పెజా సేవ చేయాలన్న కసి అన్న మాటల ముసుగును తీసేస్తే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే ప్రతివాడికీ కూడా పదవే అంతిమ లక్ష్యం అయిపోయిన కాలమిది. ఎలాంటి పదవులూ ఆశించకుండా, వ్యక్తిగత స్వార్థం అస్సలు లేకుండా పూర్తిగా ప్రజాసేవకే పరిమితమయ్యే రాజకీయ నాయకులు చరిత్ర పుస్తకాల్లో తప్ప వాస్తవ ప్రపంచంలో ఒక్కరైనా ఉన్నారన్న నమ్మకం ప్రజలకు కూడా లేదు కాబట్టి పదవుల కోసమే రాజకీయాల్లోకి వస్తున్న నాయకులను కూడా అంగీకరిస్తున్నారు. కానీ కనీసం ఆ కుర్చీ ఎక్కిన తర్వాత ఏం చేస్తాడు? ఎలాంటి పరిపాలన చేస్తాడు? అనే విషయంలో కొంచెం అయినా స్పష్టత ఉన్నవాళ్ళను గద్దెనెక్కిస్తున్నారు ప్రజలు. వైఎస్ జగన్‌కి కుర్చీ ఎక్కాలన్న ఆశ, ఆశయం గట్టిగానే ఉంది. అందుకే కోట్ల రూపాయల సంపాదనా పరుడైనప్పటికీ ఎప్పుడూ కూడా ఏదో ఒక యాత్రల పేరుతో ప్రజల మధ్యన ఉంటున్నాడు. కానీ ఆ ఒక్కటీ సరిపోతుందా?
2014ఎన్నికల సమయంలో తాను ముఖ్యమంత్రిని అయితే ఏం చేయగలను? తన అనుభవంతో రాష్ట్రాన్ని ఎలా ఉద్ధరించగలను? ప్రత్యేక హోదా, పోలవరం, రైల్వేజోన్లతో సహా కేంద్రం ఇవ్వాల్సిన అన్నింటినీ ఎలా తీసుకురాగలను? అలాగే ప్రజలకు రుణమాఫీలతో సహా ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయగలను? అనే విషయాలన్నీ నమ్మకంగా చెప్పాడు చంద్రబాబు. ఈ రోజుకీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చంద్రబాబు ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలన్నీ గుర్తున్నాయి. మరి జగన్ చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు ఎవరికైనా గుర్తున్నాయా? రాజధాని నిర్మాణం ఎలా చేస్తాడు? కేంద్రం నుంచి రావాల్సిన హామీలను ఎలా తీసుకొస్తాడు అనే విషయాలపైన జగన్ ఎప్పుడైనా మాట్లాడాడా? చంద్రబాబును తిట్టిన తిట్లు, వైఎస్సార్‌ని గుర్తుకుతెచ్చేలా మాట్లాడిన మాటలు మినహా జగన్ విధానాల గురించి కనీసం ఆయన పార్టీ నేతలకైనా తెలుసా? జాతీయ స్థాయిలో మోడీ అధికారంలోకి రావడం ఖాయం అని కచ్చితంగా తెలిసిన తర్వాత కూడా….ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటాం, మంత్రి పదవులు ఎవరు ఇస్తే వాళ్ళతో పొత్తు పెట్టుకుంటాం అన్న పాటే పాడాడు జగన్. మరి 2014లో జగన్ అధికారంలోకి వచ్చి ఉంటే నరేంద్రమోడీ ఆయనకు మంత్రి పదవులు ఇచ్చి ఉండేవాడా? వైకాపా, బిజెపిల మధ్య పొత్తుకు అవకాశం ఉండేదా? మోడీకి పూర్తి మెజారిటీ వస్తే అప్పుడు ఏం చేయాలి అనే విషయం గురించి జగన్‌కి కొంచెం కూడా స్పష్టత ఉండి ఉండదు. అలాంటి ఇమ్మెచ్యూర్ పొలిటీషియన్ అయిన జగన్ కంటే మోడీ పవర్లోకి వస్తాడన్న విషయం పసిగట్టి, మోడీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఇంటెలిజెంట్ కాదా? కాకపోతే గోద్రా ఘటన టైంలో చంద్రబాబు తిట్టిన తిట్లను మనసులో పెట్టుకున్నాడో, లేక ఓటుకు నోటు కేసుతో చంద్రబాబే లొంగిపోయాడో, లేక వేరే ఏదైనా కారణం ఉందేమో తెలియదు కానీ నరేంద్రమోడీ…చంద్రబాబును కేర్ చేయడం లేదు అన్న విషయం మాత్రం కంటికి కనిపిస్తున్న నిజం.
వైఎస్ జగన్‌కి అమితానందం కలిగిస్తున్న విషయం కూడా ఇదే. 2019 వరకూ ఆంధ్రప్రదేశ్‌కి నరేంద్రమోడీ ఏమీ చేయడు. ఆ వైఫల్యాన్ని కూడా తన ప్రచార బలంతో మేనేజ్ చేస్తూ సాగాల్సిన పరిస్థితి చంద్రబాబుది. అలాగే రుణమాఫీలతో సహా తాను ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా అమలు చేయలేడు చంద్రబాబు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం, రాజధాని నిర్మాణంతో సహా రుణమాఫీల హామీల విషయంలో కూడా చంద్రబాబు ఫెయిలవుతున్నాడు కాబట్టే బాబుపైన వ్యతిరేకత పెరుగుతోంది. బాబు వ్యతిరేకతే తనను గెలిపిస్తుందన్న నమ్మకం జగన్‌కి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎమ్మెల్యే నియోజకవర్గాలు పెరిగే అవకాశం లేకపోవడం కూడా జగన్‌కి కలిసొచ్చే అంశమే. కానీ బాబుపైన కోపంతో జగన్‌ని గెలిపిస్తే ప్రజలకు ఒరిగేదేంటి? ప్రత్యేక హోదా, ఆర్థికలోటు భర్తీ, రైల్వే జోన్‌లాంటి విషయాల్లో జగన్ సక్సెస్ అవ్వగలడా? ఎలా సక్సెస్ అవుతాడు? ఎలా సాధిస్తాడు? అనే విషయాలపైన జగన్‌కి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? చంద్రబాబు విజయం సాధించలేని చోట…. తాను గెలవగలనన్న నమ్మకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇవ్వగలడా? రాజధాని నిర్మాణంతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలపైన తన ఆలోచనలు, విధానాలు ఏంటి అనే విషయంలో స్పష్టత లేకుండా జగన్ సిఎం అయితే ఎవరికి ఉపయోగం? నేనే సిఎం, నేనే సిఎం అని జగన్ చెప్పుకోవచ్చేమో కానీ…ఆయన ముఖ్యమంత్రి అయినంత మాత్రానా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒరిగేదేముంటుంది? కుర్చీ ఎక్కడం గురించి ఆశపడుతున్న, ఆలోచిస్తున్న స్థాయిలో కాస్త ఆంధఫ్రదేశ్ రాష్ట్రం, ప్రజల సమస్యల గురించి కూడా ఆలోచించాలయ్యా కాబోయే ముఖ్యమంత్రి జగన్ సారూ…….?