నిరవ్ మోదీని వచ్చే నెలలో భారత్ కు అప్పగించే అవకాశం ఉంది. అయితే ఆయనను తీసుకొచ్చి ఏం చేయగలరు అన్నది ఇప్పుడు ఎక్కువ మందికి వస్తున్న ప్రశ్న. విజయ్ మాల్యాను ఇంత వరకూ తీసుకురాలేకపోయారు. అలాగని వారిని అలా వదిలేయడం సమస్య పరిష్కారం కాదు. తీసుకు వచ్చి చట్టబద్ధంగా వారిని శిక్షించగలరా అన్నది ఎక్కువ మందికి వస్తున్న సందేహం. వారు పారిపోకుండా ఉంటే.. ఈ పాటికి ఇండియాలో ఎప్పట్లాగే దర్జాగా బతికేవారు. వారి కేసులో కోర్టుల్లో కోల్డ్ స్టోరేజీలో ఉండేవి.
ఇండియాలోనే ఉన్నట్లయితే దివాలా పిటిషన్లు వేసుకునేవారు అంతే !
విజయ్ మాల్యా, నిరవ్ మోదీ బ్యాంకుల వద్ద అప్పులు తీసుకుని చెల్లించలేక పారిపోయారు. లలిత్ మోదీతో మరో కేసు. ఆయన అప్పులు తీసుకోలేదు. ఏదో ఆర్థిక పరమైన అవకతవలకు పాల్పడ్డారని ఆరోపణలు. వీరంతా ఇండియా రాకుండా విదేశాల్లోనే టైంపాస్ చేస్తున్నారు. ఇండియాలో మాత్రం పారిపోయిన వారిగా ముద్రపడిపోయింది. వారు వెళ్లిపోయే ముందు కాస్త తెలివిగా ఆలోచించినట్లయితే… తాము పారిపోకుండా ఇండియాలోనే ఉండి ఉంటే.. చాలా కొద్ది రోజులు జైల్లో ఉండే వాళ్లమని.. బెయిల్ తెచ్చుకుని మళ్లీ పెద్ద మనుషుల్లా చెలామణి అయ్యే వాళ్లమని వారికి క్లారిటీ ఉండేది.
సుబ్బరామిరెడ్డికి ఉన్నంత తెలివి కూడా లేదా ?
కాంగ్రెస్ మాజీ ఎంపీ సుబ్బరామిరెడ్డి .. బ్యాంకులకు నిరవ్ మోదీ, మాల్యా తరహాలోనే డబ్బులు ఎగ్గొట్టారు. ప్రాజెక్టుల పేరుతో పెద్ద ఎత్తున అప్పులు తీసుకుని రూపాయి కూడా కట్టలేదు. చివరికి ఆరు వేల కోట్ల వరకూ తక్కువ చేసి వన్ టైం సెటిల్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు కేసులు లేవు.. అరెస్టులు లేవు. బ్యాంకుల సొమ్ములు సొంతం అయిపోయాయి. అలాంటి ప్లాన్లు కూడా మాల్యాలు, నిరవ్ మోదీలు అమలు చేసుకోలేకపోయారు.
వారిని తీసుకొచ్చినా కేసులు తేలవు !
నిరవ్ మోదీని వచ్చే నెలలో తీసుకు వస్తారు. ఇప్పటికే జైల్లో సౌకర్యాలపై బ్రిటన్ అధికారులు కూడా వచ్చి చూసి పోయారు. విజయ్ మాల్యాను కూడా అప్పగించవచ్చు. అయితే వారిని తీసుకు వచ్చి.. వారి పేర్లపై మిగిలిన ఆస్తులు ఏమైనా ఉంటే జప్తు చేస్తారు. మహా అయితే రెండు, మూడు నెలల పాటు సౌకర్యవంతమైన జైలు తర్వాత బెయిల్ పై వస్తారు. ఎప్పట్లాగే లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. కొంత కాలం తర్వాత వారి కేసుల్ని పట్టించుకునేవారు ఉండరు. భారత వ్యవస్థల్లో ఉన్న లోపాలను ఉపయోగించుకుని వారు హాయిగా ఉంటారు. ఇది మాత్రం మారదు. ప్రజలు కూడా అదంతే అనుకుని పన్నులు కట్టుకుని తమ బతుకు పోరాటం తాము చేసుకుంటారు.