ముసునూరు తహసిల్దార్ వనజాక్షిపై దాడి చేసిన తెదేపా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ని తెదేపా ప్రభుత్వం వెనకేసుకు రావడం, నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషితేశ్వరి ఆత్మహత్యకు కారకులయిన వారిపై తక్షణమే చర్యలు చేప్పట్టకుండా ఉపేక్షించడం ద్వారా తప్పు చేసిన వారిని తెదేపా ప్రభుత్వం వెనకేసుకువస్తోందనే అభిప్రాయం ప్రజలలో ఏర్పడుతోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసుని బయటపెట్టడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకి నోటు వ్యవహారంలో నుంచి బయటపడి ఉండవచ్చును. కానీ ఓటుకి నోటు కేసులో ఆయనపై ఇరు రాష్ట్రాల ప్రజలలో కూడా ఒక దురాభిప్రాయం ఏర్పడిందనే చేదు నిజాన్ని ఎవరూ కాదనలేరు. అదే విధంగా ఆయన పుష్కరాలను ఎంత ఘనంగా నిర్వహించినా కూడా పుష్కరాల మొదటి రోజు జరిగిన దుర్ఘటన వల్ల కూడా చంద్రబాబు నాయుడుకి చెడ్డపేరు వచ్చింది.
వరుసపెట్టి జరిగిన ఈ సంఘటనలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట మసక బారిందని చెప్పక తప్పదు. ఇటువంటి సమయంలో తహసిల్దార్ వనజాక్షికి గుర్తు తెలియని వ్యక్తుల నుండి బెదిరింపులు మొదలవడం కలకలం సృష్టిస్తోంది. ఆమెను తక్షణమే ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోవాలని లేకుంటే చంపేస్తామని బెదిరిస్తూ సి.యన్.టి.సి. పేరిట లేఖలు వచ్చినట్లు తాజా సమాచారం. ఆమెపై దాడి చేసిన తెదేపా ఎమ్మెల్యే చింతమనేని అనుచరులపైనే అనుమానాలు కలగడం సహజం.
ఒక మహిళ అయినప్పటికీ వనజాక్షి ఎంతో దైర్యంగా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకొనే ప్రయత్నం చేసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు అండగా నిలబడి ఉంటే అందరూ హర్షించేవారు. కానీ స్వంత పార్టీ ఎమ్మెల్యేని వెనకేసుకువచ్చి చివరికి ఆమెదే తప్పని తేల్చిచెప్పి రెవెన్యూ ఉద్యోగుల ఆత్మస్థయిర్యం దెబ్బ తీసింది. ఆమె ప్రభుత్వం కోసమే ఇసుక మాఫియాతో పోరాటం చేసినప్పటికీ ఆమెకు ప్రభుత్వ అండదండలు, రక్షణ ఉండవని స్పష్టమయింది కనుక తప్పని సరిగా ఆమె ఊరు విడిచివెళ్ళిపోక తప్పదేమో? దాని వలన ఆమెకు కాదు ప్రభుత్వానికే మరింత అప్రదిష్ట కలుగుతుంది.