ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగానే తక్కువ రేటుకు బుకింగ్ చేసుకుని డబ్బులు తీసుకుంటున్నారు బిల్డర్లు. దీనికి ప్రీలాంచ్ ఆఫర్లు అని పేరు పెట్టారు. కానీ వీటికి రక్షణ లేకుండా పోతోంది. అందుకే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ( రెరా) కొన్ని నిబంధనలు పెట్టింది. డెవలపర్లు, ప్రమోటర్లు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు.. రెరా వద్ద నమోదు కాని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు అడ్వాన్స్ చెల్లింపులు స్వీకరించడం లేదా “ప్రీ-లాంచ్” సేల్స్‌ను ప్రమోట్ చేయడం పై స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది.
బిల్డర్లు ,ఏజెంట్లు ప్రతిపాదిత ప్రాజెక్టుల్లో పెట్టుబడి పెట్టమని కొనుగోలుదారులను ఆహ్వానిస్తూ మార్కెటింగ్ చేసుకుంటారు. అవసరమైన ప్రాజెక్టు రిజిస్ట్రేషన్ పొందకముందే ప్రీ-లాంచ్ ఆఫర్లు అంటూ ఇలాంటి పద్ధతులు అనుసరిస్తున్నారు. ఇది తీవ్ర తప్పిదమని రెరా స్పష్టం చేస్తోంది. రియల్ ఎస్టేట్ (రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) యాక్ట్, 2016లోని సెక్షన్ 3 ప్రకారం నమోదు కాని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులో ఏ ప్రమోటర్ కూడా ప్రకటనలు చేయడం, మార్కెటింగ్ చేయడం, బుకింగ్ లేదా విక్రయం చేయడం అనుమతించరు. అదేవిధంగా, సెక్షన్ 10 ప్రకారం, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు అటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన లావాదేవీలను నిర్వహించడం కూడా చట్టవిరుద్ధం.
డెవలపర్లు, ప్రమోటర్లు , ఏజెంట్లు నమోదు కాని ప్రాజెక్టులకు సంబంధించి ఏవైనా ఆర్థిక లావాదేవీలు లేదా ప్రమోషనల్ కార్యకలాపాలు చేయూదు. ఉల్లంఘన జరిగితే, యాక్ట్ నిబంధనల ప్రకారం కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. కొనుగోలుదారులు రెరాతో నమోదు కాని ఏ ప్రాజెక్టులోనూ పెట్టుబడి పెట్టవద్దనేది నిపుణులు ప్రధానంగా ఇచ్చే సలహా.