ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజ్యసభ స్థానం దక్కించుకోవడమే లక్ష్యంగా ఆమె తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే ఆమె ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా తనకు పార్లమెంట్ ఎగువసభకు వెళ్లే అవకాశం కల్పించాలని ఆమె అధిష్ఠానాన్ని కోరినట్లు సమాచారం.
గతంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసే సమయంలోనే షర్మిలకు ఏఐసీసీ కొన్ని కీలక హామీలు ఇచ్చింది. అందులో భాగంగానే ఆమెకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడంతో పాటు, భవిష్యత్తులో రాజ్యసభ సీటు కేటాయిస్తామని రాహుల్ గాంధీ స్వయంగా మాట ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది. ప్రస్తుతం కర్ణాటక కోటా నుండి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో ఒకదానిని తనకు కేటాయించాలని ఆమె ఈ సమావేశంలో కోరినట్లు తెలుస్తోంది.
కర్ణాటకలో మారిన రాజకీయ సమీకరణాలు వైఎస్ షర్మిలకు బాగా కలిసివచ్చేలా ఉన్నాయి. కర్ణాటక నుండి రాజ్యసభ రేసులో సిద్ధరామయ్య పేరు ప్రముఖంగా వినిపించింది. సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆయనను రాజ్యసభకు పంపాలని రాహుల్ అనుకున్నారు. అయితే, ఆయన ఢిల్లీ రాజకీయాలకు వెళ్లేందుకు ఆసక్తిచూపించలేదు. ఎమ్మెల్యేగా రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటానంటున్నారు. సిద్ధరామయ్య రేసు నుండి తప్పుకోవడంతో, అధిష్ఠానం వద్ద షర్మిలకు మార్గం సుగమమైందని ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంపూర్ణ మెజారిటీ దృష్ట్యా, అక్కడి నుండి షర్మిలకు చాన్స్ ఇస్తే ఎన్నిక కావడం ఖాయమే. సీఎం కాబోతున్న డీకే శివకుమార్ తోనూ షర్మిలకు బాగా పరిచయాల ుఉన్నాయి. ఒకవేళ ఆమెకు ఈ అవకాశం దక్కితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటు బ్యాంకును తిరిగి సాధించడానికి మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది.


