశ్ కంటే బ‌ల‌హీన‌మైన జ‌ట్టు. షోయ‌బ్ మాలిక్ మిన‌హా ఆ జ‌ట్టులో పెద్ద ఆట‌గాళ్ళెవ‌రూ లేరు. ట్రోఫీకి ముందు కోచ్ విషయంలో వివాదాన్ని రేపిన కోహ్లీ పించ్ హిట్ట‌ర్ అయిన మ‌హేంద్ర సింగ్ ధోనికి చివ‌రి ఓవర్ల‌లో ఆడే అవ‌కాశాన్ని ఇవ్వ‌కుండా… ఒక‌ప్పుడు ధోనీ ప్ర‌త్య‌ర్థి అయిన యువ‌రాజ్ సింగ్‌ను నెత్తినెత్తుకోవ‌డం వెనుక వ్యూహం క‌నిపిస్తోంది. ధోనీని పూర్తిగా వ‌దిలించుకునేందుకు కోహ్లీ పావులు క‌దుపుతున్న‌ట్లే ఉంది. వ‌రుస‌గా విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ స‌చిన్ టెండుల్క‌ర్‌ను త‌నంత‌ట త‌ను రిటైర‌య్యే వ‌ర‌కూ బీసీసీఐ వేచి చూసి త‌ప్ప త‌ప్పుకోమ‌ని ఏనాడూ స‌చిన్‌ను కోర‌లేదు.

భార‌త జ‌ట్టుకు అత్య‌ధిక విజయాల‌ను అందించి, అన్ని ఫార్మాట్ల‌లోనూ ఇండియా జ‌ట్టును స‌మున్న‌త శిఖ‌రాల‌కు చేర్చిన హెలికాప్ట‌ర్ షాట్ సృష్టికర్త‌ను అవ‌మానించి వ‌దిలించుకోవాల‌నేది కోహ్లీ లేదా జ‌ట్టు యాజ‌మాన్య వ్యూహంగా క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం ప‌రుగుల‌తో పాటు అత్య‌ధిక ఆదాయాన్ని రాబ‌ట్ట‌గ‌ల మెషిన్ కోహ్లీ అయ్యుండచ్చు గానీ… ధోనీ మాదిరిగా కూల్ ప్ర‌వర్త‌న‌తో విజ‌యాల‌ను సాధించిపెట్టే ద‌న్ను అత‌డికి లేదు. ఆస్ట్రేలియా జ‌ట్టు మాదిరిగా ప్ర‌త్య్తర్థిని త‌న టెంప‌ర్‌తో ట్యాంప‌ర్ చేసి, పైచేయి సాధించానుకునే త‌త్వం కోహ్లీది. యువ‌రక్తంతో ఉర‌క‌లెత్తుతున్న కోహ్లీ వైఖ‌రిని త‌ప్పుప‌ట్ట‌లేం. కానీ, టెస్ట్ కెప్టెన్సీని విరాటునికి క‌ట్ట‌బెట్ట‌డానికి ఎమ్ఎస్‌వి ప్ర‌సాద్ న‌డిపిన మంత్రాంగం కార‌ణంగానే ధోనీ ఒక్క ట్వీట్‌తో టెస్టు కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. బీసీసీఐకి క‌నీసం లేఖ కూడా రాయ‌లేదు. అంటే ధోనికి బీసీసీఐ ఎంత విలువిచ్చిందీ తెలిసిపోతుంది.

పెద్ద ఆట‌గాళ్ళ‌ను గౌర‌వించండి. ఇవేమీ బిష‌న్ సింగ్ బేడీ రోజులు కావు. ఆయ‌న్ను జ‌ట్టునుంచి త‌ప్పించిన‌ప్పుడు ది ఇండియ‌న్ ఎక్స్‌ప్రెస్ మొద‌టి పేజీలో `బాంబ్ షెల్ డ్రాప్డ్‌` అనే హెడింగ్‌తో వార్త ప్ర‌చురించింది. క్రికెట్‌కు అప్ప‌ట్లోనే ఎంత క్రేజ్ ఉండేదో ఆ వార్త చెబుతుంది. రైట్ ఆర్మ్ స్పిన్న‌ర్ అయిన బిష‌న్ బేడీ వేసిన బంతిని ఫెన్సింగ్ దాటించిన బ్యాట్స్‌మేన్‌ను అదే ఓవ‌ర్లో బేడీ పెవిలియ‌న్‌కు పంపిస్తాడ‌నే పేరుండేది. అంత‌టి క్రీడాకారుని గౌర‌వంగా సాగ‌నంపడం మాని అవ‌మాన‌క‌రంగా జ‌ట్టునుంచి తొల‌గించిన బీసీసీఐకి ధోని ఒక లెక్క కాదు. ఇప్ప‌టికీ త‌నలో చేవ చ‌చ్చిపోలేద‌ని ధోని త‌న కీపింగ్ ప్ర‌తిభ‌తో నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఇక అత‌డిని నిరోధించ‌గ‌లిగేది బ్యాటింగ్‌లో మాత్ర‌మే. అందుకే
కోహ్లీ పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో ఈ వ్యూహాన్ని అనుసరించాడు. 2019 వ‌ర‌ల్డ్ క‌ప్ వ‌ర‌కూ వ‌న్డే జ‌ట్టులో కొన‌సాగిస్తామ‌నే హామీతోనే ధోనీ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడ‌నేది అంతర్గ‌త వ‌ర్గాల క‌థ‌నం. అన్నం పెట్టిన చేతిని కుక్క క‌ర‌వ‌క‌పోవ‌చ్చు కానీ.. ఆ కుక్క‌ను వ‌దిలించుకోవ‌డానికి పిచ్చెక్కింద‌నే ముద్ర వేసే య‌జ‌మాని పాత్ర‌ను ధోనీ అంశంలో బీసీసీఐ పోషించింది. ధోని కూల్ హెడ‌ర్ కాబ‌ట్టి.. త‌న భావాల‌ను పైకి ప్ర‌క‌టించ‌డు కాబ‌ట్టి.. బీసీసీఐ ప‌రువూ, ఎమ్ఎస్కే మంత్రాంగ‌మూ వెల్ల‌డి కాలేదు. ఎప్పుడో ధోనీ జీవిత చ‌రిత్ర రాయ‌క‌పోడు.. అందులో ఈ అంశాలు వెల్ల‌డి కాక‌పోవు..
-సుబ్ర‌హ్మ‌ణ్యం విఎస్ కూచిమంచి

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com