రాయలసీమ ఎత్తిపోతల పథకం చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేగుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రాజెక్టును ప్రారంభించడం, పర్యావరణ అనుమతులు లేకపోవడం, చివరకు జాతీయ హరిత ట్రైబ్యునల్ విధించిన జరిమానా వంటి అంశాలు రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారాయి. జగన్ మోహన్ రెడ్డి తన ఫ్యాక్షన్ రాజకీయ పాలసీని ఇక్కడ కూడా అమలు చేయడమే ఏపీకి పెనుశాపంగా మారుతోంది.
అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రానికి తీరని నష్టం
ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన కృష్ణా నదీ జలాల వినియోగంలో రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేస్తామని చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని జగన్ ప్రారంభించారు. ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా, కనీసం సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయకుండానే ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టడం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసింది. సాధారణంగా ఏదైనా భారీ సాగునీటి ప్రాజెక్టు చేపట్టేటప్పుడు కేంద్ర జలశక్తి శాఖ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు , పర్యావరణ శాఖల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోవాలి. కానీ, గత ప్రభుత్వం 2020 మే 5న జీవో నం. 203 ద్వారా రూ. 3,272 కోట్లతో ఈ ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు ఇచ్చింది. డీపీఆర్ లేకుండానే పనులు ప్రారంభించడం, అంతర్రాష్ట్ర జల వివాదాలను చర్చల ద్వారా కాకుండా ఏకపక్ష నిర్ణయాలతో క్లిష్టం చేయడం వల్ల పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో విభేదాలు తారాస్థాయికి చేరాయి.
ఎన్జీటీ మొట్టికాయలు – జరిమానాల పర్వం
పర్యావరణ అనుమతులు లేకుండా పనులు సాగిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లపై జాతీయ హరిత ట్రైబ్యునల్ తీవ్రంగా స్పందించింది. పర్యావరణానికి జరిగిన నష్టానికి గానూ ఏపీ ప్రభుత్వానికి భారీ జరిమానా విధించడమే కాకుండా, పనులను నిలిపివేయాలని ఆదేశించింది. ఒక ప్రభుత్వం నిబంధనలను అతిక్రమించి పనులు చేయడం వల్ల ప్రజాధనం జరిమానాల రూపంలో వృథా అవ్వడమే కాకుండా, న్యాయస్థానాల్లో రాష్ట్ర ప్రతిష్ఠ దిగజారింది. ప్రాజెక్టు పనులు ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే నిలిపివేయాల్సిందిగా వచ్చింది. ఇప్పుడు ఆ తప్పిదాన్ని సవరించి.. ఆ ప్రాజెక్టును నిర్మించడం అసాధ్యం. ఎన్జీటే కేసులు ఇప్పుడల్లా తేలవు.
సీమతో పాటు ఏపీ ప్రయోజనాలకు భంగం
ఏకపక్ష నిర్ణయాల వల్ల కృష్ణా బోర్డులో ఆంధ్రప్రదేశ్ వాదన బలహీనపడింది. తెలంగాణ ప్రభుత్వం కూడా దీనికి ప్రతిగా కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి ఇది ఒక సాకుగా మారింది. జగన్ హయాంలో అనుసరించిన ఈ ఫ్యాక్షన్ తరహా మొండి వైఖరి వల్ల సీమతో పాటు రాష్ట్రానికి నీటి వాటా దక్కకపోగా, కేంద్రం వద్ద కూడా ఏపీ దోషిగా నిలబడాల్సి వచ్చింది. రాజకీయ లబ్ధి కోసం లేదా వ్యక్తిగత ప్రతిష్ట కోసం ప్రాజెక్టులను నిబంధనలకు విరుద్ధంగా చేపడితే నష్టపోయేది ప్రజలే. రాయలసీమ లిఫ్ట్ విషయంలో జరిగిన తప్పులు ఆ ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లాయి. ఇలాంటి నేతల తీరుతో .. ప్రజా జీవితాలు, రాష్ట్ర ప్రయోజనాలు ఎలా ప్రభావితమవుతాయో.. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషనే అతి పెద్ద ఉదాహరణ.
