చంద్రబాబే మద్యం కేసులో బెయిల్ పై ఉన్నారని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. తనపై ఉన్న కేసుల్ని కొట్టివేయించుకునేందుకు ఇప్పుడు తాను అవలంభిస్తున్న విధానం సముచితం అని చెప్పుకునేందుకు లిక్కర్ కేసులు పెట్టారట. జగన్ రెడ్డి అదే అంటున్నారు. మిథున్ రెడ్డి అరెస్టు అయిన తర్వాత ఇంగ్లిష్ లో ఓ చాటభారతమంత స్క్రిప్టును రాసి పోస్టు చేశారు. అది చాలదన్నట్లుగా నిజాలంటూ ఓ అటాచ్మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఇందులో సిట్ చూపించిన ఆధారాల గురించి మాట్లాడలేదు. కానీ వాంగ్మూలాలతోనే అదుపులోకి తీసుకున్నట్లుగాచెబుతున్నారు.
సిట్ చాలా శాస్త్రీయంగా ఫోరెన్సిక్ ఆధారాలతో సహా అందర్నీ అరెస్టు చేశారు. ప్రాథమిక చార్జిషీటు దాఖలు చేసింది. అందులో మిథున్ రెడ్డి ఏం చేశారో వివరించారు. వాటికి ఆధారాలు కూడా సమర్పించారు. అయినా కక్ష సాధింపు అరెస్టులని రాజకీయం చేస్తున్నారు జగన్. తానే అసలు ప్రధాన దోపిడీదారుడినని ఇవాళ కాకపోతే రేపు తన మీదకు కేసు వస్తుందని ఆయనకు బాగా తెలుసు. అందుకే ఇంగ్లిష్ లో జాతీయ మీడియాకు తెలిస్తే చాలన్నట్లుగా పెద్ద పోస్టింగ్ పెట్టారు. లిక్కర్ స్కామ్ గురిచి జాతీయ స్థాయిలో తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
లిక్కర్ తయారీ, రవాణా పంపిణీ, ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఇలా చెప్పుకుంటూ పోతే.. మొత్తం పెద్ద స్కామ్. ఆ క్యాష్ ను రూటింగ్ చేయడానికి అనేక బినామీ కంపెనీలు. అన్నింటి గుట్టు రట్టు అయిపోయింది. పాత నేరస్తుడు అయిన జగన్.. తాను సీఎంగా ఉన్నప్పుడు 2014-19 మధ్య ఏమీ లేకపోయినా.. ఏదో జరిగిందని నాలుగున్నరేళ్లకు కేసులు పెట్టారు. కానీ కోర్టు ముందు అసలేమీ చూపించలేకపోయారు. తన లిక్కర్ స్కామ్ బయట పడితే.. దాన్ని ఇలా వాడుకోవచ్చని చంద్రబాబుపై అప్పుడు కేసు పెట్టినట్లుగా ఉందని ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది.