పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, సీబీఐతో విచారణ జరిపించాలని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది సుప్రీంకోర్టు.హైకోర్టు ఆదేశాల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది
నాగం జనార్దన్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ బీవీ నాగరత్న , జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం విచారణ చేపట్టింది. నాగం తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్.. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని, సర్కార్ ఖజానాకు 2వేల కోట్లకు పైచిలుకు నష్టం వాటిల్లిందన్నారు.
ప్రభుత్వం ఆమోదించిన ప్రకారం పంపులు, మోటార్ల కోసం బీహెచ్ఈఎల్ కు 65శాతం చెల్లింపులు చేయాల్సి ఉండగా 20శాతానికి తగ్గించారని, సివిల్ వర్క్స్ కోసం మేఘాకు 35 శాతం చెల్లింపులు చేయాల్సి ఉండగా 80శాతం చెల్లింపులు జరిగాయని, ఇదంతా అంతర్గత ఒప్పందం మేరకు జరిగిందని వాదనలు వినిపించారు ప్రశాంత్ భూషణ్.
మేఘా తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహాత్గీ వాదనలు వినిపించారు. తెలంగాణ హైకోర్టులో ఈ విషయంపై ఐదు పిటిషన్లు దాఖలు చేయగా విచారించిన కోర్టు ఎలాంటి అవినీతి జరగలేదని కొట్టివేసిందని తెలిపారు. బీహెచ్ఈఎల్ కూడా తమకు నష్టం వాటిల్లింది ఎలాంటి ఫిర్యాదు చేయలేదని , అయినా ఏదో డాక్యుమెంట్ తీసుకొచ్చి కేసులు వేస్తున్నారన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న ధర్మాసనం సీబీఐ విచారణను నిరాకరిస్తూ పిటిషన్ ను డిస్మిస్ చేసింది.