గత ఐదారేళ్లలో తెలుగు హీరోల స్థాయి పెరిగింది. ఈ విషయంలో మరో మాటకు తావు లేదు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్.. వీళ్లంతా బాక్సాఫీస్‌ని షేక్ చేయగల సమర్థులు. అన్నీ కలసి రావాలే కానీ, బాలీవుడ్ రికార్డుల భరతం పడతారు. వీళ్ల సినిమాలకు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉంది. అయితే.. వీళ్లెవరూ నేరుగా బాలీవుడ్ లో సినిమా చేయడం లేదు. చేస్తే గీస్తే మల్టీస్టారర్ మాత్రమే అనే షరతు పెడుతున్నారు. రామ్ చరణ్ ఓసారి ఇలాంటి ప్రయత్నమే చేశాడు. ‘తుఫాన్’తో అక్కడ అడుగుపెట్టాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఆ తరవాత మళ్లీ ఆ సాహసం చేయలేదు. ప్రభాస్ ‘ఆదిపురుష్’ అవతారం ఎత్తినా కలసి రాలేదు. ఆ తరవాత ప్రభాస్ కి సైతం కొన్ని ఛాన్సులు వచ్చాయి. కానీ ప్రభాస్ ఏమాత్రం పట్టించుకోలేదు.
ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. అదే ‘వార్ 2’. ఇది మల్టీస్టారర్. హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకొంటున్నాడు ఎన్టీఆర్. మరోవైపు అల్లు అర్జున్‌కి సైతం ఇలాంటి అవకాశాలే వస్తున్నాయి. అమీర్ ఖాన్ తెరకెక్కించే ‘మహాభారతం’లో ఆయన అర్జునుడిగా కనిపించే అవకాశం ఉంది. రామ్ చరణ్ కూడా మల్టీస్టారర్ అయితే చేస్తా అంటున్నాడట.
నిజానికి మల్టీస్టారర్ అనేది మంచి ఆప్షన్. అక్కడి ప్రేక్షకులు మన హీరోల్ని ఎంత వరకూ రిసీవ్ చేసుకొంటారు? అనేదానికి ఓ చెక్ పాయింట్. ఎందుకంటే సౌత్ ప్రేక్షకుల మైండ్ సెట్ చాలా వేరుగా ఉంటుంది. డబ్బింగ్ సినిమాల్ని అక్కడ చూస్తారు. అలాగని మన హీరోల్ని, ఆధిపత్యాన్నీ ఒప్పుకోలేరు. సౌత్ హీరోలు నేరుగా బాలీవుడ్ సినిమాలు చేస్తే తిప్పి కొట్టిన సందర్భాలెన్నో. రాజమౌళి, సుకుమార్ తీసిన పాన్ ఇండియా సినిమాలు, వాటి రిజల్టులూ చూసి మురిసిపోయి, బాలీవుడ్‌లోనూ మనకు తిరుగులేదు అనుకొంటే భంగపాటు తప్పదు. రామ్ చరణ్, ప్రభాస్ విషయాల్లో ఇదే జరిగింది. మెల్లమెల్లగా బాలీవుడ్ ప్రేక్షకులకు అలవాటు పడాలి. `వీళ్లు మన హీరోలే` అనిపించుకోవాలి. అలా అనుకోవాలంటే ముందుగా మల్టీస్టారర్లతో ప్రయోగాలు చేయాలి. ప్రస్తుతానికైతే ఎన్టీఆర్ సరైన దారిలోనే వెళ్తున్నాడు అనుకోవాలి. బన్నీ కూడా ఇదే చేయబోతున్నాడు. రామ్ చరణ్, ప్రభాస్, మహేష్ సైతం.. ఇదే పంథాని అనుసరిస్తే బాలీవుడ్ లో మన హీరోలు మరిన్ని విజయాలు అందుకోవడం ఖాయం.