జి.హెచ్.యం.సి. ఎన్నికల కోసమే ఓటర్ల తొలగింపు?

జి.హెచ్.యం.సి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేందుకు తెలంగాణా ప్రభుత్వానికి డిశంబర్ 15వరకు హైకోర్టు గడువు ఇచ్చింది. అప్పటికీ ప్రకటించకపోతే తనే స్వయంగా షెడ్యూల్ ఖరారు చేయవలసి ఉంటుందని హెచ్చరించింది. పెరిగిన జనాభాకి అనుకూలంగా వార్డుల పునర్విభజన చేయవలసి ఉందని అందుకే ఆలస్యం అవుతోందని తెలంగాణా ప్రభుత్వం కోర్టుకి చెప్పుకొని గడువు తీసుకొంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రజలు జంట నగరాలలో ఎక్కువగా స్థిరపడి ఉన్నందున అక్కడ గెలవలేమనే భయంతోనే తెరాస ప్రభుత్వం జి.హెచ్.యం.సి. ఎన్నికలు జరుపకుండా వాయిదా వేస్తోందని ప్రతిపక్షాల వాదన. తెరాస ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు వారి వాదనకు బలం చేకూర్చుతున్నట్లుగానే ఉన్నాయి.

వార్డుల పునర్విభజన ప్రక్రియను తెరాస చాలా తెలివిగా తనకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్లో తమ పార్టీకి బలమున్న ప్రాంతాలలో వార్డుల సంఖ్యని పెంచడం, ప్రతిపక్షాలకు బలమున్న ప్రాంతాలలో వార్డుల సంఖ్యని కుదించడం ద్వారా తన విజయావకాశాలను మెరుగు పరుచుకొనే ప్రయత్నాలు చేస్తోందని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడు తమకు బలమున్న ప్రాంతాలలో ఆధార్ కార్డుతో ఓటరు కార్డు అనుసంధానం పేరిట సుమారు 34 లక్షల ఓట్లను తొలగించేందుకు తెరాస ప్రభుత్వం నోటీసులు కూడా జారీ చేసిందని తెదేపా, బీజేపీ నేతలు ఎన్నికల సంఘం ముఖ్య అధికారి బన్వర్ లాల్ కి పిర్యాదు చేసారు. తమకు బలం ఉన్న ప్రాంతాలలో తెరాస గెలవలేదనే భయంతోనే ఆధార్ లింకేజి సాకుతో తమ ప్రాంతాలలో ఓటర్లకు నోటీసులు ఇస్తోందని, కానీ తెరాస ప్రభుత్వానికి ఆ హక్కులేదని కనుక దాని ఈ ప్రయత్నాలను తక్షణమే అడ్డుకోవలసిందిగా కోరుతూ వారు బన్వర్ లాల్ కి ఒక విజ్ఞప్తి పత్రం ఇచ్చారు.

ప్రభుత్వాలు ఆధార్ కార్డు నమోదు ప్రకియ చేప్పట్టవచ్చును. కానీ ఆధార్ కార్డు లేని కారణంగా వార్డులలో ఓటర్ల జాబితాలో నుంచి ఓటర్ల పేర్లను తొలగించకూడదు. ఆ అధికారం ఒక్క ఎన్నికల సంఘానికే ఉంటుంది. ఆధార్ కార్డు ఉన్నా లేకపోయినా ఓటర్లు ఓటు వేసుకోవచ్చని ఎన్నికల సంఘమే చెపుతోంది. అదేవిధంగా ఓటరు కార్డులను ఆధార్ తో అనుసంధానం చేయడానికి నియమిత గడువు ఏమీ విధించలేదని కూడా చెపుతోంది. అటువంటప్పుడు ఆధార్ కార్డు లేదనే కారణంతో ఓటర్ల పేర్లను జాబితాలో నుండి తొలగించడం తప్పు అని ప్రతిపక్షాల వాదన సమంజసంగానే ఉంది.

కానీ ఇప్పుడు ప్రతీ పనికి ఆధార్ చాలా అవసరమవుతున్నప్పుడు తెదేపా, బీజేపీ పేర్కొంటున్న ప్రాంతాలలో 34 లక్షల మంది ప్రజలు దానిని తీసుకొనేందుకు ఎందుకు జంకుతున్నారు? అనే సందేహం కూడా కలుగుతుంది. వారిలో ఇతర ప్రాంతాల నుండి వచ్చినవారికి ఇప్పటికే వారి స్వస్థలాలలో ఓటరు కార్డులు, ఆధార్ కార్డులు కలిగి ఉండవచ్చును. అయినప్పటికీ హైదరాబాద్ లో కూడా మరో ఓటరు కార్డు కలిగి ఉండే అవకాశం ఉంది. కానీ హైదరాబాద్ లో కొత్తగా మరో ఆధార్ కార్డు తీసుకొనే అవకాశం లేదు. అలాగని హైదరాబాద్ లో ఉన్న తమ ఓటరు కార్డులను ఇదివరకే ఉన్న ఆధార్ తో అనుసంధానం చేసినట్లయితే స్వస్థలంలో ఉన్న ఓటరు కార్డులు రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. కానీ రెండు చోట్లా ఓటరు కార్డు కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతోనే వారు హైదరాబాద్ లో తమ ఓటర్ కార్డులను ఆధార్ తో అనుసంధానం చేసుకోవడానికి ఇష్టపడటం లేదని అధికార పార్టీ వాదన. ఒక వ్యక్తి రెండు లేదా అంతకంటే ఎక్కువ ఓటరు కార్డులు కలిగి ఉండటం నేరం కనుక అటువంటి బోగస్ కార్డుల ఏరివేత తప్పనిసరి అని అధికార పార్టీ వాదన. కనుక ఈవిషయంలో తెరాసను కూడా పూర్తిగా తప్పు పట్టడానికి లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com