నాయకుడనేవాడు ముందుండి నడిపించాలి. అణువణువునా ధైర్యం, ఆత్మవిశ్వాసం కనిపించాలి. సోనియాగాంధీని ఎదిరించి, ఆవేశంగా బయటికొచ్చి, సొంతంగా పార్టీ పెట్టి, దేశంలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎంపీల సరసన చోటు సాధించినప్పుడు చాలా మందికి హీరో అయ్యాడు వైఎస్ జగన్. ధైర్యం అని చెప్పలేంగానీ అప్పట్లో జగన్‌కి తెగింపు మాత్రం చాలా ఎక్కువ ఉండేది. అలాగే ఆయన గురించి ఆయనే చెప్పుకున్నట్టుగా ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఓవర్‌గానే ఉండేది. అయితే ఒకసారి కేసుల ఎఫెక్ట్ పడిన తర్వాత నుంచీ మాత్రం ఆ హీరోయిజం మొత్తం పోయింది. మానుకోట సంఘటనతో మళ్ళీ తెలంగాణాలో అడుగుపెట్టే ధైర్యం చేయలేకపోయాడు. కెసీఆర్‌తో సంధి చేసుకున్నాడన్న మాట వాస్తవం. కడప పౌరుషానికి-ఢిల్లీ విలన్స్‌కి మధ్య పోరు అని చెప్పి మొదట్లో సోనియా గాంధీపైన కూడా ఘాలు విమర్శలు చేసిన జగన్…కోర్టు కేసుల దెబ్బ పడిన తర్వాత మాత్రం సోనియాను విమర్శించే ధైర్యం చేయలేకపోతున్నాడు. అలాగే నరేంద్రమోడీతో కూడా ఈ యువనేతకు రహస్య ఒప్పందాలేవో ఉన్నట్టే ఉన్నాయి. దేశంలో ఉన్న మిగతా నాయకులందరి దగ్గరా తగ్గడానికే అలవాటుపడిన జగన్…ఒక్క చంద్రబాబు విషయంలో మాత్రం అంతెత్తున లేస్తూ ఉంటాడు. చంద్రబాబు కథ కూడా సేం టు సేం. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోనియాగాంధీతో కుమ్మక్కయ్యాడు. ఓటుకు నోటు కేసు తర్వాత నుంచి కెసీఆర్, నరేంద్రమోడీలతో కాంప్రమైజ్ అవడం స్టార్ట్ చేశాడు. ఓ వైపు తను ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతున్నాడు. మరోవైపు కేంద్రం ఇవ్వాల్సిన హామీల గురించి గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు. కేసీఆర్‌తో కూడా సర్దుకుపోవాల్సిన పరిస్థితి. చంద్రబాబు ప్రభుత్వంపైన రోజు రోజుకూ ప్రజా వ్యతిరేకత పెరుగుతూనే ఉంది.
అసెంబ్లీలో భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలు, ప్రజాక్షేత్రంలో కూడా అధికార పార్టీతో ఇంచుమించుగా సరిసమానమైన ఓట్ల శాతం ఉన్న ఒక ప్రతిపక్షనేతకు ఇంతకు మించిన అవకాశాలు ఏవీ ఉండవు. ప్రతిపక్షం అంత బలంగా ఉన్నప్పుడు ఏదైనా తప్పు చేయాలంటే అధికార పార్టీ నేతలు భయపడాల్సిన పరిస్థితులు ఉండాలి. ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకోవాలన్నా, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. కానీ అటు ప్రధాని నరేంద్రమోడీ కానీ, ఇటు చంద్రబాబు నాయుడు కానీ వైఎస్ జగన్‌ని కనీసం కేర్ చేసే పరిస్థితులు కూడా లేవు. నరేంద్రమోడీని విమర్శించే దమ్ము వైఎస్ జగన్‌కి ఎలాగూ లేదు. కానీ చంద్రబాబును కూడా భయపెట్టలేకపోతున్నాడు జగన్. 144 సెక్షన్ విధించి మరీ ప్రజల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నా, రుణమాఫీ పేరు చెప్పి రైతులను, మహిళలను మోసం చేసినా జగన్ చేయగలిగింది ఏమీ లేదు. అదేంటంటే చంద్రబాబుకు మీడియా బలం ఉంది, మోడీ, కేసీఆర్ కాళ్ళు పట్టుకుని మేనేజ్ చేసుకుంటున్నాడు, సిసలైన హీరో మా జగనే అని మాత్రం వైసీపీ నేతలు కహానీలు చెప్తూ ఉంటారు. లేకపోతే జీవితాంతం సానుభూతి కబుర్లు, ఓదార్పు యాత్రలతో కాలం గడిపేస్తూ…. తండ్రిలేని పిల్లాడు… అన్న సానుభూతిని ప్రజల దగ్గర కొట్టేద్దామని చూస్తూ ఉంటారు. జగన్ ట్రేడ్ మార్క్ ఓదార్పు లక్షణాలు అయిన ఇవి అసలు నాయకుడి లక్షణాలే కాదు.
వైఎస్ జగన్ పాసా…ఫెయిలా? అని డిస్కస్ చేయాలంటే ప్రతిపక్షనాయకుడిగా ఆయన ఏం సాధించాడు? అనే విషయం గురించి మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్ వచ్చేలా చేయగలిగాడా? లేకపోతే చంద్రబాబునాయుడు ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ నెరవేర్చేలా ఒత్తిడి తీసుకురాగలిగాడా? ప్రజల దగ్గర నుంచి బలవంతంగా భూములు లాక్కోకుండా చేయగలిగాడా? ఓదార్పుయాత్రలు, సభలు, సమావేశాలు, నిరాహార దీక్ష డ్రామాలు కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా జగన్ చేసిన ఒక్క కార్యక్రమం కానీ, లేకపోతే మోడీ, చంద్రబాబులపైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ చేత చేయించిన ఒక్క కార్యక్రమం కానీ ఏదైనా ఉందా? చంద్రబాబు ఫెయిలా? పాసా? అన్న విషయం పక్కన పెడితే ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ సినిమా మాత్రం డిజాస్టర్.