ఒంటరి వండర్స్…

అదో పెద్ద మీటింగ్ హాల్. అక్కడ వేదికమీద మోదీలాంటి ఆకారంలో ఉన్న మూర్తిగారు మైకు ముందు గంభీరంగా నిలబడి మాట్లాడటానికి సిద్ధమయ్యారు.

`నా ప్రియమైన ఒంటరి పక్షుల్లారా, ఇవ్వాళ నేను మిమ్మల్నందర్నీ కలవడం చాలా ఆనందంగా ఉంది. మీఅందరికీ తెలుసు, ఒంటరి పక్షులమైన మనమంతా మనలోని శక్తిని గుర్తించి ఏకంకావాలి. ఇందుకోసమే మనం కలుసుకున్నాం’
అక్కడికి చేరిన ఒంటరి పక్షులన్నీ తప్పట్లుకొట్టాయి.

`చాలా సంతోషం. మనల్ని చూసి చాలామంది ఈర్షపడుతుంటారు. ఇన్నేసి విజయాలను వీళ్లెలా సొంతం చేసుకున్నారా అని ఆశ్చర్యపోతుంటారు. వాళ్లనలా కుళ్లుకోనివ్వండి, మనం ఇలాగే అద్భుత విజయాలను సాధిస్తూ ముందుకుసాగిపోదాం ‘

సభలో మళ్ళీ ఈలలు, తప్పట్లు. మూర్తిగారు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ…

`మై డియర్ ఒంటరి పక్షుల్లారా, ఈరోజు మనం అబ్దుల్ కలాం గారిని స్మరించుకోవాలి. ఆయన ఒంటరిగా ఉంటూ అనేక అఖండ విజయాలను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు మీకోవిషయం చెబుతా.. కలాంగారు రాష్ట్రపతిగా ఉన్నరోజుల్లో నాయిర్ అనే వ్యక్తి కలాంకు వ్యక్తిగత సెక్రటరీగా ఉండేవారు. ఆయన `కలాం ఎఫెక్ట్’ అన్న పుస్తకం రాశారు. అందులో ఆయన చెప్పిన ఒక సంఘటన ఇప్పుడు మీకు చెబుతాను
సభికులంతా నిశ్శబ్దంగా ఉండిపోయారు. మూర్తిగారు చెబుతున్నారు….

`అది 2002. కలాంగారు రాష్ట్రపతిగా ఉన్నరోజులు. రంజాన్ మాసం… సాంప్రదాయబద్దంగా ఇఫ్తార్ విందు ఏర్పాట్లకు రాష్ట్రపతి భవన్ సిద్దమవుతుంది. సెక్రటరీని పిలిచి ఇలా అడిగారు… “ఈ విందు వల్ల అయ్యే ఖర్చు ఎంత?”… సుమారు రూ. 22 లక్షలవుతుందని సమాధానం రాగానే కలాం ఆ డబ్బును అనాధ ఆశ్రమాలకు ఆహారం, బట్టలు, దుప్పట్ల రూపంలో ఖర్చు చేయాల్సిందిగా ఆదేశించారు. అంతేకాదు, తన వంతుగా ఒక లక్ష రూపాయల చెక్కును ఇచ్చారని కలాం పర్సనల్ సెక్రటరీతన పుస్తకంలో రాశారు’
ఇప్పుడు మీకు ఒక సంఘటన చెబుతాను…
ఒక ఊర్లో ఒకాయన చాలా పెద్ద పోస్ట్ లోఉన్నాడు. ఊర్లో అనాథశరణాలయం కట్టించాలని చందాలకోసం కొంతమంది ఈ పెద్దాయన ఇంటికి వెళ్లారు. అప్పుడు పెద్దాయన –

`బాగుందండీ మీ ఆలోచన. ఎంత ఖర్చవుతుందో చెప్పండి…ఫర్వాలేదు..’అని పెద్దాయన చెక్ బుక్ తీస్తుండగానే, ఇంట్లోనుంచి పిలుపు-

`ఏమండీ, ఓసారి ఇలా రండి’

`ఆ వస్తాను, కాసేపుఆగు, పెద్దవాళ్లతో మాట్లాడుతున్నా’

`మీకు ఒకసారి చెబితే అర్థంకాదా, ఇలా రండి…’ గదమాయింపు

పెద్దాయన లోపలకు వెళ్ళాడు. కాసేపటికి మళ్ళీ వెనక్కి వచ్చి…

`అయితే, ఏమంటారు, అనాథశరణాలయం కడతానంటారు, అంతేగా, కట్టుకోండి, కావాలంటే పదో పరకో పట్టుకెళ్లండి, లేదంటే తమరు దయచేయవచ్చు.’ ఇలా అనేసరికి వచ్చిన వాళ్లకు పరిస్థితి అర్థమైంది. మిత్రులారా, ఈసన్నివేశం ద్వారా మీకు ఏమర్థమైంది. ఒంటరిగా ఉన్నవాళ్లు సమాజాంకోసం, దేశంకోసం సరిగ్గా ఆలోచిస్తారు. అదే సంసారిగా మారిపోతే స్వేచ్ఛ అవిరైపోతుంది. ఇవ్వాలని ఉన్నా ఇవ్వలేరు, చేయాలని ఉన్నా చేయలేరు. సంసార పక్షుల్లో స్వార్థచింతన ఎక్కువగా ఉంటుంది. అదే ఒంటరి పక్షుల్లో స్వేచ్ఛ ఎక్కువుంటుంది. కానీ, ఈ జనం ఉన్నారే వాళ్లు మనల్ని తీసిపారేస్తారు. ఇదీ ఒక జీవితమేనా అంటూ ఈసడించుకుంటారు. మనం ఎంతగొప్ప విజయాలు సాధించినా ఈ పిచ్చి జనం పట్టించుకోవడంలేదు. త్రేతాయుగంనాటి ముచ్చట చెబుతాను..’

అంతా శ్రద్ధగా వింటున్నారు. మూర్తిగారు తన స్పీచ్ కంటిన్యూ చేస్తూ –
`త్రేతాయుగంలో రాములవారి విజయానికి ప్రధానకారణం ఎవరు ? ఆంజనేయస్వామివారేకదా…ఆయన బ్రహ్మచారి. సింగిల్ హ్యాండ్ తో సంజీవనీ పర్వతం మోసుకొచ్చేశాడు. లంకాదహనం చేశాడు. సీతమ్మవారి జాడ కనిపెట్టాడు. అలాంటి వారిని చూడలేక, చుప్పనాతితనంతో ఆంజనేయులవారికీ ఒక భార్య ఉన్నట్టు కట్టుకథలు అల్లారు. ఆయనకు పెళ్ళిచేసేదాకా వీళ్లు నిద్రపోలేదు.
ఇక మనం భారతంలోకి తొంగిచూద్దాం. భీష్మాచార్యుడులేని భారతాన్ని ఊహించుకోగలమా ? మహా కౌరవసామ్రాజ్యాన్ని కంటికిరెప్పలా కాపుడిన మహాపురుషుడు ఆయన. త్రేతాయుగం, ద్వాపరయుగంలోనే కాదు, ఈ కలియుగంలో అందునా ఈమధ్యకాలంలోనే ఒంటరి జీవితం అనుభవిస్తున్న అనేకమంది అపూర్వ విజయాలను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో అబ్దుల్ కలాం ఒకరన్న సంగతి ఇందాకే చెప్పుకున్నాము. ఇంకా ఎవరెవరు ఉన్నారో చెప్పండి’

ఇలా మూర్తిగారు అనగానే…అంతా బుర్రలకు పదునుబెట్టారు. ఒకాయన లేచి-

`మన మాజీ ప్రధాని వాజ పేయిగారు. ఆయన మూడుసార్లు ప్రధాని అయ్యారు.’

ఆ వెంటనే మరొకాయన –

`నరేంద్ర మోదీగారు లేరూ… గుజరాత్ ముఖ్యమంత్రిగా హ్యాట్రిక్ సాధించేసి ఇప్పుడు ప్రధానిగా చక్రం తిప్పడంలేదాఏంటీ’

సభికుల్లో ఒకామె లేచి…

`మా మాయావతిని, మరచిపోతున్నారు. యుపీ రాజకీయాలను చక్రంతిప్పుతున్న వ్యక్తి. నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆమె ఇప్పటికీ అవివాహితే. అంతేనా, పశ్చిమబెంగాల్ లో మమతా బెనర్జీకి తిరుగేలేదు. ఇంకా, తమిళనాట జయలలితగారు ఉండనేఉన్నారు’

మూర్తిగారు మళ్ళీ అందుకున్నారు.

`భేష్.. అలాగే నవీన్ పట్నాయక్ , యువనేత రాహుల్ లాంటి వాళ్లు మరికొందరు నాయకులు ఒంటరి పక్షులే అయినా అపూర్వ విజయాలుసాధిస్తున్నారు. ఒక్క రాజకీయాల్లోనే కాదు, ఇతర రంగాల్లోకూడా అప్పటికీ, ఇప్పటికీ ఎప్పటికీ ఒంటరి పక్షులదే అంతిమ విజయం’

మూర్తిగారు ఇలా అనగానే సభలో మళ్ళీ చప్పట్లు.

`ఈ సమావేశంలో కొన్ని తీర్మానాలు ప్రవేశబెడుతున్నాం. కొన్ని సూత్రాలను పాటిద్దాం…’

1. ఒంటరి పక్షులని ఎవరు ఎగతాళి చేసినా బాధపడకూడదు.

2. మనకు స్ఫూర్తినిచ్చే పాటలు పాడుకోవాలి. ఒక మిత్రుడు పాట రాసిచ్చారు.

`ఒంటరి పక్షులం మనం
ఎవరేమన్నా వినం
బ్రహ్మచెప్పినా, బాసు చెప్పినా వినం..వినం’

ఈపాటను మన అఫీషియల్ సాంగ్ గా గుర్తిస్తున్నాం.

3. కొమ్మమీద ఒంటరిగా నిలిచిన పక్షిని మన లోగోగా ప్రకటిస్తున్నాం.

4. రజనీకాంత్ డైలాగ్ ని మన స్ఫూర్తిదాయక డైలాగ్ గా తీసుకుంటున్నాం. అదేమిటంటే…

`చూడునాన్నా, పందులే గుంపులుగా వస్తాయి,
సింహం ఒంటరిగానే వస్తుంది…’

5. అద్భుత విజయాలు సాధించిన ఒంటరి వీరుల ఫోటోలు మాత్రమే మన ఇంట్లో ఉండాలి. అలాంటి వారికే పూజలుగట్రా చేయాలి.

ఇలా మరికొన్ని చెప్పగానే అంతా తప్పట్లు కొట్టారు. సమావేశం ముగియగానే అంతా ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నారు. కానీ, ఎక్కడో ఏదో లోటు… గుండె పొరల్లోంచి బయటకు రావడానికి ప్రయత్నిస్తూనేఉంది.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖైరతాబాద్ మహా గణపతికి వీడ్కోలు.. ట్యాంక్ బండ్ వద్ద ఇదీ పరిస్థితి!

ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన ఘట్టం పూర్తి అయింది. ఎన్టీఆర్ మార్గ్ లోని నాలుగో నెంబర్ క్రేన్ వద్ద గణనాథుడిని నిమజ్జనం చేశారు. 70 అడుగుల సప్తముఖ మహాశక్తి గణపతి నిమజ్జనోత్సవాన్ని...

ఢిల్లీ కొత్త సీఎంగా ఆమెకే బాధ్యతలు

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఆప్ నేత, విద్యాశాఖ మంత్రి అతిశీ మర్లీనా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో అతిశీకి సీఎం పగ్గాలు అప్పగించాలని నిర్ణయించారు. కేజ్రీవాల్...

జానీ మాస్ట‌ర్ కేసు: ఛాంబ‌ర్ ఏం చేస్తోంది?

జానీ మాస్ట‌ర్ పై లైంగిక వేధింపుల కేసు న‌మోదు అవ్వ‌డంతో ప‌రిశ్ర‌మ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. హేమ క‌మిటీ నివేదిక దేశం మొత్తాన్ని షేక్ చేస్తున్న నేప‌థ్యంలో ఇలాంటి విష‌యాల్ని సీరియ‌స్ గా తీసుకొని,...

నెల్లూరులోనూ పెరుగుతున్న గేటెడ్ విల్లాల సంస్కృతి

ప్రజలు రాను రాను జీవన విధానంలో మార్పులు కోరుకుంటున్నారు. పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఏ సమస్యలు లేకుండా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇళ్ల చుట్టూ రణగొణ ధ్వనులు.. ఇతర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close