ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి అవసరమైన నిధులు వేగంగా సమకూరుతున్నాయి. తర్వాత ప్రణాళికలు అమలు చేయడానికి కూడా వివిధ ఆర్థిక సంస్థలు రుణ ప్రణాళికల్ని ఆమోదిస్తున్నాయి. సీఆర్డీఏకు మరో రూ. 32,500 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచబ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం ఆమోదం తెలిపింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు కన్సార్షియంతో పాటు నాబార్డ్, ఎన్ఏబీఎఫ్ఐడీ, ఏపీపీఎఫ్‌సీ వంటి దేశీయ సంస్థలు ఈ నిధులు సమకూరుస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ కింద ఈ రుణాలు మంజూరు అవుతున్నాయి.
మరిన్ని నిధులకు ప్రపంచబ్యాంక్ అంగీకారం </span<
రూ. 1,500 కోట్ల రుణానికి సంబంధించి ఏపీపీఎఫ్‌సీతో ఇప్పటికే ఒప్పందం కుదిరింది. మిగతా సంస్థలతో సంప్రదింపులు ముగిసి, మంజూరుకు అంగీకారం తెలిపాయి. ప్రపంచ బ్యాంకు-ఏడీబీ రూ. 14,000 కోట్లు , ఎన్ఏబీఎఫ్ఐడీ రూ. 10,000 కోట్లు , నాబార్డ్ రూ. 7,000 కోట్లు ఇస్తున్నాయి. సీఆర్డీఏ ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రూ. 15,000 కోట్లు, హడ్కో నుంచి రూ.11,000 కోట్లు కలిపి మొత్తం ₹26,000 కోట్ల రుణాలు సమీకరించింది. ఈ కొత్త రుణంతో అమరావతి ప్రాజెక్టుకు అవసరమైన నిధులు చాలావరకు సమకూరనున్నాయి.
దేశీయ సంస్థలూ నిధులు సమకూర్చేందుకు ఆసక్తి
అమరావతి ప్రాజెక్టుపై ప్రపంచ బ్యాంకు మొదటి నుంచి సానుకూల వైఖరి చూపుతోంది. 2019కు ముందే ఏఐఐబీతో కలిసి రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే, 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రాజధాని పనులను నిలిపి, రుణాల అవసరం లేదని కేంద్రానికి తెలిపింది. 2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కేంద్ర చొరవలతో ప్రపంచ బ్యాంకు రూ.15,000 కోట్ల రుణానికి ముందుకు వచ్చింది. ఇందులో ప్రపంచ బ్యాంకు-ఏడీబీ రూ.13,500 కోట్లు, కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్‌గా రూ.1,500 కోట్లు సమకూర్చింది.
పరుగులు పెడుతున్న పనులతో వృద్ధి ఖాయం !
అమరావతి నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు దేశీయ సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. అమరావతి నిర్మాణంలో రూ. 91,639 కోట్ల అంచనా వ్యయంతో 112 పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైతులకు కేటాయించిన లేఅవుట్లు, ఐకానిక్ నిర్మాణాలు హైకోర్టు, సచివాలయ టవర్లు, శాసనసభ భవనం , న్యాయమూర్తులు-మంత్రులు-అధికారుల నివాస గృహాలు వంటివి ఉన్నాయి. 87 పనులకు టెండర్లు పిలిచారు. పనులు ప్రారంభమయ్యాయి.