నాయకులు ఎలా ఉండాలో బొత్స చెబుతుంటేనూ….

గుంటూరు జిల్లాలో న‌వ‌ర‌త్నాలంటూ మంత్రులు, స్పీక‌ర్ తో స‌హా ఓ తొమ్మిదిమందికి ప‌నితీరుపై వైకాపా నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆరోప‌ణ‌లు చేశారు. ఆయ‌న మాట‌లు వింటే.. అవునా, గుంటూరు జిల్లాలో మ‌రీ ఇంత అరాచ‌కంగా ఉందా, పాపం ప్ర‌జ‌లు ఎందుకు భ‌రిస్తున్నారూ, ఎందుకు తిర‌గ‌డ‌బ‌టం లేద‌నిపిస్తుంది! ఆ తొమ్మిది మంది నాయ‌కుల జిల్లాల‌ను దోచుకుని, ప్ర‌జ‌ల్ని పీడించుకుని తినేస్తున్నార‌ని ఆరోపించారు. ఒక భూక‌బ్జాలు, మ‌రొక‌రు బినామీ ఆస్తుల సంపాద‌న‌, మ‌రో ఇద్ద‌రు న‌కిలీల వ్యాపారం… ఇలా చాలాచాలా చెప్పారు! స‌రే, చేసే ఆరోప‌ణ‌ల్లో ఆత్రుతే త‌ప్ప‌, ఒక్క‌దానికీ ఆధారం లేద‌నేది ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు!

అయితే, ఈ సంద‌ర్భంగా నాయ‌కుడు అనేవాడు ఎలా పరిపాలించాలీ, ఎలా వ్య‌వ‌హ‌రించాలానే అంశంపై బొత్స కాస్త ఆస‌క్తిక‌రంగా మాట్లాడారు! దేవుడు నాయ‌కులకు ఒక‌సారి అవ‌కాశం ఇస్తాడనీ, ఆ అవ‌కాశాన్ని ఏర‌కంగా స‌ద్వినియోగం చేసుకోవాలీ అన్నారు బొత్స‌! ఏ ర‌కంగా ప్ర‌జ‌ల్లోకి వ‌చ్చి మ‌మేక‌మ‌వ్వాలీ అన్నారు బొత్స‌! ప్ర‌జ‌లు మ‌న పేరు కొన్నేళ్లపాటు చెప్పుకునే విధంగా, గుర్తుంచుకునే విధంగా.ప‌నిచెయ్యాల‌ని అన్నారు బొత్స‌! అంతేగానీ, ఎక్క‌డ చూసినా అవినీతి కంపు కొట్టే విధంగా ఉండ‌కూడ‌ద‌ని హిత‌వు ప‌లికారు. ‘ఏంటిదంతా… ఏంటిది’ అంటూ బొత్స ఒక సందర్భంలో తీవ్రమైన ఆవేదనకు గురి కావడం గమనార్హం.

అప్పుడెప్పుడో, అంటే వైయ‌స్ హ‌యాంలో కూడా బొత్స‌కు అవ‌కాశం వ‌చ్చింది క‌దా! అదేనండీ.. ఎమ్మెల్యేగా, మంత్రిగా అవకాశం ప్రజలిచ్చారు. ఆయ‌న ఏ విధంగా స‌ద్వినియోగం చేసుకున్నారో ప్ర‌జ‌లకు గుర్తుంది. జిల్లా స‌హాకార బ్యాంకు కుంభ‌కోణం ఆరోప‌ణ‌లు, లిక్క‌ర్ సిండికేట్ లెక్క‌లు, విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ప్ర‌భుత్వ చెరువుల క‌బ్జా, అవుట్ సోర్సింగ్ పోస్టుల్లో అవినీతి, అక్ర‌మ మాంగ‌నీసు త‌వ్వ‌కాలు, జిల్లాలోని న‌దుల నుంచి అక్ర‌మంగా త‌ర‌లించిన ఇసుక‌, ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణంలో అవినీతి, ఇక వోక్స్ వేగ‌న్ వ్య‌వ‌హారం మోస్ట్ పాపులర్..! ఎప్పుడూ ప్ర‌శాంతంగా ఉండే విజ‌య‌న‌గ‌రంలో ఓ ఐదేళ్ల కింద‌ట 144 సెక్ష‌న్ పెట్టాల్సిన ప‌రిస్థితి ఎందుకొచ్చింద‌నేదీ చాలామందికి గుర్తుండే ఉంటుంది.

అంటే, దేవుడు ఇచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డం గురించి బొత్స మాట్లాడుతుంటే… ఇలాంటివ‌న్నీ కొంత‌మందికి గుర్తొస్తాయి. క‌నీసం ఇలాంటి టాపిక్ మీద మాట్లాడించాలంటే బొత్స త‌ప్ప వైకాపాకి వేరే నాయ‌కులే దొర‌క‌లేదా..? ఆరోప‌ణ‌లే క‌దా.. ఎలాగూ ఆధారాలూ చూప‌రు కాబ‌ట్టి, ఎవ‌రు చేసినా ఫ‌ర‌క్ ఉండ‌దు. ఇదిగో ఇలా బొత్స‌లాంటివాళ్లు నీతులు మాట్లాడుతుంటే.. అన‌వ‌స‌రంగా బ్యాక్ స్టోరీలు గుర్తు చేస్తున్న‌ట్టుగానే ఉంటుంది!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com