సినిమాలా? రాజ‌కీయాలా?.. ప‌వ‌న్ ప‌రిస్థితేంటి??

ఎన్నిక‌ల అంకం పూర్త‌య్యింది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌కి ఒట్టి చేతులే మిగిలాయి. అటు గాజువాక‌, ఇటు భీమ‌వ‌రం రెండు చోట్లా… ప‌వ‌ర్ స్టార్ త‌న ప‌వ‌ర్ చూపించ‌లేక‌పోయాడు. రెండింటిలో ఓ చోట ఓడిపోవ‌డం ఖాయ‌మ‌ని ముందు నుంచీ గ‌ట్టిగానే ప్ర‌చారం సాగుతోంది. భీమ‌వ‌రంలో ప‌వ‌న్ ఓడిపోతాడ‌ని, గాజువాక‌లో గెల‌వొచ్చ‌ని ప‌వ‌న్ అభిమానులూ ఓ లెక్క‌కు వ‌చ్చేశారు. కానీ అనూహ్యంగా భీమ‌వ‌రంలో గ‌ట్టి పోటీ ఇచ్చిన ప‌వ‌న్‌, గాజువాక‌లో ముందే చేతులు ఎత్తేశాడు. ఎలా చూసుకున్నా – ప‌వ‌న్ ఇప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టే అవ‌కాశాన్ని చేజార్చుకున్నాడు. ఇప్పుడు ప‌వ‌న్ ఏం చేస్తాడు? ఏం చేయ‌గ‌ల‌డు? అనేదే ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న‌.

పార్టీ అధికారంలో లేకుండా, క‌నీసం ప‌ట్టుమ‌ని ప‌దిమంది కూడా ఎం.ఎల్‌.ఏలు గెల‌వ‌కుండా, ఓ అధినేత‌గా కూడా ఓడిపోయి… ఇలాంటి క్లిష్ట‌మైన స‌మ‌యంలో పార్టీని న‌డ‌ప‌డం దాదాపు అసాధ్యం. వ‌చ్చే ఎన్నిక‌ల వ‌ర‌కూ త‌న పార్టీనీ, జెండానీ కాపాడుకోవ‌డం క‌ష్ట‌మే. ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటూ, ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ, పార్టీని గ్రామ స్థాయిలోంచి బ‌లోపేతం చేసుకోవ‌డం ఒక్క‌టే ప‌వ‌న్ ముందున్న మార్గం. అయితే ఇప్ప‌టికిప్పుడు ప‌వ‌న్ మ‌ళ్లీ ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌లేడు. కొత్త ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి, ఆ ప్ర‌భుత్వానికి కొంత స‌మ‌యం ఇచ్చి, ఆ త‌ర‌వాత‌… ప్ర‌జ‌ల ప‌క్షం వ‌కాల్తా పుచ్చుకుని మాట్లాడాలి. అందుకు టైమ్ ఉంది. ఎన్నిక‌ల ముందు ప‌వ‌న్ చుట్టూ చేరిన ఆ గుంపు కూడా ఇప్పుడీ ఫ‌లితాల‌తో చెల్లాచెదురైపోతుంది. అంటే వ‌ప‌న్ ఇప్పుడు ఒంట‌రి.

ప‌వ‌న్ ముందున్న మార్గం… సినిమాలొక్క‌టే. ప‌వ‌న్ చేతిలో ఇప్ప‌టికీ కొన్ని అడ్వాన్సులున్నాయి. ప‌వ‌న్ కోసం కొన్ని క‌థ‌లూ సిద్ధంగానే ఉన్నాయి. ఓ రెండు మూడు సినిమాలు తీసుకుని, త‌న అభిమానుల్ని అల‌రించి, ప‌నిలో ప‌నిగా ఆర్థికంగానూ కాస్త బ‌ల‌ప‌డాల్సిన అవ‌స‌రం ప‌వ‌న్‌కి ఉంది. మ‌రోవైపు పార్టీని బ‌లోపేతం చేసుకునే మార్గాలూ ఆలోచించుకోవాలి. ప‌వ‌న్ అభిమానులు కూడా ఇప్పుడు ప‌వ‌న్ నుంచి ఇదే కోరుకుంటున్నారు. ప‌వ‌న్‌ని వెండి తెర‌పై మిస్ అవుతున్నామ‌ని, ప‌వ‌న్ మ‌ళ్లీ సినిమాలు చేయాల‌ని ముక్త‌కంఠంతో చెబుతున్నారు. రాజ‌కీయాల్లో ఫెయిల్ అయినా, సినిమా రంగంలో ప‌వ‌న్ ఎప్ప‌టికీ స్టారే. ఆ క్రేజ్ త‌గ్గ‌దు. అదే ఇప్పుడు ప‌వ‌న్‌కి శ్రీ‌రామ‌ర‌క్ష‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com