చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్.. వీళ్లు అగ్ర హీరోలు.
మహేష్, పవన్, ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్, బన్నీ వీళ్లు తరవాతి తరం.
ఈ రెండు లీగ్ లోని హీరోలకూ ఓ అడ్వాంటేజ్ ఉంటుంది. వీళ్లు క్రౌడ్ పుల్లర్లు. వీళ్ల సినిమా విడుదల అవుతోందంటే.. దర్శకుడెవరు? జోనర్ ఏమిటి? సీజన్ ఏమిటి? అనే ప్రశ్నలతో సంబంధం లేకుండా మంచి వసూళ్లు వస్తాయి. ఆ తరవాత టాక్ బాగుంటే వసూళ్లు నిలబడతాయి. అంటే మినిమం నెంబర్ తో ఓపెనింగ్స్ తీసుకోవడం వీళ్ల సినిమాలకున్న అడ్వాంటేజ్.
అయితే యంగ్ హీరోలు.. అంటే విజయ్‌దేవరకొండ, శర్వానంద్, సిద్దు జొన్నలగడ్డ, నవీన్ పొలిశెట్టి, వరుణ్‌తేజ్, రామ్, సాయిధరమ్ తేజ్, విశ్వక్సేన్, అఖిల్, నిఖిల్, శ్రీవిష్ణు.. వీళ్లు ఆ స్థాయిలో క్రౌడ్ పుల్లింగ్ చేయలేకపోతున్నారు. వీళ్ల సినిమాలకూ డబ్బులొస్తాయి. నిర్మాతలు లాభపడతారు. కాకపోతే.. టాక్ బాగుండాలి. ‘చూడాలి’ అనే ఆసక్తిని వీళ్ల సినిమాలు క్రియేట్ చేయగలగాలి. ఈవారం ‘ఫంకీ’ అనే సినిమా విడుదలైంది. ఈ సినిమాకు కనీసం ఓపెనింగ్స్ రాలేదు. విశ్వక్ లాంటి యంగ్ హీరో క్రౌడ్ పుల్లింగ్ చేయలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
విజయ్ దేవరకొండ సినిమాలకు ఆమధ్య ఓపెనింగ్స్ బాగుండేవి. డిజాస్టర్ గా మిగిలిన `లైగర్`కి సైతం మంచి ఓపెనింగ్సే వచ్చాయి. కానీ ఆ హంగామా ఆ తరవాత తగ్గింది. వరుణ్‌తేజ్, సాయిధరమ్ తేజ్‌లకు మెగా ముద్ర ఉంది. వాళ్లకు ఆ అభిమానుల బ్యాకప్ వుంది. అయినా సరే.. వీళ్ల సినిమాలకూ ‘టాక్’ బాగుండాల్సిందే. టిల్లు సినిమాలతో సిద్దుకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ‘జాక్’ ఫ్లాప్ అవ్వడంతో మళ్లీ తగ్గిపోయాడు. ‘తెలుసు కదా’కి ఆశించిన ఓపెనింగ్స్ రాలేదు. సంక్రాంతి సీజన్లో రావడం ‘అనగనగా ఒకరాజు’కి బాగా కలిసొచ్చింది. అయితే ఇదే టెంపో తరవాత కూడా నవీన్ కొనసాగిస్తాడా, లేదా? అనేది చూడాలి.
ఓటీటీలు వచ్చేశాక ఓ బ్యాచ్ సినిమాల్ని ఓటీటీలో చూడ్డానికి అలవాటు పడిపోయారు ప్రేక్షకులు. ‘ఎలాగూ ఓటీటీలో వస్తుంది కదా’ అనే ధీమాతో థియేటర్ల వైపు అడుగులు వేయడం లేదు.
యంగ్ బ్యాచ్‌లో నాని ఒక్కడికే క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉంది. తన సినిమాలకు ఎప్పుడూ మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. యావరేజ్ మార్కులు తెచ్చుకొన్న సినిమాని సైతం.. తన పబ్లిసిటీతో హిట్ జోన్ లో పడేస్తాడు నాని. ఫ్యామిలీ ఆడియన్స్ నాని సినిమాలకు బ్యాక్ బోన్. వాళ్ల సపోర్ట్ తో తన మార్కెట్ పరిధిని పెంచుకొంటూ వెళ్తున్నాడు నాని. విజయ్ దేవరకొండ, శర్వానంద్, శ్రీవిష్ణు, సాయిధరమ్ తేజ్.. వీళ్లూ మెల్లమెల్లగా క్రౌడ్ పుల్లర్స్ గా ఎదగాల్సిన అవసరం ఉంది. అది జరగాలంటే నానిలా క్రమం తప్పకుండా హిట్లు కొడుతూ ఉండాలి. ప్రేక్షకుల భరోసా దక్కించుకోవాలి. కంటెంట్ విషయంలో తప్పులు చేయకుండా కెరీర్‌ని నిర్మించుకోవాలి. అప్పుడే ఈ యంగ్ హీరోలంతా క్రౌడ్ పుల్లర్స్ కాగలరు.


