ఎన్నికలు అయిపోయాయి.. తిట్టుకున్న నోళ్లు ఏం అవుతాయి?

tollywood

సినిమాలూ రాజకీయాలు ఒక్కటే. ఇక్కడ శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవ్వరూ ఉండరు. కాకపోతే.. మన టాలీవుడ్ లో మాత్రం ప్రస్తుతానికి సినిమాలు, రాజకీయాలు కలిసిపోయాయి. గత నెల రోజుల్లో సినిమా వాళ్లు సినిమావాళ్లకే శత్రువులయ్యారు. ఎవరి పార్టీకి వాళ్లు వకాల్తా పుచ్చుకుని రెచ్చిపోయారు. రేపొద్దుట మొహమొహాలు చూసుకోక తప్పదు అన్న నిజాన్ని మర్చిపోయి, పార్టీలు, అందులో గెలుపు ఓటములు శాశ్వతం అన్నట్టు ప్రవర్తించారు. అందుకే సినిమా వాళ్లలో.. పార్టీల పరంగా వర్గాలు ఏర్పడిపోయాయి. ఎన్నికల సీజన్లో ఎవరికి వారే ఎమునా తీరే అన్నట్టు ప్రవర్తించారు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి. మరి ఆ వేడి ఏమవుతుంది? ఇది వరకటిలా కలసి పనిచేయగలరా? లేదంటే ఆ అడ్డు గోడలు మరింత అడ్డగోలుగా తయారైపోతాయా?

పవన్ కల్యాణ్ – అలీ ఎపిసోడ్… సినిమా, రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆకర్షించింది. అలీపై పవన్, పవన్ పై అలీ చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాయి. అలీని ఇక నమ్మే ప్రసక్తే లేదు అని పవన్ అంటే, నాకంటే నువ్వు జూనియర్ అంటూ అలీ ఎద్దేవా చేసినట్టు మరీ మాట్లాడాడు. వీరిద్దరూ ఇప్పుడు మళ్లీ కలసి పనిచేయగలరా? ఒకరికొకరు ఎదురైతే ఇది వరకటిలా మనసు విప్పి మాట్లాడుకోగలరా? రాజకీయం రాజకీయమే.. మన స్నేహం మన స్నేహమే అన్నట్టు స్వచ్ఛంగా ఉండలరా??

నాగబాబు – శివాజీరాజాల రిటర్న్ గిఫ్ట్ ఎపిసోడ్ కూడా మర్చిపోయేది కాదు. `మా` ఎన్నికలలో తనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడన్న కోపంతో `పిల్లికి కూడా బిచ్చం పెట్టవు.. నరసాపురంకి నువ్వేం చేస్తావ్` అంటూ.. సంచలన కామెంట్లతో విరుచుకుపడ్డాడు శివాజీ రాజా. రేపు సినిమాల్లో ఇద్దరూ కలసి నటించాల్సివస్తే.? ఆ కోపాలూ, భావోద్వేగాలూ మర్చిపోగలరా? ఈ స్టేట్ మెంట్లూ, పంతాలూ ఎన్నికలకే పరిమితం చేస్తారా? టు బి కంటిన్యూడ్.. అంటూ.. కొనసాగిస్తారా?

చిన్ని కృష్ణ ఎపిసోడ్ మరో అరాచకం. ఆయన పనిలో పనిగా మెగాస్టార్ చిరంజీవిపైనే విమర్శనాస్త్రాలు ఎక్కిపెట్టాడు. పవన్ కల్యాణ్ ని కడిగేశాడు. ఆ ఎపిసోడ్ తరవాత.. చిన్ని కృష్టపై పెద్ద ఎత్తున విరుచుకుపడిపోయాడు ఆకుల శివ. మెగా కాంపౌండ్ తో చిన్ని కృష్ణతో విడదీయలేని అనుబంధం. అయితే ఇప్పుడు అదంతా గతం. మెగా హీరోలతో సన్నిహితంగా ఉండే దర్శకులు, నిర్మాతలు చిన్ని కృష్ణతో పనిచేయడానికి సిద్దపడతారా? తనని మళ్లీ చేరదీస్తారా? అనేది అనుమానమే. మరి కోన వెంకట్ ఏం చేశాడు? తన సినిమా ప్రమోషన్లకు పవన్ కల్యాణ్ ని వాడుకుని.. తీరా ఎన్నికలు వచ్చేసరికి.. ప్లేటు మార్చేశాడు. కోన వెంకట్ ని పవన్ అభిమానులు అంత తేలిగ్గా మర్చిపోతారా??

వీళ్లనే కాదు.. చాలా మంది ఎన్నికల సీజన్లో ఎవరికి తోచినట్టు వాళ్లు, ఎవరి మార్గంలో వాళ్లు రెచ్చిపోయారు. భవిష్యత్తు గురించి, తద్వారా రాబోయే పరిణామాల గురించి ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ మురికి.. సినిమాలకూ వ్యాపిస్తే మాత్రం.. ఇప్పుడున్న ఆరోగ్యకరమైన వాతావరణం పూర్తిగా పాడు చేసుకున్నట్టు అవుతుంది. ఆ ప్రమాదం జరక్కుండా ఉండాలని కోరుకుందాం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com