ఈరోజుల్లో ప్రమోషన్లు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంత పెద్ద స్టార్ అయినా సరే, సినిమా జనంలోకి వెళ్లాలంటే గట్టిగా ప్రచారం చేయాల్సిందే. అయితే కొంతమంది స్టార్లు ప్రమోషన్లకు సహకరించరు. వాళ్ల ఇబ్బందులు, వాళ్ల బిజీ వాళ్లది. అలాంటి స్టార్స్ లో పవన్ కల్యాణ్ ఒకరు. ఆయన సినిమా షూటింగులకు సమయం ఇవ్వడమే గగనం. మళ్లీ ప్రమోషన్లకు ప్రత్యేకంగా డేట్లు ఇవ్వడం అంటే చాలా కష్టం. పవన్ సినిమా ‘హరి హర వీరమల్లు’ విడుదలకు రెడీ అవుతోంది. మెల్లగా ప్రచారాన్ని మొదలెట్టారు. ఈరోజు ఓ పాటని విడుదల చేశారు. నేరుగా రిలీజ్ చేయకుండా ఓ ప్రెస్ మీట్ పెట్టి కాస్త హడావుడి చేశారు. ఇలాంటి ఈవెంట్లు మరో మూడు నాలుగు ప్లాన్ చేశారు. అయితే వేటికీ పవన్ హాజరయ్యే అవకాశం కనిపించడం లేదు. పవన్ ఓ వైపు ఓజీ షూటింగ్ తో బిజీ. మరోవైపు ఆయన డిప్యూటీ సీఎం. బాధ్యతలు ఎక్కువ. కాబట్టి ప్రచార పర్వంలో ఆయన కనిపించే అవకాశం లేదు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు మాత్రం పవన్ వస్తారు. ఈ విషయంలో అనుమానం లేదు. ముంబైలో ఓ ఈవెంట్ చేయాలని నిర్మాత ఎ.ఎం.రత్నం భావిస్తున్నారు. ఆ ఈవెంట్ కి ఏదోలా పవన్‌ని తీసుకెళ్లాలన్నది ప్లాన్. ఈమధ్య కీరవాణి స్టూడియోకి వెళ్లారు పవన్. అక్కడ ఆయనతో చేసిన చిట్ చాట్ ని ఓ వీడియోగా చేసి వదిలారు. ఇలానే పవన్‌తో సింపుల్ గా కొన్ని వీడియోలు రూపొందిస్తే బాగుంటుంది. పవన్ టైమ్ కలిసొస్తుంది. దాంతో పాటు పబ్లిసిటీకి కావల్సిన కంటెంట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఆ దిశగా చిత్రబృందం ఆలోచిస్తే బాగుంటుంది.
‘వీరమల్లు’ క్రెడిట్ లో 80 శాతం వాటా క్రిష్ ది. ఆయన 80 శాతం సినిమాని షూట్ చేశారు. ఆ తరవాత జ్యోతికృష్ణ పూర్తి చేశారు. ఈ ప్రమోషన్లకు క్రిష్నీ తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది. కానీ ఆయన అందుబాటులో లేకపోవొచ్చని ఇన్ సైడ్ వర్గాల టాక్. ‘ఘాటీ’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో క్రిష్ బిజీగా ఉన్నారు. ఆ తరవాత బాలకృష్ణ తో ఓ సినిమా చేయాలి. ఆ సినిమా పనుల్లోనూ క్రిష్ తలమునకలై ఉన్నారని, అందుకే ‘వీరమల్లు’కు సమయం కేటాయించలేకపోవొచ్చని తెలుస్తోంది.