విశ్వాసం చూపే నేతలను జగన్ ఎందుకు దూరం చేసుకుంటున్నారు..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొన్నాళ్ల క్రితం వరకూ.. జగన్‌పై అమితమైన అభిమానం చూపే నేతల్లో.. గిడ్డి ఈశ్వరి ముందు ఉంటారు. పాడేరు ఎమ్మెల్యే అయిన గిడ్డి ఈశ్వరి.. జగన్‌పై అభిమానం చూపేందుకు చంద్రబాబును వ్యక్తిగతంగా కూడా దూషించారు. తల నరుకుతా లాంటి ఘాటు వ్యాఖ్యలను కూడా చేశారు. అలాంటి నేత… జగన్‌ను విడిచి పెట్టి.. టీడీపీలో చేరతారని ఎవరైనా ఊహిస్తారా..?. ఇప్పటికీ ఆమె తనకు టీడీపీలో చేరడం ఇష్టం లేకపోయినా.. చేరాల్సి వచ్చిందని చెబుతూ ఉంటారు. దానికి కారణం.. జగన్‌ .. తనపై అభిమానం చూపేవారిని.. విశ్వాసంగా ఉండేవారిని… గతి లేకనే తన వద్ద ఉంటున్నారని… భావించడమే. పాడేరులో వైసీపీ తరపున ఎవరు నిలబెట్టినా గెలుస్తారన్న ఉద్దేశంతో.. పార్టీ ఫండ్ భారీగా ఇచ్చిన ఓ వ్యక్తికి… టిక్కెట్ ఖరారు చేశారట జగన్. ఈ విషయం తెలిసి గిడ్డి ఈశ్వరి తన రాజకీయ భవిష్యత్ కోసం.. వేరే దారి చూసుకోక తప్పలేదు.

ఒక్క గిడ్డి ఈశ్వరి మాత్రమే కాదు.. అటు చివరన ఉన్న భిమిలి నియోజకవర్గంలోని కర్రి సీతారామ్ అనే నేత దగ్గర్నుంచి… చిత్తూరు జిల్లాలో సీకే బాబు వరకూ.. జగన్మోహన్ రెడ్డి వదులుకున్న విధేయులు పదుల సంఖ్యలో ఉంటారు. వీరిలో చాలా మంది టీడీపీలో కూడా ఇమడ లేక.. వైసీపీలో ఆదరణ లేక సైలెంట్‌గా ఉండిపోయేవారే ఎక్కువ. తాజాగా వీరి జాబితాలోకి.. చిలుకలూరిపేట మాజీ ఎమ్మెల్యే. వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షు మర్రి రాజశేఖర్ చేరారు. వైఎస్ కు సన్నిహితునిగా పేరు పడిన మర్రి రాజశేఖర్ .. 2004లో చిలుకలూరిపేట నుంచి గెలుపొందారు. ఆ తర్వాత రెండు సార్లు ఓడిపోయారు. జగన్ వైసీపీ ప్రారంభించినప్పటి నుంచి ఆయనతో పాటే ఉన్నారు. ఆర్థిక వనరులు తక్కువే ఉన్నప్పటికీ.. పార్టీ కోసం కష్టపడుతూనే ఉన్నారు. చిలుకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావుకు ధీటైన నేత మర్రి రాజశేఖర్ మాత్రమే అని నియోజకవర్గంలో చెప్పుకుంటారు. అలాంటి నేతను కూడా.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాదనుకుంటున్నారు.

కొద్ది రోజులుగా.. చిలుకలూరిపేట నియోజకవర్గంలో.. ఎన్నారై పేరుతో.. విడదల రజనీ అనే మహిళ హడావుడి చేస్తోంది. ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. మొదట తెలుగుదేశం పార్టీలో చేరింది. వీఆర్ ఫౌండేషన్ పేరుతో… ప్రచారం చేసుకుంది. మహానాడులో.. టీడీపీ తరపున వేదికపై నుంచి మాట్లాడే అవకాశం వచ్చింది. దాంతో.. వైఎస్ జగన్‌ను చాలా తీవ్రంగా విమర్శించి… మంచి వాగ్ధాటితో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ గుర్తింపు రావడం..టీడీపీలో టిక్కెట్ వచ్చే అవకాశం లేకపోవడంతో.. వెంటనే వైసీపీ వైపు చూసింది. పార్టీ ఫండ్ భారీగా ఇచ్చి.. ప్రత్తిపాటిని ఢీకొట్టేలా ఖర్చు పెట్టుకుటానని చెప్పడంతో.. ఆమెను పార్టీలో చేర్చేసుకున్నారు. టిక్కెట్ హామీ కూడా ఇచ్చారనే ప్రచారం వైసీపీ వర్గాల నుంచే జరుగుతోంది. దీంతో మర్రి రాజశేఖర్ హతాశులయ్యారు. తాను ఆస్తులను అమ్ముకుని పార్టీ కోసం కష్టపడితే.. ఇప్పుడు జగన్ ఇలా చేశారేమిటని… బాధ పడుతున్నారు. ఆయన అనుచరులు పార్టీకి రాజీనామా చేద్దామని ఒత్తిడి తెస్తున్నారు. కానీ మర్రి రాజశేఖర్ మాత్రం వేచి చూద్దామనుకుంటున్నారు.

విచిత్రం ఏమిటంటే.. జగన్మోహన్ రెడ్డి.. నియోజకవర్గాలకు ఇన్చార్జులుగా ఎవరినైనా నియమించాలంటే..ముందుగా వారికున్న ప్రజాబలాన్ని చూడరు. ఆర్థిక బలాన్నే చూస్తారు. వారికి ఓపిక ఉన్నంత కాలం.. సొంత ఖర్చుతో పార్టీ కార్యక్రమాలు నిర్వహించగలిగేవారిని ఇన్చార్జులుగా నియమిస్తారు. వారి దగ్గర సరుకు అయిపోయిందనుకున్నప్పుడు..వేరేవారిని చూసుకుంటారు. ఎక్కడా తనపై అభిమానం, విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకోరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com