విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలుగుదేశం పార్టీని అనేక రకాలుగా చిక్కుల్లోకి పెడుతున్నారు. ఇటీవల ఆయన ఉర్సా క్లస్టర్ అనే కంపెనీ వ్యవహారంలో వివాదాస్పదమయ్యారు. తాజాగా ఆయన ఏపీ లిక్కర్ స్కాంలో కీలక నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితోనూ వ్యాపారాలు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి, కేశినేని చిన్ని భార్య డైరక్టర్లుగా ఓ కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఈ మెయిల్ అడ్రస్ తోనే మరో కంపెనీ ఉంది. ఈ వివరాలన్నీ కేశినేని చిన్ని సోదరుడు..మాజీ ఎంపీ కేశినేని నాని బయట పెట్టారు.
భారత ప్రభుత్వ కంపెనీల విభాగం సమాచారం ప్రకారం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, కేశినేని చిన్న భార్య జానకి లక్ష్మి ప్రైడ్ ఇన్ఫ్రాకాన్ LLPలో భాగస్వామిగా ఉన్నారు. అరెస్టు అయిన కసిరెడ్డి సహాయకుడు దిలీప్ పైలా నిర్వహిస్తున్న ఎషాన్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా ఇదే అడ్రస్ లో ఉంది. రెండు కంపెనీలకు ఒకే ఈమెయిల్ అడ్రస్ ఉపయోగిస్తున్నారని కేశినేని నాని ఆరోపించారు. ఇంటర్నెట్లో లభించే వివరాల్లోనూ ఇదే ఉంది.
కేశినేని నాని ఆరోపణలు చేశారని కాదు కానీ.. ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో వ్యాపారాలు చేసేంత సాన్నిహిత్యం ఉంటే మాత్రం.. కేశినేని శివనాథ్ వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. కసిరెడ్డి చేసిన అత్యంత భారీ స్కాం డబ్బులతో శివనాథ్ కూడా వ్యాపారం చేశారా.. ఈ విషయాన్ని ఎవరికీ తెలియకుండా దాచి పెట్టారా అన్నదానిపై టీడీపీ క్యాడర్ కూ ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఏపీ రాజకీయాల్లో ఈ ఆరోపణలు కలకలం రేపుతున్నా.. శివనాథ్ ఇంత వరకూ స్పందించలేదు.