భయపెడితే వ్యతిరేక వార్తలు ఆగిపోతాయా..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఓ వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకుంది. ఆధారాలు లేకుండా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాస్తే.. కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు మంత్రి వర్గ సమావేశంలోనే చర్చ జరిగింది. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు… మీడియాపై కేసులు పెట్టేలా ఓవివాదాస్పద జీవోను తీసుకు వచ్చారు. దానిపై తీవ్ర విమర్శలు రావడంతో వెనుకడుగు వేశారు. ఇప్పుడు ఆ జీవోలోని అంశాలనే కొద్ది గా మార్చి.. అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేసేలా ఓ పత్రం విడుదల చేశారు. ప్రధానంగా… ఆర్టీసీ ఎండీగా ఉన్న సురేంద్రబాబును రాత్రికి రాత్రి బదిలీ చేయడంపై ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం అవాస్తవమని.. ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి కథనాలు ఇక రాకుండా చూసుకునేలా… ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే.. స్వయంగా మీడియా సంస్థను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదమవుతోంది. ఎందుకంటే.. గత పదేళ్లుగా.. ఏపీలో ఏ సర్కార్ అధికారంలో ఉన్నప్పటికీ… సాక్షి పత్రికలో… పుంఖానుపుంఖాలుగా వ్యతిరేక వార్తలు వచ్చాయి. కొన్ని లక్షల కోట్ల కుంభకోణాలంటూ.. బ్యానర్లుగా ప్రచురించారు. వాటిలో ఒక్క దానికీ ఆధారం లేదు. నిజానికి గత ఐదేళ్ల కాలంలో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. దేనికీ ఆధారాలు లేవు. చివరికి అధికారంలోకి వచ్చి నిరూపించడానికి సర్వాధికారులు చేతుల్లో ఉన్నప్పటికీ.. ఏ ఒక్కటీ బయటపెట్టలేకపోతున్నారు. అంటే లేనట్లే భావించాలి. అంతగా సాక్షి పత్రిక.. జర్నలిజం స్వేచ్ఛను వాడుకుని ఇప్పుడు.. ఇతర పత్రికలకు ఆ స్వేచ్చ తొలగించాలనుకోవడం.. విపరీత పరిణామమే.

ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియానే కాదు… సోషల్ మీడియాను కూడా.. ఈ జాబితాలో చేర్చడం.. అనూహ్య పరిణామం. సోషల్ మీడియా ను ఎలా వాడుకోకూడో.. వైసీపీ అలా వాడుకుందని.. రాజకీయవర్గాలు తీవ్రంగా విమర్శలు చేస్తూంటాయి. ఇప్పటికీ అదే తరహాలో.. వైసీపీ నేతల దూకుడు ఉందని చెబుతున్నారు. అలాంటిది.. ఇతరులు మాత్రం ఏమీ అనుకూడదని.. వ్యతిరేకత వార్తలను సహిచకూడదనుకోవడం… పక్షపాతం చూపించడమే. ఇలాంటి వాటి ద్వారా వ్యతిరేక వార్తల గొంతు నొక్కడం సాధ్యమయ్యే విషయం కాదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com