తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏ సందర్భంలో అయినా ఒకటే మాట చెబుతున్నారు. కేసీఆర్ ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పులు చేసి పోయారని తనకు ఎక్కడా అప్పులు పుట్టడం లేదని అందుకే ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉందని చెబుతున్నారు. బడ్జెట్ పద్మనాభంలో లెక్కలు వేసుకుంటున్నానని తనపై తాను సెటైర్ వేసుకున్నారు. భారత దేశంలో ఏ ప్రభుత్వానికి ఇప్పుడు ఆర్థిక వెసులుబాటు లేదు. చివరికి కేంద్రానికి కూడా . ఎందుకంటే.. ఆదాయానికి మించి ఖర్చు పెట్టడం ఎప్పుడో అలవాటు చేసుకున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆలవి కాని హామీలిచ్చి కనిపించినవన్నీ తాకట్టు పెట్టేసి గండం గట్టెక్కేస్తున్నారు.
తెలంగాణ కూడా దానికి వ్యతిరేకం కాదు. కంచ గచ్చిబౌలి భూముల్ని బాండ్లుగా చేసి తెలంగాణ ప్రభుత్వం పది వేల కోట్లు తెచ్చి కొన్ని హామీలను నెరవేర్చింది. ఇంకా చాలా ఉన్నాయి. కానీ వాటికి డబ్బుల్లేవు. అందుకే రేవంత్ రెడ్డి ఇతర హామీల విషయంలో ఏమీ చేయలేకుండా ఉన్నారు. డబ్బుల్లేవన్న విషయాన్ని ప్రజలకు చెబుతున్నారు కేసీఆర్ అప్పులు చేసి పోయారని అవి కట్టుకోవడానికే కష్టపడాల్సి వస్తోందని అంటున్నారు. అయితే ప్రజలు ఎక్కువగా ఇలాంటి కష్టాలను, బీద అరుపుల్ని వినిపించుకోరు. తమకు కష్టం వస్తే మాత్రం వ్యతిరేకంగానే స్పందిస్తారు.
పథకాల విషయంలో ఎక్కువ మంది ఎలా స్పందిస్తారో చెప్పడం కష్టం. ప్రజల్ని సంతృప్తి పరచడం అనేది అసాధ్యం. ఎవరికైనా ఉచితంగా పది వేలు ఇస్తే.. ఈ సారి మరో ఇరవై వేలు ఇవ్వాలని కోరుకుంటాడు. ఎందుకంటే ఉచితంగా వచ్చేదే కదా అని అనుకుంటాడు. ఇలా పథకాలకు ప్రజల్ని అలవాటు చేసి.. ఇప్పుడు డబ్బులు లేవు అంటే.. ఊరుకోరు. ఈ పరిస్థితిని రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. అవసరమైన పథకాల మేరకే ఖర్చు పెట్టుకుంటే తెలంగాణలో మౌలిక సదుపాయాలు పెంచుకోవడానికి కావాల్సినన్ని నిధులు అందుబాటులో ఉంటాయి. కానీ రేవంతే కాదు ఏ రాజకీయ పార్టీ కూడా ఆ ధైర్యం చేయదు. ఎందుకంటే ప్రజలకు ముఖ్యంగా పథకాల లబ్దిదారులకు కావాల్సింది .. తమకు ఇస్తామన్నవి ఇవ్వడమే. లేకపోతే ప్రత్యామ్నాయం రెడీగా ఉంటుంది.