వైఎస్ కుటుంబంలో ముదిరిన ఆస్తి వివాదం, సొంత తల్లి , చెల్లిపై జరుగుతున్న తప్పుడు ప్రచారం, ఈ వ్యవహారంలో జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న తీరును అసహ్యించుకునేలా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రయోజనాల కోసం కన్నతల్లి , తోడబుట్టిన చెల్లి వ్యక్తిత్వాన్ని కూడా దారుణంగా కించ పరుస్తున్నారు. తల్లి తన కోసం చేసిన త్యాగాలను మర్చిపోయారు.
జగన్ కోసం రోడ్డునపడ్డ విజయమ్మ
వైఎస్ఆర్ మరణానంతరం జగన్ రాజకీయ భవిష్యత్తు కోసం విజయమ్మ పడరాని పాట్లు పడ్డారు. తన వయసును కూడా లెక్కచేయకుండా, రాజకీయాల గురించి పెద్దగా అవగాహన లేకపోయినా, కుమారుడి కోసం రోడ్లెక్కి ప్రచారం చేశారు. నాడు అసెంబ్లీలో బొత్స సత్యనారాయణ వంటి నేతల నుంచి వ్యక్తిగత విమర్శలు ఎదుర్కొన్నా, కుమారుడిని రక్షించుకోవడమే లక్ష్యంగా అవమానాలను భరించారు. కానీ, నేడు అదే కుమారుడు తన తల్లిని చంద్రబాబు మనిషి అని ముద్ర వేయడం అంతకంటే పెద్ద అవమానం మరొకటి ఉండదు.
అక్రమాస్తుల కోసం కొట్లాట – మళ్లీ చంద్రబాబు వెనుక దాక్కునే వ్యూహం
అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయల ఆస్తులను పంచుకోవడంలో వచ్చిన వివాదం చివరకు వీధికి ఎక్కడం వైఎస్ కుటుంబ పరువును బజారున పడేసింది. షర్మిలకు తండ్రి ఇచ్చిన ఆదేశం ప్రకారం దక్కాల్సిన వాటాను ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా, ఆమెను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూడటం జగన్ సంకుచిత మనస్తత్వానికి నిదర్శనమని విమర్శలు వస్తున్నాయి. తన కన్నతల్లి విజయమ్మ నోటరీ చేసిన లేఖను విడుదల చేసినా, ఆమెను సానుభూతితో చూడాల్సింది పోయి, ఆమె వెనుక చంద్రబాబు ఉన్నారని మీడియాలో, సోషల్ మీడియాలో తన అనుచరుల ద్వారా ప్రచారం చేయించడం జగన్ కనుసన్నల్లోనే జరుగుతోందని స్పష్టమవుతోంది.
ఇంటి గొడవలో చంద్రబాబు పేరు తెస్తారా?
రాజకీయాల్లో ప్రత్యర్థులను విమర్శించడం సహజం, కానీ ఇంటి గొడవను కూడా ప్రత్యర్థులతో ముడిపెట్టడం దిగజారుడుతనానికి పరాకాష్ట. తనపై తల్లి చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పలేక, ఆ చర్చను పక్కదారి పట్టించేందుకు ఇతర నేతలతో బూతులు తిట్టించడం జగన్ మార్క్ రాజకీయంగా మారిపోయింది. రోజా వంటి నేతలను రంగంలోకి దింపి మహిళా నేతలను, చంద్రబాబును దూషించడం ద్వారా తన కుటుంబ వివాదం నుంచి ప్రజల దృష్టిని మళ్లించవచ్చని ఆయన భావిస్తున్నారు. అయితే, ఒక కొడుకుగా తల్లికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వని వ్యక్తి, రేపు ప్రజలకు ఏ రకమైన భరోసా ఇస్తారనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది.
పతనానికి దగ్గరలో జగన్
కన్నతల్లిని సైతం పరాయి వ్యక్తిగా చూస్తూ, ఆమెపై తప్పుడు ప్రచారం చేయిస్తున్న ఈ క్షుద్ర రాజకీయాలకు కాలం చెల్లిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అధికారం, ఆస్తి వ్యామోహంలో పడి కన్నవారిని ఛీత్కరించుకోవడం సభ్య సమాజానికి మంచి సందేశం ఇవ్వదు. తల్లిపై జరుగుతున్న ఈ దాడిని చూసి ప్రజలు జగన్ వ్యక్తిత్వాన్ని అసహ్యించుకుంటున్నారని, ఇలాంటి నాయకులు రాజకీయాల్లో కొనసాగడం రాష్ట్రానికే దురదృష్టమని సామాన్య జనం అభిప్రాయపడుతున్నారు. కుటుంబ విలువలకు తిలోదకాలిచ్చి చేస్తున్న ఈ ప్రచారం చివరికి జగన్ పతనానికే దారితీసేలా కనిపిస్తోంది.
