హైదరాబాద్: రిషితేశ్వరి ఆత్మహత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ కాలేజి ప్రిన్సిపాల్ బాబూరావు ఇవాళ ఈ కేసువిషయంలో లీగల్ అథారిటీముందు హాజరయ్యారు. తర్వాత ఒక టీవీ ఛానల్ విలేకరితో మాట్లాడుతూ తాను పార్టీకి వెళ్ళి డాన్స్ చేయటం తప్పేనని అన్నారు. విద్యార్థులు బలవంతం చేయటంవల్లే ఆ పార్టీకి వెళ్ళానని చెప్పారు. వేధింపులు ఎదుర్కొంటున్నట్లు రిషితేశ్వరి ఎప్పుడూ చెప్పలేదని, తను ఎవరికీ ఏమీ చెప్పేది కాదని అన్నారు. తను ఆత్మహత్య చేసుకోవటం దురదృష్టకరమని చెప్పారు. రిషిత తండ్రి ఒక్కసారే తనను కలిసినట్లు తెలిపారు. యూనివర్సిటీలో కొన్ని శక్తులు తనను టార్గెట్ చేస్తున్నాయని, అందుకే తనపై ఆరోపణలు వచ్చాయని అన్నారు.
మరోవైపు ఇవాళ లీగల్ అథారిటీముందు హాజరైన బాబూరావుపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలతో డాన్సులు చేయటం సిగ్గుమాలిన చర్య అన్నారు. ఇంత జరిగినా పశ్చాత్తాపం కనబడటంలేదని దుయ్యబట్టారు. మీ నాన్నకు నీవైనా చెప్పమంటూ బాబూరావు పక్కనే నిలుచునిఉన్న ఆయన కుమారుడితో జడ్జి అన్నారు.