వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన జీవితాంతం మతతత్వ, విభజన , రాజీ పడే శక్తులకు వ్యతిరేకంగా పోరాడారని అలాంటి నేతకు తలవొంపులు తీసుకురావొద్దని యూత్ కాంగ్రెస్.. జగన్ మోహన్ రెడ్డికి సలహా ఇచ్చింది. సిబిఐ, ఈడి కేసులను ఎదుర్కొంటున్న విషయం మాకు తెలుసని, అయినా కనీసం మీ తండ్రి ఆశయాలను, ఆయన వారసత్వాన్ని ఇలా బహిరంగంగా దిగజార్చవద్దని సూచించింది. యూత్ కాంగ్రెస్ కు కోపం రావడానికి కారణం ఉంది.
ఏఐ సమ్మిట్ లో అర్థనగ్న నిరసన చేశారు యూత్ కాంగ్రెస్ సభ్యులు. వారిపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇలా చేయడాన్ని బీజేపీ కూటమి పక్షాలన్నీ ఖండించాయి. ఇలాంటి సమయంలో తమ మద్దతు లేకపోతే ఇంకా సమస్యలు వస్తాయని జగన్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రపంచ దేశాల ప్రతినిధుల ముందు భారత్ ప్రతిష్టను మసకబార్చేలా యూత్ కాంగ్రెస్ నేతలు ప్రవర్తించడం అక్షేపణీయమని వైఎస్ జగన్ అననారు. రాజకీయ విభేదాలు ఏవైనా ఉండవచ్చు కానీ, అంతర్జాతీయ వేదికలపై దేశం ఐక్యంగా కనిపించాలని, భారత్‌ను ప్రపంచం ముందు చులకన చేయడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. దీనిపైనే యూత్ కాంగ్రెస్ స్పందించింది.
యూత్ కాంగ్రెస్ కు అంబటి రాంబాబు ట్వీట్ కౌంటర్ ఇచ్చారు. వైఎస్సార్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చి, ఆయన మరణానంతరం గౌరవాన్ని తగ్గించేలా ప్రవర్తించింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. తమ రాజకీయ అవసరాల కోసం చరిత్రను వక్రీకరిస్తూ ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. తాము జాతీయ ప్రయోజనాల విషయంలో బీజేపీతో ఉంటున్నామని రాష్ట్రపతి ఎన్నికలు, పార్లమెంట్లో కీలక బిల్లుల విషయంలో మద్దతిచ్చామని చెప్పుకొచ్చారు.
