ఓటింగ్ మీద న‌మ్మ‌కం ఉన్న‌ప్పుడు… కౌంటింగ్ మీద కంగారెందుకు?

వైయ‌స్సార్ సీపీకి అనుకూలంగానే ప్ర‌జ‌ల తీర్పు ఉంటుంద‌న్న ధీమా వైకాపా నేత‌ల్లో బ‌లంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అయితే, ఓట్ల లెక్కింపు ఇంకా జ‌ర‌గాల్సి ఉంది. ఈ నెల 23న ఆ ప్ర‌క్రియ ఉంటుంది. ఈ సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లో పార్టీ ఏజెంట్లు, నాయ‌కుల‌తో వైకాపా ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స‌మావేశ‌మ‌య్యారు. ఓట్ల లెక్కింపు స‌మ‌యంలో చాలా అప్ర‌మత్తంగా ఉండాల‌ని సూచించారు. ఈ ఎన్నిక‌ల్లో ఓట‌మి త‌ప్ప‌ద‌నే తీవ్ర నిరాశ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఉన్నార‌నీ, కాబ‌ట్టి లెక్కింపు స‌మ‌యంలో ఎలాంటి కుట్ర‌లైనా కుతంత్రాలైనా చేయ‌డానికి సిద్ధంగా ఉన్నార‌ని విజ‌య‌సాయి రెడ్డి చెప్పారు.

మ‌హాభార‌తంలో పాండ‌వుల్లాగ ఇన్నాళ్లూ పోరాటం చేశామ‌నీ, ఇన్నేళ్ల క‌ష్టాన్ని వృథా కానీయ‌కుండా చూసుకోవాలంటూ ఏజెంట్లకు ఆయ‌న పిలుపునిచ్చారు. వైయ‌స్సార్ సీపీ విజ‌య‌ప‌థంలో దూసుకెళ్తోంద‌నీ, కాబ‌ట్టి ఓట్ల లెక్కింపు ద‌గ్గ‌ర మ‌రింత జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు. ఎన్నిక‌ల సంఘం ప‌నితీరును మెచ్చుకుంటూ… గ‌తంలో కంటే మెరుగైన ఓటింగ్ విధానాన్ని తీసుకొచ్చార‌నీ, ఎవ‌రికి ఓటేశార‌నేది క‌నిపించేలా వీవీప్యాట్ల‌ను కూడా అందుబాటులోకి తెచ్చార‌ని మెచ్చుకున్నారు. ఈసీ విధానాలు పార‌ద‌ర్శ‌కంగా ఉన్నా కూడా చంద్ర‌బాబు నాయుడు ఎన్నిక‌ల సంఘం మీద ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు. వైకాపా అభ్య‌ర్థులు అత్య‌ధిక ఆధిక్యం ఉన్న చోట సాధ్య‌మైనంత ఎక్కువ అభ్యంత‌రాలు, అనుమానాలు సృష్టించాల‌ని టీడీపీ వ‌ర్గాల‌కు చంద్ర‌బాబు పిలుపునిచ్చారంటూ ఆరోపించారు! కౌంటింగ్ ప్ర‌క్రియ‌కు అవాంత‌రాలు క‌లిగించాల‌ని ఆయ‌నే ఏజెంట్ల‌కు ఆదేశాలు ఇచ్చారంటే, ప‌రిస్థితి అర్థం చేసుకోవాల‌న్నారు.

ఎన్నిక‌ల ప్ర‌క్రియ మీద అంత న‌మ్మ‌కం ఉన్న‌ప్పుడు… ఓట్ల లెక్కింపు మీద కూడా అంతే న‌మ్మ‌కం ఉండాలి క‌దా! వైకాపాకి పెద్ద ఎత్తున ఓట్లు ప‌డ్డాయ‌న్న ధీమా ఉన్న‌ప్పుడు… లెక్కింపులో అవి మారిపోయే ప‌రిస్థితి ఉండ‌దు క‌దా! ఇంకోటి, లెక్కింపు స‌మ‌యంలో అభ్యంత‌రాలు వ్యక్తం చేయాలంటూ టీడీపీ శ్రేణుల‌కు చంద్ర‌బాబు ఆదేశించారని అన‌డానికి ఆధారాలేవీ? ఒక‌వేళ అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసినా, వాస్త‌వ ఫ‌లితం మార‌దు క‌దా! ఎన్నిక‌ల సమ‌యంలో వైకాపాకి అనుకూలంగా ఈసీతో స‌హా కొన్ని అధికార వ‌ర్గాలు ప‌నిచేశాయి. టీడీపీకి అత్యంత వ్య‌తిరేకంగా ఈసీ వ్య‌వ‌హ‌రించింది. ఇలాంట‌ప్పుడు, ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ‌లో టీడీపీ ఎలా ఏదైనా మ‌త‌ల‌బు చేయ‌గ‌ల‌దు..? ఓట్లు ప‌డ్డాక‌.. ఇంకా క‌ష్టం వ్య‌ర్థం కాకుండా చూసుకోవాల‌ని విజ‌యసాయి అంటుంటే ఏమ‌నుకోవాలి? ఒక‌వేళ ఇదే త‌ర‌హా కామెంట్స్ చంద్ర‌బాబు చేసి ఉంటే… అదిగో, ఓట‌మికి సాకులు సిద్ధం చేసుకుంటున్నార‌ని ఆయ‌నే అనేవారా కాదా..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com