ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కోసం కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ .. జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశారని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతివ్వాలని అడిగారని అంటున్నారు. మరి జగన్ ఓకే చెప్పారా అన్నది మాత్రం చెప్పుకోవడం లేదు. విచిత్రం ఏమిటంటే.. బీజేపీ నుంచి ఎవరూ అడగకపోయినా… వారికే మద్దతిచ్చే దైన్య స్థితిలో వైసీపీ ఉంది. బీజేపీని పల్లెత్తు మాట అనే పరిస్థితిలో లేకపోగా.. వారికి అవసరమైనప్పుడల్లా వెళ్లి సారగలిపడాల్సిన పరిస్థితిలో ఉన్నారు. కానీ పరువు కాపాడుకోవడానికి అన్నట్లుగా రాజ్ నాథ్ ఫోన్ చేశారన్న ప్రచారం చేసుకుంటున్నారు.
ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలవడానికి అవసరమైన దాని కంటే ఎక్కువ మద్దతు ఎన్డీఏకు ఉంది. జగన్ రెడ్డికి పట్టుమని పది ఓట్లు కూడా లేవు. లోక్ సభలో నలుగురు, రాజ్యసభలో ఐదుగురు మాత్రమే ఉన్నారు. వీరిలో విప్ జారీ చేసినా కాంగ్రెస్ పార్ట నిలబెట్టే అభ్యర్థికి అయినా.. ఇండీ పార్టీ కూటమి నిలబెట్టే అభ్యర్థికి అయినా ఓటు వేసేవారు ఉండరు. స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి విప్ జారీ చేయలేరు. వక్ఫ్ బిల్లు విషయంలోనే ఆయన నాటకాలు బయటపడ్డాయి.
ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి. కేంద్రంలో టీడీపీ కేంద్ర మంత్రులు ఉన్నారు. రాష్ట్రంలో బీజేపీ, జనసేన మంత్రులు ఉన్నారు. ఇలాంటి సమయంలో.. వారికి ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ.. బీజేపీని మాత్రం ప్రత్యర్థిగా చూడలేకపోతోంది. బీజేపీతో సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నిస్తోంది. రాహుల్, చంద్రబాబు మధ్య హాట్ లైన్ అనే పుకార్లు పెట్టి.. మిత్రుల మధ్య చిచ్చు పెట్టాలనుకునే చీప్ ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కానీ అదే కాంగ్రెస్ అధికారంలో ఉంటే.. జగన్ రెడ్డి మోదీపై చేసే విమర్శల గురించి ఊహించడం కూడా కష్టమే.