ఏపీలో వైసీపీ పాలనను టీడీపీ వాళ్లు విమర్శించడం కామన్. కానీ మిత్రులు విమర్శించడం మాత్రం కామన్ కాదు. అయితే తమ పాలన గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఏపీ పాలనను దారుణంగా కించ పరిస్తే మాత్రం ఎంత మిత్రుడికైనా కోపం వస్తుంది. విచిత్రంగా వైసీపీ నేతలకు మాత్రం ఎలాంటి రోషం రాదు. తుడి చేసుకుని పోతూంటారు. అందుకే ఇలాంటి కామెంట్లు తెలంగాణ వైపు నుంచి పెరిగిపోతున్నాయి.
ఏపీ సర్కార్ తీరును సాక్ష్యాంగా చూపించి తాము ఎంత గొప్పగా పరిపాలిస్తున్నామో చెప్పేందుకు హరీష్ రావు ఎప్పుడూ ముందుంటారు. మరోసారి ఆయన అదే మాటలు మాట్లాడారు. ఏపీలో ఉద్యోగులు, టీచర్లు సమస్యలపై పోరాటం చేస్తే కేసులు పెట్టి లోపలేస్తున్నారని .. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం మంచి ఫిట్మెంట్ ఇచ్చి గౌరవంగా చూస్తోందన్నారు. ఏపీలో టీచర్లు పీఆర్సీ, సీపీఎస్ రద్దు కోసం ఉద్యమిస్తున్నారు. ఈ సందర్భంగా వారిపై అనేక రకాల కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో వారితో బ్రాందీ షాపుల దగ్గర డ్యూటీలు వేయడం.. బాత్ రూములు కడిగించడం వంటివి చేయిస్తున్నారని ఫోటోలు బయటకు వస్తున్నాయి. ఈ అంశాలనే హరీష్ ప్రస్తావించి.. తెలంగాణ టీచర్లకు తాము ఎంత మంచి చేస్తున్నామో వివరించే ప్రయత్నం చేశారు.
హరీష్ రావు ఎప్పుడు ఏపీ సర్కార్‌పై సెటైర్లు వేయాలన్నా ముందుగా కరెంట్ మీటర్ల అంశాన్ని తెరపైకి తెస్తారు. ఈ సారి కూడా అదే అంశాన్ని హైలెట్ చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టడం అంటే రైతుల మెడకు ఉరితాడు తగిలించడమేనని .. అలా మీటర్లు పెట్టేందుకు అంగీకరించి ఏపీ సర్కార్ అప్పు తెచ్చుకుందన్నారు. తామూ ఒప్పుకుంటే ఏటా రూ. ఆరు వేల కోట్లు వస్తాయని కానీ రైతుల గురించి ఆలోచించే.. తాము ఆ సొమ్మును వదులుకున్నామన్నామన్నారు. తాను తిరుపతి వెళ్లినప్పుడు.. తాడిపత్రికి చెందిన ఓ రైతును కరెంట్ పరిస్థితి గురించి వాకబు చేశానని కానీ మూడు గంటలు.. అదీ కూడా వచ్చీ పోతూంటుందని రైతు చెప్పారని హరీష్ రావు తెలిపారు.
ఏపీ సర్కార్‌ను ఆలా టార్గెట్ చేస్తోంది హరీష్ రావు ఒక్కరే కాదు. ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్, చివరికి కేటీఆర్ కూడా ఏపీ సర్కార్ తీరును తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు. ఓ సందర్భంలో కేటీఆర్ అయితే.. ఏపీలో నివసించడం నరకం అని తన స్నేహితులు చెప్పారని ప్రకటించారు. ఇంత పరువు తీస్తున్నా వైసీపీ నేతలకు చీమ కుట్టినట్లుగా కూడా ఉండటం లేదు.