అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ అరవ శ్రీధర్‌పై ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగిని చేసిన ఆరోపణలు హాట్ టాపిక్‌గా మారాయి. బాధితురాలు కొన్ని వీడియోలను వైసీపీ చెందిన మీడియా, సోషల్ మీడియాల్లో లీక్ చేశారు. పోలీసు కేసు పెట్టారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.
బాధితురాలు చెబుతున్న దానిప్రకారం 2024 జూన్ 14న అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా ఆమె ఫేస్బుక్ ద్వారా శుభాకాంక్షలు తెలుపుతూ మెసేజ్ చేశారు. ఈ పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఎమ్మెల్యే ఆమెతో నిరంతరం టెలిగ్రామ్ ద్వారా చాటింగ్ చేస్తూ సన్నిహితంగా ఉంటూ వచ్చారని ఆమె చెబుతున్నారు. ఆ తర్వాత లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా, తన కోరిక తీర్చకపోతే మూడేళ్ల కొడుకును చంపేస్తానని బెదిరించారని ఆమె ఆరోపించారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చగా, బలవంతంగా అబార్షన్ చేయించారని, తన భర్తకు విడాకులు ఇవ్వాలని కూడా ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారని ఆమె పేర్కొన్నారు.
ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి బాధిత మహిళ మాట్లాడిన వీడియోలు, ఎమ్మెల్యే ఆమెతో జరిపినట్లు చెబుతున్న వాట్సాప్ చాట్లు , వీడియో కాల్స్ స్క్రీన్ షాట్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా విడుదల చేసింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గానీ, జనసేన పార్టీ అధిష్టానం గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు, చాటింగ్ స్క్రీన్ షాట్ల వాస్తవికతపై విచారణ జరగాల్సి ఉంది. అయితే, ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ స్థాయి వ్యక్తిపై ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడంతో పూర్తి వివరాలు తీసుకుని జనసేన పార్టీ స్పందించనుంది. మూడు నెలల కిందట కూడా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నం చేశారు కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ హైలెట్ చేస్తున్నారు.
