తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుల్ని, ప్రధాన కార్యదర్శుల్ని ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే యువనేతలకు ప్రాధాన్యం ఇచ్చారు. భవిష్యత్తు నాయకత్వాన్ని సిద్ధం చేసే క్రమంలో చురుగ్గా ఉండే యువతకు, వివాదరహిత నేతలకు జిల్లా పగ్గాలు అప్పగించారు. కిమిడి నాగార్జున, జ్యోతుల నవీన్,మంతెన రామరాజు, ఉగ్రనరసింహారెడ్డి, ఎమ్మెస్ రాజు, సుగవాసి ప్రసాద్ బాబు వంటి వారికి జిల్లాలలో టీడీపీని నడిపే అవకాశం ఇప్పించారు.
అటు మహిళలకు కూడా 33% వరకు కోటా ఉండేలా పార్టీ అధిష్ఠానం కసరత్తు చేసింది. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలిగా గద్దె అనురాధ, తిరుపతి జిల్లాకు పనబాక లక్ష్మి వంటి సీనియర్ మహిళా నేతలకు బాధ్యతలు అప్పగించడం పార్టీలో మహిళా ప్రాతినిధ్యాన్ని పెంచారు. అదే సమయంలో ఈ నియామకాల్లో చంద్రబాబు నాయుడు సోషల్ రీ-ఇంజనీరింగ్ వ్యూహాన్ని అమలు చేశారు. పార్టీ మూలస్తంభాలైన బీసీలకు సింహభాగం పదవులు కేటాయించారు. ప్రతి జిల్లాలో ఉన్న స్థానిక కుల సమీకరణాలను బేస్ చేసుకుని, ఆయా వర్గాలకు తగిన గుర్తింపు ఇచ్చేలా జాగ్రత్త పడ్డారు.
ముఖ్యంగా గత ఎన్నికల్లో మద్దతుగా నిలిచిన వర్గాలకు పార్టీలో సముచిత స్థానం కల్పించి, వారిని నిలుపుకోవడమే లక్ష్యంగా ఈ ఎంపికలు సాగాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తి కావడంతో, వచ్చే మూడేళ్ల కాలానికి పార్టీని క్షేత్రస్థాయిలో సిద్ధం చేయడం ఈ నియామకాల ప్రధాన ఉద్దేశం.
