రెండు తెలుగు రాష్ట్రాల విభజన పర్వం పూర్తయ్యాక పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చాడు పవన్. ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యథను తన మాటల్లో వినిపించాడు. అంతకుముందు కూడా నాయకులందరూ అవే మాటలు చెప్పారు. కానీ వాళ్ళందరూ కూడా నాయకుల్లానే మాట్లాడారు తప్ప ప్రజల్లో ఒకరిలా మాట్లాడలేకపోయారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరిలాగే నేనూ బాధపడుతున్నాను. ప్రాంతీయ ద్వేషం నన్ను కూడా తాకింది అని ప్రజలందరికీ కనెక్ట్ అయ్యేలా ఎమోషనల్‌గా మాట్లాడేశాడు. స్పీచ్ కూడా అదిరిపోయింది. ప్రజలకు రీచ్ అయింది. ఆ విషయాన్ని ముందుగా పసిగట్టింది చంద్రబాబు అండ్ ఆయన అనుకూల మీడియా వారే. వెంటనే రంగంలోకి దిగిపోయారు. పవన్ కళ్యాణ్ మద్ధతును సాధించారు. చంద్రబాబు, మోడీల గొప్పతనం గురించి పవన్‌ని రకరకాల ప్రశ్నలు అడగడం….ఆయన సమాధానాలను రంగు రంగుల పేజీలలో పుంఖాను పుంఖాలుగా ప్రచురించేయడం లాంటివి చేస్తూ ప్రజలను నమ్మించారు. పవన్ కళ్యాణ్‌ని నిజాయితీపరుడు, దేశ ప్రయోజనాల కోసం పాటు పడే వీరుడు అని అంతకుముందు చెప్పుకొచ్చిన అదే మీడియా……అంతటి గొప్పవాడు ఇప్పుడు మోడీ, చంద్రబాబులను గెలిపించమని కోరుతున్నాడంటే, వాళ్ళకు మద్ధతుగా ప్రచారం చేస్తున్నాడంటే మోడీ, చంద్రబాబులు ఎంత గొప్పవారో మీరే గుర్తించండి, వాళ్ళిద్దరికీ ఓటేయండి అని చెప్పి ప్రజల అభిప్రాయాలను మార్చేసింది. అలాగే వైసిపి హఠావో లాంటి డైలాగులతో పాటు వైఎస్ జగన్ పైన ఎన్ని విమర్శలు చేయించాలో అన్ని విమర్శలూ చేయించారు. ఎన్నికల మహా యుద్ధంలో విజయం సాధించారు.
ఇప్పుడు కూడా చంద్రబాబు కానీ ఆయన అనుకూల మీడియా కానీ అదే స్టాండ్ తీసుకుని ఉంటే విమర్శించాల్సిందేమీ లేదు. ఎక్కువ శాతం మీడియా సంస్థలు ఏదో ఒక పార్టీకి మద్ధతుగా ఉన్నవే కనుక వీళ్ళు కూడా టిడిపి, బిజెపి, పవన్‌లకు సపోర్ట్‌గా ఉన్నారనుకోవచ్చు. కానీ 2019లో సొంతంగా పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నాడు. ఆ విషయం కూడా చంద్రబాబు అండ్ ఆయన అనుకూల మీడియాకే ముందుగా తెలిసిపోయింది. 2014లో టిడిపి అధికారంలోకి రావడానికి కారణమైన గోదావరి జిల్లాలలో పవన్ ప్రభావం ఉంటుందని భావించారు. 2014లో టిడిపిని సపోర్ట్ చేసిన కాపు వర్గం ఓట్లు ఎక్కడ చీలిపోతాయోనని భయపడ్డారు. అంతే…..కేవలం రెండేళ్ళ వ్యవధిలో, ఏ పదవీ చేపట్టకుండానే, ప్రత్యేక హోదాతో సహా కొన్ని ప్రజా సమస్యలపైన ఎంతో కొంత పోరాటం చేస్తున్న పవన్ క్రేజ్ అమాంతం పడిపోయింది అని ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. ప్రజలెవ్వరూ పవన్‌ని నమ్మడం లేదట. అసలు జనసేనను ఒక రాజకీయ పార్టీగానే గుర్తించడం లేదట. పవన్ కళ్యాణ్‌ని నాయకుడిలా చూస్తున్న వాళ్ళందరూ కూడా యువతేనట. అది కూడా పట్టుమని పదిశాతం మంది కూడా లేరట.
2014లో పవన్ వ్యక్తిత్వం గురించి, నాయకత్వ లక్షణాల గురించి గొప్పగా రాతలు రాసింది వాళ్ళే. 2019నాటికి పవన్ వ్యక్తిత్వాన్ని, నాయకత్వ లక్షణాలను, పవన్‌కి ఉన్న ప్రజాదరణను పూర్తిగా తగ్గించి చూపాలన్న ప్రయత్నం చేస్తున్నది కూడా వాళ్ళే. తెలుగు ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అనుక్షణం పాటుపడుతున్నామని మాటలు చెప్తూ ఉంటారు. కానీ చేతల్లో మాత్రం స్వార్థ ప్రయోజనాలే కనిపిస్తున్నాయి. 2014లో పవన్ గురించి వాళ్ళు రాసిన రాతలు, ఇప్పటి నుంచి 2019వరకూ వాళ్ళు రాయబోయే రాతలే దానికి సాక్ష్యం. 2014ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా అంటే అక్షయ పాత్ర, బ్రహ్మాండమైన ప్రయోజనాలు ఉంటాయి. మోడీ, బాబులకు ఓటేస్తేనే హోదా వస్తుంది అని చెప్పింది అదే మీడియా సంస్థలే. ప్రత్యేక హోదా పరమ వేస్ట్ అని చెప్పి ఇప్పుడు రాతలు రాస్తుంది కూడా వాళ్ళే. ఇలాంటివన్నీ చూశాక కూడా ఆ రాతలు నమ్మాలా? వద్దా? వాళ్ళకు సపోర్ట్ చేయాలా? వద్దా? అనే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.