మధ్య ప్రదేశ్ లో వరస మరణాల మిస్టరీ తొలగేదెప్పుడా అని ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎట్టకేలకు సీబీఐ దర్యాప్తుకి ఒప్పుకోవడంతో మర్డర్ మిస్టరీ వీడుతుందని అంతా ఆశిస్తున్నారు. వ్యవసాయిక్ పరీక్షా మండల్ (వ్యాపం) పరీక్ష ద్వారా జరిపిన ఉద్యోగ నియామకాల్లో భారీగా అక్రమాలు జరిగాయని వచ్చిన ఆరోపణలపై మొదట స్పెషల్ టాస్క్ ఫోర్స్, ఆ తర్వాత హైకో్ర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు జరుగుతోంది. మరోవైపు ఈ కుంభకోణంతో సంబంధం ఉన్న వారు వరసగా మరణిస్తున్నారు. వ్యాపంతో సంబంధం ఉన్న వారు, వార్తల కవరేజీకి వెళ్లిన వారు సహా మొత్తం 48 మంది ఇప్పటి వరకు మరణించారు. ఇవన్నీ సహజ మరణాలే అని నమ్మగలమా? పోనీ హత్యలే అనడానికి పోస్టు మార్టం నివేదికలో అలాంటి రుజువులు లేవు. మరి ఆత్మహత్యలా అంటే అదీ అనుమానమే.
ఈ మరణాల వెనుక ఏదో పెద్ద కుట్ర ఉందనేది చాలా మంది అనుమానం. ఒకే కేసుకు సంబంధించి ఇంత మంది వరసగా మరణించడం చూస్తుంటే, తనకూ భయం వేస్తోందని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. అయినా ఇన్నాళ్లూ సీబీఐ విచారణకు ముఖ్యమంత్రి ఒప్పుకోలేదు. ప్రజల్లో అనుమానాలున్నప్పుడు, ప్రభుత్వంపై నింద పడినప్పుడు, కడిగిన ముత్యంలా బయటకు రావాలి. అందుకు ఉన్నత స్థాయి విచారణకు ఒప్పుకోవాలి. మధ్య ప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వం మాత్రం మొండిగా వాదించడానికే ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పుడైనా ప్రజల ఒత్తిడికి తలొగ్గినట్టు కాదు. సీబీఐ విచారణకు ఆదేశించాలంటూ కాంగ్రెస్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టులో గురువారం విచారణ జరగబోతోంది. అప్పుడు సుప్రీం కోర్టు ఆదేశిస్తే ఎలాగూ సీబీఐకి కేసును అప్పగించక తప్పదు. కాబట్టి ఈలోగా తానే హైకోర్టుకు లేఖ రాశారు చౌహాన్.
ఈ కేసులో అన్నీ సహజ మరణాలే అయితే, అక్రమాలపై గళమెత్తిన సామాజిక కార్యకర్తలకు బెదిరింపులు ఎందుకు వస్తున్నాయి? వారిపై హత్యాప్రయత్నాలు ఎలా జరిగాయి? ఎవరు చేశారు? వారికి గన్ మెన్లను నియమించినా ప్రాణభయం ఎందుకు వెంటాడుతోంది? ఈ ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం జవాబు చెప్పాలి. చెప్పలేక పోతే సీబీఐ విచారణకు అవకాశం ఇవ్వాలి. ఈ కుంభకోణంతో ముఖ్యమంత్రికి సంబంధం ఉందని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఎక్కడైనా కుంభకోణంలో ఆర్థిక కోణమే ఉంటుంది. ఈ కుంభకోణంలో హత్యాకాండ అనే భయంకరమైన అమానవీయ కోణం దాగి ఉంది. 48 నిండు ప్రాణాలను బలిగొన్న కిరాతకులు ఎవరో సీబీఐ దర్యాప్తులో అయినా తేలుతుందని ప్రజలు ఆశిస్తున్నారు.