“కేసీఆర్ ఫీల్డ్ లోకి వచ్చేదాకే కాంగ్రెస్ నేతల కుప్పిగంతులు ..ఒక్క సారి కేసీఆర్ గ్రౌండ్ లోకి వస్తే వార్ వన్ సైడే” అని భారత రాష్ట్ర సమితి నేతలు, కార్యకర్తలు తరచూ అధికార పార్టీకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. స్వయంగా కేటీఆర్ కూడా.. త్వరలో టైగర్ వస్తుందని అప్పుడు ఇప్పుడు తోక జాడిస్తున్న వారంతా పారిపోతారని చెబుతూ ఉంటారు. అయితే కేసీఆార్ ఎప్పుడు మళ్లీ ఫీల్డులోకి వస్తారన్నది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్ గానే ఉంది. రెండేళ్లు ముగిసిపోయాయి. ఇప్పుడు కేసీఆర్ అనూహ్యంగా ఎల్పీ మీటింగ్కు పిలుపునిచ్చారు. 19న తెలంగాణ భవన్కు కేసీఆర్ వస్తున్నారు.
జల ఖడ్గాన్ని అందుకుని వస్తున్న కేసీఆర్
కేసీఆర్ ఎల్పీ మీటింగ్ అజెండా ఏమిటో చాలా స్పష్టంగా చెప్పారు. రెండేళ్లుగా నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని .. పొరుగు రాష్ట్రాల కు హక్కులు ధారబోస్తున్నారని బీఆర్ఎస్ అంటోంది. అదే సమయంలో బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టుల్ని కూడా ఎక్కడిక్కడ ఆపేశారని ఇది తెలంగాణ రైతాంగానికి తీవ్రంగా అన్యాయ చేయడమేనని కేసీఆర్ అంటున్నారు. రైతుల్ని కదిలించే అస్త్రం నీరు. తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడానికి ఉపయోగపడిన ఆయుధాల్లో నీరు ఒకటి. ఇప్పుడు అదే ఆయుధంగా కేసీఆర్ అడుగు పెడుతున్నారు.
దిశానిర్దేశమే చేస్తారా?. తాను ముందుండి కార్యాచరణ ప్రకటిస్తారా?
అయితే బీఆర్ఎస్ పార్టీలో, నేతల్లో, కార్యకర్తల్లో ఓ సందేహం ఉంది. కేసీఆర్ ఎల్పీ మీటింగ్ పెట్టింగ్ పెడతారు. ప్రజల్లోకి వెళ్లే కార్యాచరణ ఖరారు చేస్తారు. కానీ నాయకత్వం వహిస్తారా అన్నదే ఆ సందేహం. కేటీఆర్ సమర్థంగా పార్టీని నడిపిస్తున్నారు. కానీ కేసీఆర్ నాయకత్వం అంటే వచ్చే ఊపు వేరు. అలాంటి ఊపుని ఇప్పుడు క్యాడర్ కోరుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి సంతృప్తికరమైన ఫలితాలు సాధించింది. ఇప్పుడు మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి వెళ్లాలంటే.. కేసీఆర్ గ్రౌండ్ లోకి రావాలని కోరుకుంటున్నారు. కేసీఆర్ కు అలాంటి ఆలోచన ఉందా లేదా అన్నదే ఇంకా స్పష్టత లేదు.
కేసీఆర్ రెగ్యులర్ రాజకీయాలు చేస్తే బీఆర్ఎస్ దూకుడే !
కేసీఆర్ కు ఆరోగ్యం బాగోలేదన్న ప్రచారం జరుగుతోంది. కొంత కాలంగా ఆయన బలహీనంగా ఉంటున్నారు. ఆయన ఆరోగ్యంపై పెద్దగా చర్చ జరగకూడదని కేటీఆర్ కోరుకుంటున్నారు . అందుకే రేవంత్ రెడ్డి కేసీఆర్ ఆరోగ్యం బాగోలేదని చెబుతున్నా ఆయన స్పందించడం లేదు. కేసీఆర్ ఫీల్డులోకి వచ్చి అన్ని సందేహాలకు ఒకే సారి సమాధానాలిస్తారని .. అది కూడా మాటలతో కాకుండా.. తన యాక్టివ్ పాలిటిక్స్ ద్వారానేనని కేటీఆర్ భావిస్తున్నారు. కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి ఖచ్చితంగా బయటకు వస్తారు. అది ఎప్పుడనేది 19వ తేదీన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
