పార్టీ నడపడానికి చాలా ఇబ్బందులు పడుతున్నానని ..ఎవరైనా డబ్బులుంటే సాయం చేయాలని జగన్ ఓ సారి ప్రెస్ మీట్ లో అన్నారు. ఆయన మాటల్ని ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ సీరియస్ గా తీసుకుందేమో కానీ దాదాపుగా వంద కోట్ల రూపాయలను వైసీపీకి విరాళంగా ఇచ్చేసింది. వింతగా ఉన్నా ఇది నిజం. వైఎస్ఆర్సీపికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా (ECI)కు సమర్పించిన కంట్రిబ్యూషన్ రిపోర్ట్ ప్రకారం రూ. 140 కోట్ల విరాళాలు పొందింది.
రూ.98 కోట్లు ఇచ్చిన ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్
2023-24 లో రూ. 184 కోట్లు వైసీపీకి విరాళాలుగా వచ్చాయి. ఆ ఏడాది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి .. అధికార పార్టీ హోదాలో ఉంది కాబట్టి వచ్చాయని అనుకోవచ్చు. కానీ అధికారం పోయాక.. అత్యంత ఘోరంగా ఓడిపోయాక ఇంత ఎక్కువగా విరాళాలు రావడం ఆశ్చర్యకరమే. బీఆర్ఎస్ పార్టీకి 97 శాతం విరాళాలు తగ్గిపోయి.. పది కోట్ల వద్దనే ఉంది. కానీ వైసీపీ మాత్రం విరాళాల్లో ఊహించనంత ప్రగతి సాధించింది. కార్పొరేట్ల నుంచి వచ్చిన విరాళాల్లో ప్రూడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ దాదాపు రూ. 98 కోట్లు ఇచ్చింది.
ఏమిటీ ఈ ప్రుడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్?
రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చేందుకే ఈ ట్రస్ట్ ఏర్పాటు అయింది. కార్పొరేట్ కంపెనీలు తమ పేర్లు బయటకు రాకుండా ఉండేందుకు ఈ ట్రస్ట్ కు విరాళాలు ఇచ్చి..తాము ఇవ్వాలనుకున్న పార్టీకి ఇచ్చేలా చేసుకుంటాయి. ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేసిన తర్వాత ఇవి కీలకంగా మారాయి. జగన్ రెడ్డి తన బినామీ కంపెనీలు.. వాటాల నుంచి ఈ ట్రస్ట్ కు పంపి.. అక్కడ్నుంచి తమ పార్టీకి విరాళాల రూపంలో చేర్చుకుని ఉంటారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి కాక నాట్కో ప్రైవేట్ లిమిటెడ్, ప్రొగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్, వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్మెంట్ వంటివి రూ.10 కోట్లు చొప్పున ఇచ్చాయి. ఇందులో వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్ మెంట్ కంపెనీ ఆదాయం పది కోట్లు కూడా ఉండదని చెబుతున్నారు. మరి అంత లావు విరాళం వైసపీకి ఎందుకు ఇచ్చిందో వారికే తెలియాలి.
ఎలక్టోరల్ బాండ్ల రద్దు తర్వాత ట్రస్టుల ద్వారా విరాళాలు
ఎలక్టోరల్ బాండ్లు రద్దు తర్వాత ట్రస్టుల ద్వారా విరాళాలు పెరిగాయి. అయితే వైసీపీ ఇంత పెద్ద మొత్తంలో విరాళాలు చూపించడానికి ఓ కారణం కూడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2023-24 రూ. 184.12 కోట్ల విరాళాలతో కలిసి మొత్తం ఆదాయం రూ. 191 కోట్లు అయితే ఖర్చు రూ. 295 కోట్లు చూపించింది. ఎన్నికల్లో విపరీతంగా ఖర్చు చేసింది.
డెఫిసిట్ 104 కోట్లుగా చూపించడంతో ఈ సారి రూ. 140 కోట్ల విరాళాల లెక్క చూపించాల్సిన అవసరం పడిందని భావిస్తున్నారు.
 
                                                 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
                                               
                                               
                                               
                                               
                                              
 
                                                   
                                                   
                                                   
                 
                 
                 
                 
                