మోడి తను తీసిన గోతిలో తానే పడ్డారా!

హైదరాబాద్: ఇప్పుడు దేశాన్ని పట్టి కుదిపేస్తున్న కుంభకోణాలు, వివాదాలు ఏమిటని ప్రశ్నిస్తే లలిత్ గేట్, వ్యాపమ్, వసుంధర రాజే వ్యవహారం అని స్కూల్ పిల్లలయినా చిట్టా చదివేస్తారు. ఈ వ్యవహారాలు, దీనిపైన నరేంద్రమోడి మౌనంపై ప్రతిపక్షాలు ఒకవైపు గొంతుచించుకుని అరుస్తుండగా, మరోవైపు సామాన్యజనం విస్తుపోయి చూస్తున్నారు. ఎంతో ఆశలు రేకెత్తించిన మోడి ప్రభుత్వం ఇంత త్వరగా ఇలా పలచనైపోతుందని ఎవ్వరూ ఊహించలేదు. మోడి-షా ద్వయం తమ చాకచక్యం, మంత్రాంగంతో దేశంలో అద్భుతాలు సృష్టిస్తారని రైటిస్టుల(హిందూత్వ వాదులు)తోబాటు తటస్థులుకూడా ఆశించారు. అయితే పరిస్థితి దానికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతోంది. దీనికి కారణమెవరు? సాక్షాత్తూ నరేంద్ర మోడియే. పార్టీలోని తన వ్యతిరేకవర్గంపై పట్టు సాధించటానికి ఉపయోగపడతాయనుకున్న పై వివాదాలన్నీ చివరికి ఆయన మెడకే చుట్టుకుంటున్నాయి.

ఒక్కొక్కటీ చూస్తే, ఈ చిట్టాలో మొదట బయటపడింది లలిత్ గేట్ కుంభకోణం. ఆర్థికనేరాల ఆరోపణలు, రెడ్ కార్నర్ నోటీస్ ఎదుర్కొంటున్న లలిత్ మోడికి సాయపడ్డారన్నది సుష్మా స్వరాజ్‌పైన అభియోగం. లలిత్ భార్య క్యాన్సర్‌తో బాధపడుతోంది కాబట్టి తాను మానవతా దృక్పథంతో సాయపడ్డానని సుష్మా చెబుతున్నారు. ప్రతిఫలంగా సుష్మా కుమార్తెకు, భర్తకు లలిత్ మోడి ముడుపులు ఇచ్చాడని కాంగ్రెస్ ఆరోపణ. ఇదే వ్యవహారంలో లలిత్ మోడికి రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేకూడా సాయపడ్డారని బయటపడటం రెండో వివాదం. ఈ వ్యవహారంలో సాయపడినందుకు వసుంధర కుమారుడికి చెందిన కంపెనీలో లలిత్ పెట్టుబడి పెట్టారని ఆరోపణ. ఇక ముడోదైన వ్యాపమ్ కుంభకోణం. బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌లో ఉన్నతవిద్యాకోర్సులు, ఉద్యోగాల ప్రవేశపరీక్షలలో జరిగిన అక్రమాలకు సంబంధించినది. ఈ కుంభకోణానికి సంబంధించి ఎంతోమంది అనుమానాస్పద పరిస్థితులలో చనిపోయారు.

ఈ మూడింటిలో కామన్ పాయింటేమిటంటే, ఈ మూడింటిలో ఇరుక్కున్న సుష్మా, వసుంధర, శివరాజ్‌సింగ్ చౌహాన్‌ ముగ్గురూ నరేంద్రమోడి ప్రధానికాకముందు ఆయన వ్యతిరేకవర్గంగా పేరుపడ్డవారు. అందుకే ఈ వివాదాలు బయటపడుతున్నపుడు, పెద్దవవుతున్నపుడు నరేంద్రమోడికి తెలిసినప్పటికీ వారిపై పట్టు సాధించటానికి అవి ఉపయోగపడతాయని భావించారు. అందుకే ఈ వివాదాలు బయటపడినప్పటినుంచీ మౌనం వహించారు. వీటిద్వారా ఆ ముగ్గురు లీడర్లపైనా వేటు వేయొచ్చని అనుకున్నారు. అయితే డామిట్ కథ అడ్డం తిరిగింది అన్నట్లు ఇప్పుడు యాంటీ క్లైమాక్స్ జరుగుతోంది. ప్రజలలో మోడి ప్రభుత్వం ప్రతిష్ఠ మసకబారుతోంది. ఇప్పుడు మోడి నోరు విప్పినా సమర్థించుకోలేని పరిస్థితి దాపురించింది. మింగలేక, కక్కలేక అన్నట్లుగా ఉంది మోడి వ్యవహారం. ఇక ఆయనకు కుడిభుజంగా, ట్రబుల్ షూటర్‌గా, అపర చాణుక్యుడుగా పేరుగాంచిన అమిత్ షా ఏమైనా చేస్తారా అంటే ఆయన అసలు సీన్‌లోనే కనబడటంలేదు. అంతపెద్ద పార్టీలో ఈ పరిస్థితినుంచి బయటపడటానికి పరిష్కారం చూపే థింక్ ట్యాంక్ లేదా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే అటు ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని అంతా తామై నడిపిస్తోంది మోడి-షా ద్వయంమాత్రమే. మొత్తంమీద చూస్తే ప్రత్యర్థులపై పట్టు సాధించటానికి మోడి అనుకున్న వ్యూహం బూమరాంగ్ అయినట్లుమాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మోడి-షా ద్వయం సరైన దిశలో వెళుతున్నట్లయితే అనిపించటంలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com