కేజీఎఫ్‌తో కన్నడ సినిమా రూపు రేఖల్ని మార్చేశాడు యశ్. కేజీఎఫ్ 2 కూడా బాక్సాఫీసుని చిన్నాభిన్నం చేసింది. ఇలాంటి ఫ్రాంచైజీ తరవాత యశ్ ఎలాంటి సినిమాతో వస్తాడా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో యశ్ నుంచి ‘ToXic’ సినిమా వస్తోంది. గీతూ మోహన్ దాస్ ఈ చిత్రానికి దర్శకురాలు. మార్చి 19న విడుదల చేస్తున్నారు. ఈరోజు యశ్ బర్త్ డే. ఈ సందర్భంగా ఓ గ్లింప్స్ విడుదల చేశారు. మిషన్ గన్లూ, మాఫియా.. వాళ్లని ఎదుర్కోవడానికి వచ్చిన ఓ హీరో. చెప్పుకోవాలంటే గ్లింప్స్ లో కనిపించింది ఇదే. కానీ ఇంతకు మించిన విధ్వంసం గ్లింప్స్‌లో చూపించేసింది దర్శకురాలు. యశ్ ఎంట్రీ.. నిజంగా షాకింగే. ఓ వైపు యాక్షన్ మోడ్.. ఇంకో వైపు కారులో రొమాన్స్.. రెండింటికీ సంబంధం లేదు. యశ్.. కాలితో మిషన్ గన్ ని ఆపరేట్ చేయడం కూడా ఫ్యాన్స్ కి ఫీస్ట్ లాంటి మూమెంట్. ఈ సినిమాకు సంబంధించిన చాలా విషయాలు చిత్రబృందం గోప్యంగానే ఉంచుతూ వస్తోంది. యశ్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు, తన స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉండబోతోంది? అనే విషయాలు సస్పెన్స్ గానే ఉండేవి. ఈ గ్లింప్స్ తో అవన్నీ రివీల్ అయిపోయాయి. ఓ మాస్, యాక్షన్ హీరోకి ఇలాంటి ఎంట్రీ పడడం నిజంగా సర్ప్రైజింగ్ విషయమే. ఇంకా ఈ సినిమాలో ఇంకెన్ని విశేషాలు ఉన్నాయో అనిపిస్తోంది.
రుక్మిణీ వసంతన్, కియారా అద్వాణీ, నయనతార, హ్యూమా ఖురేషీ వీళ్లంతా ఈ చిత్రంలో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. రవి బస్రూర్ అందించిన నేపథ్య సంగీతం మరీ హాంటింగ్ గా ఉంది. అయితే.. ‘యానిమల్’కి సౌండింగ్ కాపీ కొట్టినట్టు అనిపిస్తోంది. ఆ ఛాయలు లేకుండా డిజైన్ చేసుంటే మరింత బాగుండేది. మొత్తానికి గ్లింప్స్ తో ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది చిత్రబృందం. యశ్ ఎంట్రీపై కొంతకాలం హాట్ హాట్ గా చర్చ సాగే అవకాశం కనిపిస్తోంది.


