సుప్రీంకోర్టు తీర్పు మేరకు కేతిరెడ్డి పెద్దారెడ్డిని ఓ సారి తాడిపత్రిలోకి తీసుకెళ్లారు పోలీసులు. మూడువందల మంది పోలీసులతో భద్రత కల్పించారు. ఈ ఖర్చు ఆయనే పెట్టుకున్నారు. ఖర్చు ఆయనే పెట్టుకున్నా అంత మంది పోలీసుల్ని ఆయన భద్రత కోసం రోజూ కేటాయించడం కుదరదు కాబట్టి .. ఆయనను ఒక్క రోజు తర్వాత తాడిపత్రి నుంచి వెళ్లిపోవాలని సూచించారు.
చంద్రబాబునాయుడు పర్యటన ఉందని ఈ కారణంగా భద్రతా సిబ్బందికి ఆ విధులు ఉంటాయని.. తాడిపత్రి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు పెద్దారెడ్డికి సూచించారు. ఆయన కూడా సైలెంటుగా వెళ్లిపోయారు. ఇప్పుడు చంద్రబాబు పర్యటన అయిపోయాక మళ్లీ వస్తానని అప్పుడు కార్యకర్తలందర్నీ కలుస్తానని తనను కలిసిన వారికి చెప్పారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. పెద్దారెడ్డిని ఓ సారి తాడిపత్రిలోకి పంపించారు. పోలీసులు సుప్రీంకోర్టు తీర్పును పాటించారు. అంతే.. మళ్లీ ఆయనను తాడిపత్రిలోకి అనుమతిస్తారా లేదా అన్నది డౌటే.
పెద్దారెడ్డి వచ్చినప్పుడు జేసీ వర్గం సైలెంట్ గా ఉంది. పోలీసులు ముందుగానే వారికి నచ్చచెప్పినట్లుగా తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఒక రోజు వచ్చి వెళ్తారని.. ఆయనను ఒక్క రోజు తర్వాత బయటకు పంపించే బాధ్యత తీసుకుంటామని చెప్పి.. సైలెంటుగా ఉండేలా చేశారని తెలుస్తోంది. అన్నట్లుగానే ఆయన బయటకువెళ్లారు. మళ్లీ ఎప్పుడైనా తాడిపత్రికి వెళ్లాలంటే.. పోలీసులు అనుమతి ఇవ్వడం కష్టమే.