‘హిట్’, ‘సూపర్ హిట్’… టాలీవుడ్ ఈ మాట విని చాలా వారాలయ్యింది. 2025లో తెలుగు చిత్రసీమకు విజయాల శాతం చాలా తక్కువ. ఆగస్టులో అయితే… టాలీవుడ్ కి గట్టి దెబ్బలు తగిలాయి. కనీసం ఈ నాలుగు నెలలైనా… ఓ నాలుగు హిట్లు ఖాతాలో వేసుకోవాలని చూస్తోంది బాక్సాఫీసు. అందులోనూ ఈ సెప్టెంబరు చాలా కీలకం. ముఖ్యమైన సినిమాలు, అన్నో కొన్నో అంచనాలు ఉన్న ప్రాజెక్టులు ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
సెప్టెంబరు 5న ‘ఘాటీ’ వస్తోంది. క్రిష్ – అనుష్క కాంబోలో రూపుదిద్దుకొన్న సినిమా ఇది. లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినా, హీరోల ఎలివేషన్లకు ఎక్కడా తక్కువ కాకుండా ఇందులో స్వీటీని చూపించార్ట క్రిష్. `ఇది ఘాటీ కాదు.. ఘాటు సినిమా` అనే రేంజ్ లో ప్రచారం చేస్తున్నారు. అనుష్కని వెండి తెరపై చూసి చాలా కాలం అయ్యింది. కాబట్టి.. ఈ సినిమాపై ఫోకస్ చేసే అవకాశం ఉంది.
సెప్టెంబరు 12.. చాలా కీలకం. ఈ వారం కిష్కిందపురి, మిరాయ్ రెండు క్రేజీ సినిమాలు బరిలో ఉన్నాయి. ఒకటి హారర్ అయితే, మరోటి ఫాంటసీ. ముఖ్యంగా మిరాయ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. తేజా సజ్జా మనుమాన్ తరవాత చేసిన సినిమా ఇది. ట్రైలర్ ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. చిత్రబృందం కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రచారం జోరుగా చేసతోంది. కిష్కింద పుర ట్రైలర్ తో షాక్ ఇచ్చింది. ఇదో హారర్ సినిమా. విజువల్స్ బాగున్నాయి.
ఇక అందరి దృష్టీ సెప్టెంబరు 25న రాబోయే ‘ఓజీ’పై ఉంది. ఈనెల కాదు, ఈ యేడాది జాతకాన్ని మార్చేసే శక్తి ఉన్న సినిమా ఇది. పవన్ చేతిలో ఉన్న ప్రాజెక్టుల్లో ఓజీకి మించిన హైప్ దేనికీ లేదు. పవన్ ఏ సినిమా ఫంక్షన్ కి వెళ్లినా, ఏ కార్యక్రమానికి వెళ్లినా అక్కడ `ఓజీ… ఓజీ` అంటూ అభిమానులు గోల చేసేవారు. వాళ్ల నిరీక్షణకు ఈనెల 25తో తెర పడబోతోంది. గ్లింప్స్, పాటలు ఈ సినిమాపై హైప్ మరింత పెంచుకొంటూ వెళ్తున్నాయి. టీజర్ వస్తే.. అది రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. ఏమాత్రం అంచనాల్ని అందుకొన్నా… ఈ సినిమా పవన్ కల్యాణ్ కెరీర్ లో అతి పెద్ద కమర్షియల్ హిట్ అయ్యే అవకాశం ఉంది.